ఈ ప్రపంచంలో సినిమా ఒక అందమైన మోసం అంటాడు Jean luc Godard (జీలీ గోడాడ్ అని పలకాలట. ఫ్రెంచ్ వాళ్లు గాలి ఎక్కువ, భాష తక్కువ మాట్లాడ్తారు) ఈయన గొప్ప ఫ్రెంచి డైరెక్టర్. వయసు 90 ఏళ్లు. ఇంకా మోసపోతూనే ఉన్నాడు. లైఫ్ టైం అచీవ్‌మెంట్ ఆస్కార్ వచ్చింది. ఫ్రెంచి సినిమాని ఒక మలుపు తిప్పాడు. అంతకు ముందు Straigh road ఉండేది.
ఈ రకంగా గొప్ప వాళ్ల కొటేషన్లతో నింపితే రచనకి గాంభీర్యం వస్తుందని ఒక మిత్రుడు చెప్పాడు. ఆయన ఇలాగే కొటేషన్లతో ఒక పుస్తకం లాగించేసాడు. ఇంతకీ కార్ల్‌మార్క్స్ సినిమా గురించి ఏమంటాడంటే … ఏమీ అనలేదు. ఆయన చనిపోయిన 12 ఏళ్లకి సినిమా పుట్టింది. లేదంటే ఏదో ఒకటి అనేవాడు.
cinema is the most beautiful Fraud In the whole world అని Godard అన్నాడు. నిజానికి దీన్ని “ప్రపంచ మొత్తంలో అత్యంత అందమైన మోసం సినిమా” అని అనువాదం చేయాలి. మూలాన్ని నాశనం చేయడమే అనువాదం అంతిమ లక్ష్యం కాబట్టి నాకు ఎంత అర్థమైతే అంతే చేశాను. ఈ మధ్య ఒక ఇంగ్లీష్ వెబ్‌సిరీస్‌కి సబ్ టైటిల్స్ అనువాదం చేయమంటే ఇలాగే చేశాను. మనం రాసింది తప్పు అని తెలుసుకోడానికి అవతల కూడా వచ్చి ఉండాలి కదా!
నాకు ఎంతోకొంత ఇంగ్లీష్ వచ్చని ఇంత కాలం అనుకునే వాన్ని. ఈ మధ్య న్యూజెర్సీ ఎయిర్‌పోర్ట్‌లో (దీన్ని నెవార్క్ అంటారు) దిగేసరికి భ్రమలు తొలిగిపోయాయి. నా ఇంగ్లీష్ వాళ్లకు అర్థం కాదు, వాళ్ల యాస నాకు అర్థం కాలేదు. మా ఆవిడకి ఇంగ్లీష్ రాదు. కానీ ఆ విషయం తెలియదు. అందుకే సులభంగా కమ్యూనికేట్ చేసి ఇమిగ్రేషన్ నుంచి బయటపడేసింది. అంటే భాష వేరు, భావం వేరు.
గ్యాటిమాలా దేశంలో మాయో అనే భాష మాట్లాడ్తారు. టైటానిక్ సినిమాని ఆ భాషలోకి డబ్బింగ్ చేసినా హిట్ అవుతుంది. అంటే ప్రపంచంలో ఏ మూలలో ఉన్న మనిషినైనా కదిలించే లక్షణం నీ కథలో ఎంతోకొంత ఉండాలి.
ఢిల్లీ సరిహద్దుల్లో 2 నెలలుగా రైతులు చలిలో ఉన్నారు. కళ్లలో నీళ్లు మిగిలున్న అందర్నీ ఇది బాధిస్తూ ఉంది. రైతుల్ని నివారించడానికి మేకుల్ని దారిలో అమర్చారు. నిజానికి రైతుని అంపశయ్య ఏనాడో ఎక్కించారు. ఇపుడు దారిలో పరిచింది మేకులు మాత్రమే.
1991లో రాయలసీమ వేరుశనగ రైతులు దివాళా తీయడానికి కారణం మలేషియా నుంచి పామాయిల్ దిగుమతులు. ఢిల్లీలో కడుపు నిండిన వాళ్లు తీసుకునే నిర్ణయాలు పల్లెటూళ్లలో ఉండే పేద రైతుల కడుపు మాడుస్తాయి.
ఇండియా మార్కెట్ పెద్దది. సంపన్న దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు మూలుగుతున్నాయి. అవన్నీ మన నెత్తిన పడతాయి. నీలి మందుని ప్రోత్సహించి ఆ తర్వాత చంపారన్ రైతుల్ని బ్రిటీష్ వాళ్లు దివాళా తీయించారు. వాళ్ల కోసం పోరాడ్డానికి ఆ రోజుల్లో గాంధీ ఉన్నారు. ఇప్పుడెవరున్నారు? కరెన్సీ నోటులో గాంధీ బొమ్మని సమాధి చేశారు.
సినిమా కథకి, ఈ రాజకీయాలకీ ఏమిటి సంబంధమంటారా? సంబంధం ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. ఒకదాని కొకటి సంబంధం లేకుండా ఎన్నో జరుగుతున్నాయి. హేమమాలినిని లోక్‌సభకు పంపారు. ఆమెకి చట్టసభలకి ఏమైనా సంబంధం ఉందా? రేఖ ఎప్పుడైనా రాజ్యసభలో నోరు విప్పిందా? సంబంధం లేకుండా చట్టాలే జరుగుతున్నప్పుడు, జీవితానికి సంబంధం లేకుండా సినిమాలు ఉంటే నష్టమేంటి?
సినిమాకి ఏదో ఫార్ములా ఉండాలి, నిర్మాణం ఉండాలి అంటూ ఉంటారు. కోవిడ్ వ్యాక్సిన్‌కి ఫార్ములా ఉండాలి కానీ , సినిమాకి ఎందుకు? సెవెన్ సమురాయ్‌లో దొంగల్ని ఎదుర్కోడానికి సన్నాహాలు జరుగుతూ ఉంటాయి. ఆ దొంగలు ఆఖరున వస్తారు. షోలేలో గంట సినిమా తర్వాత గబ్బర్‌సింగ్ వస్తాడు.
హృదయంతో కథ చెబితే ప్రేక్షకుడు వింటాడు. గ్రామర్ రాకుండా కూడా భాష మాట్లాడొచ్చు. అయితే దాంట్లో ఏదో లయ ఉండాలి. సంగీతం వినిపిస్తూ ఉండాలి, మనలో మనిషి లక్షణం ఉంటే ప్రకృతిలోని ప్రతి శబ్దమూ సంగీతమే!