కథ లేకుండా సినిమానే కాదు, జీవితం కూడా లేదు. ప్రతిరోజూ మనం చెప్పుకునేవన్నీ కథలే. ఆఫీస్‌లో లీవ్ కోసం చెప్పేది కథ, లేట్‌గా వస్తే చెప్పేది కట్టుకథ. మనం బాస్ అయితే మనం చెప్పే ప్రతి కథని సబార్డినేట్స్ శ్రద్ధగా వింటారు. మన బాస్ కథని మనం వినాలి. బాస్ లేకుండా ప్రపంచంలో ఎవరూ ఉండరు.
చిన్నప్పటి నుంచి కొన్ని వేల కథల్ని వింటాం, చెబుతాం. అయితే ఇవేమీ సినిమాకి పనికిరావు. 2 లేదా 3 గంటల టైమ్‌లోనే ఇమిడే కథ చెప్పాలి. దానికో తలాతోకా ఉండాలి. హీరోహీరోయిన్ విలన్ కమెడియన్ ఇంత మందిని కలుపుకోవాలి. హీరో లేకుండా కథ ఉండదు. హీరో ఉంటే విలన్ కూడా ఉండాలి.
చివరికి హీరోనే గెలవాలి. బయట విలన్లే గెలుస్తారు. సినిమాలో గెలిస్తే జనం ఒప్పుకోరు. సినిమాతో సమస్య ఏమంటే అందరూ దాన్ని Own చేసుకుంటారు. దాని గురించి తమకి తెలియనిదే లేదనుకుంటారు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాం. ఆ మాత్రం తెలియదా ఏంటి? ఈ మాత్రం కథ మేమూ చెప్పగలం అనుకుంటారు.
పుట్టినప్పటి నుంచి చికెన్ బిర్యానీ తింటున్నాం, మేం కూడా వండుతాం అని ఎవడూ ముందుకు రాడు. ఎందుకంటే దాన్ని కొంత కాలం శ్రద్ధగా నేర్చుకోవాలి. అనేక సార్లు చెత్తగా వండిన తర్వాత రుచి వస్తుంది. సెల్‌ఫోన్‌లో కొన్ని వందల ఫొటోలు తీశామని ఫొటోగ్రఫీ కాంపిటేషన్‌కి ఎవడూ వెళ్లడు. ఒక పత్రిక కథల పోటీ పెడితే ఎంతోకొంత రాయడం వచ్చిన వాళ్లే కథలు పంపుతారు.
సినిమా అనే సరికి ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎవడైనా వచ్చి కరెక్షన్ చెబుతాడు. నిర్మాత కావచ్చు, ఆఫీస్ బాయ్ కావచ్చు. అందుకే సినిమా కథ చెప్పడం ఈజీ, అత్యంత కష్టం కూడా.
కథలు ఎవడైనా చెబుతాడు. మాస్టర్ స్టోరీ టెల్లర్ కావడం ఎలా? అది ప్రశ్న. “వేదాంతులు ఈ ప్రపంచాన్ని రకరకాలుగా నిర్వచించారు. అయితే సమస్య ఏమంటే ఈ ప్రపంచాన్ని మార్చడం ఎలా?” అంటాడు కారల్ మార్క్స్. ఇప్పుడు కమ్యూనిస్టుల గొడవ ఎందుకంటే, మార్క్స్ అనే గడ్డం ముసలాడు 150 ఏళ్ల క్రితమే ఏం చెప్పాడో అదే ప్రపంచమంతా జరుగుతూ ఉంది. భారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉంది అంటారు. అదే మాట మార్క్సిజంలో కూడా నిజం.
లోహం కనుగొన్న తర్వాత కుండ ప్రాధాన్యత తగ్గిపోయింది. నువ్వు కుండను చేసావో, లోహం చేసావో తెలుసుకో. కుండ అయితే నిర్మాతల చేతిలో పగిలిపోతుంది. కంచు అయితే OK. బంగారమైతే నువ్వు అమ్మాల్సిన పనిలేదు. వాళ్లే కొనుక్కుంటారు. సినిమా కథ కూడా సరుకే. ఉపయోగపు విలువని బట్టే డిమాండ్.