మంచి స్క్రిప్ట్ చేతిలో వుంటే మంచి డైరెక్టర్ గొప్ప సినిమాని తీస్తాడు. అదే స్క్రిప్ట్‌తో మిడిమిడి జ్ఞానపు డైరెక్టర్ కూడా ఫర్వాలేదనిపించే సినిమా తీయగలడు. అయితే చెత్త స్క్రీప్ట్‌తో మంచి డైరెక్టర్ కూడా చెత్తే తీయగలడు.
అకిర కురొసవా మాటలివి. జపాన్‌లో కూచుని సినిమాలు తీసి హాలీవుడ్‌ని షాక్ తినిపించిన డైరెక్టర్. మనం మిరాకిల్‌గా చెప్పుకునే షోలేకి మూలం ఈయన తీసిన సెవెన్ సమురాయ్.
మనిషి జీనయస్‌గా ఎపుడుంటాడంటే, కలలు కంటున్నప్పుడు అనే అకిర సినిమా గురించి కలలు కన్నాడు. ఆయన సినిమాలు గొప్ప డైరెక్టర్లందరికీ Text books. చిన్నప్పుడు చూసిన భూకంప బీభత్సం కళాకారున్ని తట్టి లేపింది. ఆయన అన్న మూకీ సినిమాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు. టాకీలు వచ్చి ఉద్యోగం పోయింది. ఆత్మహత్య చేసుకున్నాడు. బాధ పట్టుదలని పెంచింది.
గొప్ప వాళ్లంతా కథని నమ్ముకున్న వాళ్లే. ముక్కూమొహం తెలియని జేవీ. సోమయాజులుతో శంకరాభరణం హిట్ అయ్యిందంటే అది స్క్రిప్ట్ బలం. విశ్వనాథ్ సినిమాలోని కథాంశాలతో విభేదాలుండొచ్చు. కానీ కథ చెప్పే విధానంలో ఆయన నిష్ణాతుడు. ప్లాష్‌బ్యాక్ టెక్నిక్‌తో కథని ఎక్కడ చెప్పాలి, ఎక్కడ ఆపాలో బాగా తెలుసు (సాగరసంగమం, స్వాతిముత్యం. జయప్రద బొట్టు చెరిగిపోకుండా కమలహాసన్ వానలో చెయ్యి అడ్డం పెట్టడం ఇప్పుడు నవ్వులాటగా ఉంటుంది). ఆయన కూడా Bad Script తో 1978లో శోభన్‌బాబు ఒక రేంజ్ హీరోగా ఉన్నప్పుడు కాలాంతకులు అనే చెత్త సినిమా తీసాడు.
కథ రాయాలి అనుకుంటే పెద్ద జ్ఞానం అక్కర్లేదు. నాలుగు పాత సినిమాలు, ఆరు కొరియన్ సినిమాలు చూసి రాసేసుకోవచ్చు. మంచి కథ రాయాలనుకుంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు కూడా తెలిసుండాలి. కులం, జండర్ స్పృహ కూడా ఉండాలి. మన సినిమాలన్నీ అగ్రవర్ణ సినిమాలే. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, విజయరామరాజు ఇలా ఉంటాయి హీరోల పేర్లు. ప్యాక్షన్ సినిమాలో అయితే రెడ్డి హీరోగా ఉంటాడు. బడుగు, బలహీన వర్గాలు “తొడగొట్టు చిన్నా” అంటూ వుంటారు. హీరో కొడితే గాల్లోకి ఎగిరి పడతారే వాళ్లంతా కులం లేని వాళ్లు.
ఉప్పెనలో కూతురి ప్రేమని ఒప్పుకోని తండ్రి ఒక శిక్ష వేస్తాడు. హీరో మగతనాన్ని తొలగిస్తాడు. పరువు హత్యలు చేసే తండ్రులకి కొత్త Tip అందించాడు.
ఇదే కథని రివర్స్‌లో చూసే , తీసే ధైర్యం మనకుందా? అమ్మాయి తండ్రి దళితుడు, హీరో అగ్రవర్ణం. కూతురి ప్రేమని తండ్రి ఒప్పుకోడు.
“కొన్ని వేల ఏళ్లుగా , మన పట్ల అమానుషంగా ప్రవర్తించిన కులపోన్ని ఎలా ప్రేమించావమ్మా” అని ఆ తండ్రితో అనిపించలేం. ఎందుకంటే మనదింకా నాగరికత ముసుగులోని ఫ్యూడల్ వ్యవస్థ.
1857 తిరుగుబాటు తర్వాత “ఇక ఇండియాలో ప్యూడల్ వ్యవస్థ నశించి పెట్టుబడిదారి వ్యవస్థ పుడుతుంది” అని మార్క్స్ ఆశించాడు. పెట్టుబడిదారులు వచ్చారు కానీ వాళ్ల మూలాలన్నీ ప్యూడలే!
మార్క్సిజాన్ని కమ్యూనిస్టులే చదువుతారని భ్రమ ఉంది చాలా మందిలో. కానీ అది క్యాపిటలిస్టులకే ఎక్కువ అవసరం. సినిమా కూడా క్యాపిటల్ ప్రపంచమే. దోపిడీ చేయకపోయినా , దోపిడీకి గురికాకుండా ఉండటానికైనా మార్క్సిజం చదవాలి.
అసురన్ తమిళ్‌లో హిట్ అయ్యే సరికి తెలుగులో నారప్ప వస్తున్నాడు. అది హిట్ అయితే కొత్త కథలు వస్తాయేమో!