iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో మునిసిపల్ ఎన్నికలకు ఇంతటి ప్రాధాన్యత రావాడమే విశేషం. అయితే విపక్షాల వైఖరితో ఈ ఎన్నికలు అందరికీ ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పరిధిలో మరోసారి ఓటర్లు తీర్పు వెలువరించాల్సి ఉండడంతో అందరి దృష్టి అటు మళ్లింది. నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల కన్నా కుప్పం పైనే అందరూ కన్నేశారు.
మునిసిపల్ ఎన్నికలే అయినప్పటికీ నేరుగా చంద్రబాబు రంగంలో దిగి ప్రచారం చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడి సభల్లో చంద్రబాబు తన స్థాయిని మరచి జగన్ కి సవాల్ విసిరిన తరుణంలో వైఎస్సార్సీపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావించింది. చివరి నిమిషంలో నారా లోకేష్ కూడా సీన్ లోకి రావడం, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నేతలు కూడా కుప్పంలో పాగా వేయడం వంటి పరిణామాలతో వైఎస్సార్సీపీ కూడా పథక రచన చేసింది. స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో ఎంపీలు మిథున్ రెడ్డి, రెడ్డప్ప వంటి వారి చాకచక్యం ముందు టీడీపీ అధినేత కళ్లు తేలేయాల్సి వచ్చింది. పంచాయతీ, పరిషత్ ఎన్నికల ఓటముల పరంపరను ఎదుర్కోవాల్సి వచ్చింది.
కుప్పం తో పాటుగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 12 మునిసిపల్ , నగర పంచాయతీల్లో కూడా టీడీపీకి తలబొప్పి కొట్టిందనే చెప్పాలి. చివరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొంత పరువు నిలబెట్టుకున్నప్పటికీ నెల్లూరు కార్పోరేషన్ లో బోణీ కూడా కొట్టలేకపోవడం టీడీపీ పరువు పెన్నాలో కలిసినట్టయ్యింది. రాయలసీమతో పాటుగా నెల్లూరులో కూడా ఇక టీడీపీ అడ్రస్ గల్లంతయినట్టేననే అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీ కోలుకునే అవకాశాలు లేవనే చర్చ సాగుతోంది.
చంద్రబాబుకి చిక్కులే
చంద్రబాబు సొంత స్థానం కోల్పోవడంతో ఆయన నాయకత్వం మీద విశ్వాసం సన్నగిల్లుతుందనడంలో సందేహం లేదు. జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే అధికారంలోకి వస్తామంటూ ఇన్నాళ్లుగా చేసిన ప్రచారంలో డొల్లతనం ఈ ఎన్నికలు బయటపెట్టాయి. 2019 సాధారణ ఎన్నికల తరహాలోనే డిస్టెంక్షన్ లో జగన్ కి జనాదారణ దక్కుతోందని నిరూపించాయి. ఇది చంద్రబాబు సామర్థ్యానికి వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ పెద్ద పరీక్ష పెడుతుందనడంలో సందేహం లేదు . మంగళగిరిలో లోకేష్ ఓటమితోనే తలెత్తుకోలేని స్థితిలో ఉన్న టీడీపీకి ఇది గోరుచుట్టుపై రోకలిపోటు వంటిది. నాయకత్వమే వెనుకబడిపోతుండడంతో దిగువ శ్రేణుల్లో మరింత ఆత్మస్థైర్యం దెబ్బతింటుందనడంలో సందేహం లేదు.
నిజానికి చంద్రబాబు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ప్రమాదం ఉందని తెలిసినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సింది. కానీ జగన్, పెద్దిరెడ్డి పన్నిన వ్యూహంలో చిక్కుకున్నారు. నేరుగా ప్రచారానికి వెళ్లడం, పార్టీ నేతలను డంప్ చేయడం వంటి చర్యలతో తానేదో సాధిద్దామని ఆశపడ్డారు. కానీ పరిస్థితి భిన్నంగా ఉండడంతో ఢీలా పడాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీని ఇక్కట్లలో నెట్టినట్టయ్యింది.
Also Read : TDP, Acham Naidu – మైండ్ బ్లాంక్ అయిందా అచ్చెన్నా?
అమరావతి నినాదం ముప్పు తెస్తుందా
విపక్షంలోకి వెళ్లిన నాటి నుంచి చంద్రబాబు పలు వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడుతున్నారు. అందులో కీలకమైనది అమరావతి ఉద్యమం అనే అభిప్రాయం బలపడుతోంది. అమరావతి కోసం ఆయన చేస్తున్న దుస్సాహసాల మూలంగా అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్రలో టీడీపీ దెబ్బతింటుందనే అభిప్రాయం మరింత బలపడుతోంది. ఉప ఎన్నికలు జరిగిన విజయనగరం, జీవీఎంసీ, కాకినాడ కార్పోరేషన్ల పరిధిలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం దానికో ఉదాహరణగా చెబుతున్నారు.
అమరావతి కోసం ఎంతకైనా తెగించేందుకు చంద్రబాబు సిద్ధమవుతుండగా అమరావతి పేరుతో తమకు అన్యాయం చేస్తున్నారనే అభిప్రాయం జనంలో పడుతోంది. ఇది టీడీపీ పాఠం నేర్చుకోవాల్సిన అవసరాన్ని చాటుతోంది. ఇప్పటికే పరిషత్, పంచాయతీ, మునిసిపల్ ప్రతీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావతృతం అవుతున్న తరుణంలో అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని మరోసారి చాటుతోంది.
జనసేనకు ఏమొచ్చింది
దాదాపుగా బీజేపీని వీడి టీడీపీతో జనసేన జతగట్టింది. ఆకివీడు, దాచేపల్లిలో బహిరంగంగా కలిసి పనిచేశారు. కానీ ఆశించింది మాత్రం దక్కలేదు. అందులోనూ ఆకివీడులో టీడీపీకి చెందిన ఉండి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో గంపెడాశలే పెట్టుకున్నారు. కానీ అవన్నీ గల్లంతయ్యాయి. అతి కష్టం మీద మూడు వార్డులతో జనసేన సరిపెట్టుకుంది. ఆ తర్వాత కేవలం దాచేపల్లిలో మాత్రమే బోణీ కొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 12 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగితే జనసేన రెండు చోట్ల మాత్రమే ఉనికి చాటుకోవడం విశేషమే.
అందులోనూ పవన్ పుట్టినిల్లు నెల్లూరులో బోణీ కాదు కదా డిపాజిట్లు కూడా సంపాదించలేని స్థితిలో ఆపార్టీ ఉంది. దాంతో జనసేన ఏం చేసినా ఫలితం ఉండదనే అభిప్రాయం బలపడుతోంది ఆపార్టీ బలపడే అవకాశాలు లేవని చాటుతోంది.
అధికార పార్టీకి కూడా ఓ హెచ్చరిక
ఈ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్సీపీకి కొంత ప్రతికూలత కనిపించింది. జగ్గయ్యపేట, కొండపల్లిలో పోటీ పోటీగా నిలవడం, దర్శి లో ఓటమి చవి చూడడం స్వయంకృతాపరాధంగా చెప్పాలి. ఆపార్టీ నేతల మద్య సఖ్యత లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సమిష్టిగా పనిచేయాల్సిన చోట ఆధిపత్య పోరుతో వ్యవహరిస్తే అసలుకే ఎసరు వస్తుందని దర్శి నేర్పుతున్న పాఠం. ఆయా నేతల మధ్య సఖ్యతకు అధిష్టానం కూడా చొరవ చూపాల్సిన అవసరాన్ని చెబుతోంది.
ఇక బీజేపీ బోణీ కూడా కొట్టలేక చతికిలపడడం, ఇతర పార్టీలు ఉనికి చాటుకోలేకపోవడం ఈ ఎన్నికల్లో ప్రస్ఫుటమయ్యింది. కానీ చంద్రబాబుకి మాత్రం ఈ ఫలితాలు చెంపదెబ్బగా భావించాలి. నిర్ణయాలు సరిదిద్దుకోకపోతే ఇదే పరిస్థితి మళ్లీ మళ్లీ ఎదుర్కోక తప్పదని తెలుసుకోవాలి.
Also Read : Municipal Elections – ఎవరు ఎక్కడ గెలిచారంటే..