iDreamPost
android-app
ios-app

తెలుగు మాస్ మ”సాలా” తీయడం ఎలా?

తెలుగు మాస్ మ”సాలా” తీయడం ఎలా?

గుర్నాధానికి కాలం కలిసొచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో పట్టిందల్లా బంగారమే అయింది. వద్దనుకున్నా కోట్ల డబ్బు వచ్చిపడింది. స్వతహాగా సినిమా పిచ్చోడయిన గుర్నాథం ఆ వచ్చిన డబ్బుతో సినిమా తీయాలని డిసైడ్ అయిపోయాడు. దాంతో కథలను చెప్పమని దర్శకులను పిలిచాడు.

కానీ దర్శకులు చెప్పే ఒక్క కథ కూడా నచ్చడం లేదు. ఈలోగా తన స్నేహితుడు వెంగళరావు గుర్నాథాన్ని చూడటానికి వచ్చాడు. సినిమా తీయడానికి కథ దొరక్క అల్లాడుతున్న గుర్నాథం బాధ వెంగళరావుకి అర్థం అయింది. గుర్నాథం నువ్ అనవసరంగా బాధపడకు. జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషేంట్ కే అనుభవం ఎక్కువ ఉంటుందని మోటివేషన్ క్లాస్ ఇచ్చాడు వెంగళరావు. ఏమీ అర్ధం కాక తెల్లమొహం వేసాడు గుర్నాథం. నువ్ ఒప్పుకుంటే ఆ కథేదో నేనే చెప్తా.. ఇప్పటికే కొన్ని వందల సినిమా చూసిన అనుభవం నాకుంది. జూనియర్ డైరెక్టర్ కంటే సీనియర్ ప్రేక్షకుడికి అనుభవం ఎక్కువ ఉంటుంది అర్థమైందా అన్నాడు వెంగళరావు.. సరే ముందు కథ చెప్పు నచ్చితే సినిమా తీసేద్దాం అని మాట ఇచ్చాడు గుర్నాథం..

సినిమా మొదలవ్వగానే హీరో ఫైట్ చేస్తూ ఉంటాడు..ఫైటర్స్ ను ఇరగదీసిన అనంతరం ఇంకెప్పుడైన నా మార్కెట్ లో మామూళ్లు వసూలు చేస్తే మాములుగా ఉండదని హీరో పుల్లారావు చెప్పడంతో చిల్లర రౌడీలు పారిపోతారు. ఫైట్ అయిపోయిన వెంటనే తమిళ్ మాస్ సాంగ్ తరహాలో ఒక పాట స్టార్ట్ అవుతుంది… తీరా చూస్తే, పుల్లారావు ఒక ఆవారా బాచ్ లీడర్ గా ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరుగుతూ ఉంటాడు…ఓరోజు అలా గాలికి తిరుగుతున్న పుల్లారావుకు హీరోయిన్ పిచ్చమ్మ కనిపిస్తుంది. పుల్లారావుకి పిచ్చమ్మని చూడగానే, గుండెల్లో గంటలు మోగి ప్రేమలో పడిపోతాడు. దీంతో పిచ్చమ్మ ఊహలతో రెండో పాట స్టార్ట్ అవుతుంది.

అలా పిచ్చమ్మ ఊహల్లో తేలిపోతున్న పుల్లారావుకు, పిచ్చమ్మను నలుగురు పోకిరి కుర్రాళ్ళు ఏడిపిస్తూ కనిపిస్తారు. దాంతో పుల్లారావుకు విపరీతమైన కోపం వచ్చి ఆ కోపానికి రక్తం మరిగి, కండలు ఉబ్బి వేసుకున్న షర్ట్ పీలికలుగా చిరిగిపోతుంది.ఆ ఫైట్ లో పుల్లారావుకు ఉన్న ఫామిలీ ప్యాక్ చూసి పిచ్చమ్మ లవ్ లో పడిపోతుంది.. “అమ్మాయిలంటే ఆట బొమ్మలు కాదురా, మనల్ని కన్న అమ్మలు” అంటూ పుల్లారావు ఆవేశంగా చెప్పడంతో ఆ పోకిరి కుర్రాళ్ళు మమ్మల్ని క్షమించండి సిస్టర్ అంటూ పిచ్చమ్మ కాళ్ళు పట్టుకోవడంతో వారిని క్షమించేసి పుల్లారావుకు ఫోన్ నంబర్ ఇచ్చి మరీ ఇంటికి వెళ్తుంది.. కళ్ళు మూసినా తెరిచినా పుల్లారావు ఫామిలీ ప్యాక్, అతను ఆవేశంగా చెప్పిన మాటలు పిచ్చమ్మకు గుర్తుకు వస్తాయి. ఇక ఉండబట్టలేక పుల్లారావుకు ఫోన్ చేసి హలో అంటుంది. ఆ వాయిస్ వినగానే పరవశంలో పులకరించిపోయిన పుల్లారావు అది కలో నిజమో నమ్మలేకపోతాడు. మొత్తానికి నిజమే అని గ్రహించి ఊహల్లో ఇద్దరు కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు పాటకోసం.

ఈలోగా ఆవారాగా పిచ్చమ్మతో తిరుగుతున్న పుల్లారావుని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు, విలన్ గ్యాంగ్లో ఒకడు చూసి, షాక్ కొట్టినట్లు కిందపడతాడు. అలా కిందపడి దొర్లుకుంటూ విలన్ బైర్రాజుకు కాయిన్ బాక్స్ నుండి అమెరికాకు ఫోన్ చేసి “ఆడు బ్రతికే ఉన్నాడన్న” అని అరుస్తూచెబుతాడు.. “ఏంట్రా నువ్ చెప్పేది”..అని బైర్రాజు కాన్ఫరెన్స్ హాల్ దద్దరిల్లిపోయేలా అరుస్తూ అడుతాడు.(తన కంపెనీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఫోన్ వస్తుంది). వాడు బ్రతికే ఉన్నాడన్న.. నువ్ వస్తే వాడి అంతు తేలుద్దాం అని బైర్రాజుకి వాడి అనుచరుడు చెప్పడంతో ఉన్నఫళంగా వెయ్యికోట్ల కాంట్రాక్టు క్యాన్సిల్ చేసి అమెరికా నుండి సొంత విమానం వేసుకుని హైదరాబాద్ వస్తాడు బైర్రాజు. ఒక పదిమంది వీధి రౌడీలతో కత్తులు,కర్రలు తీసుకువచ్చి వారిని వరసగా నిలబెట్టి, పిచ్చమ్మతో గాలికి తిరుగుతున్న పుల్లారావును అడ్డగించి,పాతిక సంవత్సరాలుగా వెతుకుతుంటే ఇంతకాలానికి దొరికావురా నువ్వు..నిన్ను చంపి నా కుక్కలకి ముక్కలుగా వేస్తా అని అరుస్తూ ఒకరి తర్వాత ఒకర్ని, పుల్లారావుని చంపడానికి బైర్రాజు పంపితే, తనని ఎందుకు చంపబోతున్నారో తెలియకపోయినా, రౌడీలందర్నీ న్యూటన్ నియమాలకు వ్యతిరేకంగా పుల్లారావు చితగొట్టి, “ఎవర్రా మీరు’? నన్ను ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారని అరుస్తూ అడుగుతున్నప్పుడు ఇంటర్వెల్ అని స్క్రీన్ పై వేస్తాం అన్నాడు వెంగళరావు.

ఎలా ఉంది కథ అని అడిగితె అప్పటికే కథను ఊహించుకుంటూ కథలో లీనం అయిన గుర్నాథం కథ పూర్తిగా చెప్పరా పుల్లారావును బైర్రాజు ఎందుకు చంపబోయాడు? టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా త్వరగా చెప్పరా అని వెంగళరావుని అడిగాడు.

వెంగళరావు సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసాడు. రౌడీలను చితగొట్టి ఇంటికొచ్చిన పుల్లారావు “అమ్మా నేను ఎవర్ని అని ఆవేశంగా అడిగితే, అప్పుడుపాపాయమ్మ ఫ్లాష్ బాక్ చెప్పడం మొదలుపెడుతుంది .. పుల్లారావు తండ్రి పేరు పాపారావు(పుల్లారావు-పాపారావు డ్యూయల్ రోల్)”వెంగళరావు పాలెం” మొత్తానికి డాన్ అన్నమాట.. అప్పట్లోనే PM కంటే ఎక్కువ సెక్యూరిటీ పాపారావుకే ఉంటుంది.. కనుసైగ చేస్తే చాలు గవర్నమెంట్ పడిపోయే రేంజ్ పాపారావుది.. అయితే రాజకీయంగాతనకు సపోర్ట్ చేయమని, బైర్రాజు తండ్రి కాట్రాజు, పాపారావుని అడుగుతాడు.. అందుకు పాపారావు అంగీకరించకుండా కాట్రాజుని మంచిగా బ్రతకమని అన్యాయాలు అక్రమాలు మానెయ్యమని వార్నింగ్ ఇస్తాడు. దీంతో కసి పెంచుకున్న కాట్రాజు, పాపారావు ఇంట్లో పని చేసే పాలేరు కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు. పాపారావు తన ఇంట్లో పనిచేసే వారిని తన బంధువుల్లా చూసుకుంటూ ఉంటాడు. అందుకే పాలేరు కూతురైన పాపాయమ్మని కిడ్నాప్ చేసి తనకు మద్దతు ఇవ్వకుంటే పాపాయమ్మ బ్రతుకుని కుక్కలు చింపిన విస్తరి చేస్తానని పాపారావుకి కాట్రాజ్ ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. కానీ పాపారావు కాట్రాజ్ అంతుచూస్తానని నాలుగు పంచ్ డైలాగులు కొట్టడంతో పాపాయమ్మ అంతు చూడమని తన కొడుకులకు చెప్తాడు.. అలా పాపాయమ్మను ముట్టుకోవడానికి ప్రయత్నం చేసే లోగా, పాపారావు ఒక్కడే వచ్చి పెద్ద ఫైట్ చేసి, కాట్రాజ్ ని చంపి, ఆ పాలేరు కూతుర్ని రక్షిస్తాడు.. కానీ పాలేరు ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు…

ఎందుకు అలా చేశావని పాలేరుని పాపారావు నిలదీస్తే,తన కూతురు మీద మచ్చ పడినప్పుడు, ఎవరు పెళ్లిచేసుకుంటారు బాబు అని పాలేరు ఏడుస్తుంటే,నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తాడు.. అది విన్న పాలేరు, బాబూ నువ్ మా పాలిట దేవుడువి బాబు దేవుడువి అని ఈరో కాళ్లపై పడి”పోతాడు”(సంతోషంతో గుండెనొప్పి వచ్చి చనిపోతాడు)..పాపాయమ్మ వచ్చి పాపారావు కాళ్ళు పట్టుకుంటుంది..పాలేరు అంత్యక్రియల తరవాత పాపారావు-పాపాయమ్మల పెళ్లి జరుగుతుంది.. పెళ్లి అయ్యాక శోభనం రోజున, “రాయిని ఆడది చేసిన రాముడివ, అని పాటలు పాడుకుంటూ రోజులు గడుపుతారు.. అలా పాటలోనే పాపాయమ్మ గర్భవతి అవుతుంది. పాపాయమ్మకి నెలలు నిండే సమయానికి పాపారావు ఇంట్లో మంత్రసాని ఉండదు.. అందుకే వేరే ఊరికి మంత్రసాని దగ్గరకు భార్యను ఒక్కడే తీసుకు వెళ్తాడు..తన తండ్రిని చంపినందుకు పగతో రగిలిపోతున్నబైర్రాజు ఈ విషయం ముందే తెలుసుకుని పాపారావు దారికి అడ్డుగా వచ్చి అటాక్ చేస్తాడు..అప్పుడే పెద్ద వర్షం మొదలవుతుంది. బైర్రాజు రౌడీలకు పాపారావుకి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది.. ఆ ఫైట్ లోపాపారావుకి 30 కత్తిపోట్లు దిగుతాయ్.. అయినా సరే పాపాయమ్మకి మంత్రసానిగా పాపారావు మారి పురుడు పోసి, బిడ్డని కన్నాక వాళ్ళిద్దరిని హైదరాబాద్ వెళ్లే ఒక గూడ్స్ ట్రైన్ లో ఎక్కించి పంపేసి చచ్చిపోతాడు.. ఇక్కడితో ఫ్లాష్ బాక్ అయిపోయింది అన్నాడు వెంగళరావు.. వహ్వా అని విజిల్ వేసాడు గుర్నాథం..

ఆ ఫ్లాష్ బాక్ విన్నాక పుల్లారావు రక్తం మరిగిపోయింది. నాన్న అంటూ బిగ్గరగా శోకాలు పెడుతూ ఏడ్చి వేసుకున్న గుడ్డలు చించుకుంటాడు.. నాన్నని చంపిన వాడిని వదలనమ్మా, నాన్నను చంపిన అదే ప్లేస్ లో బైర్రాజు అంతు చూస్తానని పెద్దగా అరుస్తూ డైలాగ్స్ చెప్పి ఇంటినుండి బయటకు వచ్చే సమయానికి, పిచ్చమ్మ వచ్చి “ఆల్ ద బెస్ట్” అంటుంది.. వెంటనే సూపర్ స్టెప్స్ వేసే, మాస్ సాంగ్ లో ఒళ్ళు హూనం అయ్యేలా పుల్లారావు పిచ్చమ్మ డాన్స్ వేస్తారు. పాట అయిన వెంటనే బైర్రాజు ఊరు వెళ్లిన పుల్లారావు తాను పుట్టిన ఊరికి వెళ్లి ఆ ఊరి నడిబొడ్డున జనమంతా చూస్తూ ఉండగా కసిదీరా కొడతాడు.. క్లైమాక్స్ ఫైట్ చివరలో ఊరు జనం మొత్తం బైర్రాజుని చంపేయ్ బాబు,చంపేయ్ బాబు అని అరుస్తుంటే, బైర్రాజుని వదిలేసి ఆయన కూడా మనిషే అని, మనలో మానవత్వం ఉండాలని, మానవత్వం గురించి పదినిమిషాలు గుక్క తిప్పుకోకుండా చెప్పేసరికి, ఊరి జనాలతో పాటు బైర్రాజు కూడా మారిపోతాడు… వెంటనే కలిసుంటే కలదు సుఖం అని శుభం కార్డు వేస్తె సినిమా సూపర్ హిట్ అవుతుంది…అని ముగించాడు వెంగళరావు.

వెంగళరావు చెప్పిన కథలో లీనం అయ్యి ఆ కథను సినిమాగా తీస్తే వచ్చే డబ్బు కట్టలను లెక్క బెట్టుకుంటూ ఊహల్లోకి వెళ్ళాడు గుర్నాథం తీస్తే ఆ సినిమా తీయాలని నిర్ణయించుకుంటూ ….