Idream media
Idream media
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి అయ్యాక మమతా బెనర్జీ బీజేపీ టార్గెట్ గా దూకుడు ప్రదర్శిస్తున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అనుసరించిన రాజకీయాలు, ఎన్నికలకు ముందు టీఎంసీ ని బలహీనపరిచేందుకు వేసిన ఎత్తుగడలకు ఇప్పుడు మమత పై ఎత్తులు వేస్తున్నారు.
ఈ క్రమంలో బీజేపీకి చెందిన 33 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అలాగే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోదీ ఫొటో తొలగిస్తూ దీదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎస్ విషయంలో కూడా మమత కేంద్రానికి షాక్ ఇచ్చారు. తాజాగా ప్రతిపక్షనాయకుడు సువేందు అధికారిపై దొంగతనం కేసు కూడా నమోదు చేశారు. ఈ వరుస పరిణామాలతో బీజేపీ కూడా అప్రమత్తమవుతోంది. మమత దూకుడు ను కట్టడి చేసేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలోనే సువేందు అధికారి ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది.
Also Read:జగన్ త్రిముఖ విధానాలే కారణం
తొలిసారి అమిత్ షాతో భేటీ
బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అసెంబ్లీలో విపక్ష నేత , బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన హస్తిన చేరుకున్నారు సువేందు . కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో అయన భేటీ అయ్యారు. బెంగాల్‌లో తాజా పరిస్థితులపై వివరించారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తరువాత చెలరేగిన హింసపై అమిత్‌షాకు సువేందు అధికారి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో విపక్ష నేతగా ఎన్నికైన తరువాత తొలిసారి అమిత్‌షాతో భేటీ అయ్యారు సువేందు.
నేడు ప్రధానితో కూడా..
ప్రధాని మోదీతో కూడా ఆయన బుధవారం భేటీ అవుతారని సమాచారం. సువేందు అధికారిపై బెంగాల్ పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను పంచాయితీ ఆఫీస్ నుంచి దొంగిలించారని సువేందుతో పాటు ఆయన సోదరుడిపై కేను నమోదయ్యింది. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీని ఓడించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు సువేందు అధికారి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్‌షాతో చర్చించినట్టు, ఆయన ఆశీస్సులు తీసుకున్నట్టు సువేందు అధికారి తెలిపారు.
Also Read:గాంధీ మునిమనవరాలికి మోసం కేసులో శిక్ష ఎందుకు పడింది?
ఏం చేద్దాం..
బెంగాల్ లో బీజేపీ పట్ల , కేంద్రానికి వ్యతిరేకంగా మమత అవలంబిస్తున్న తీరుపై ఢిల్లీలో సీరియస్ గా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరంభంలోనే ఇంత దూకుడుగా వెళ్తున్న దీదీ.. ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీస్తే పరిస్థితి ఏంటి, పార్టీ మారేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారనే అంశాలు కూడా సువేందు, అమిత్ షా మధ్య చర్చకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అలాగే, యాస్ తుఫాన్ కారణంగా బెంగాల్‌లో అపారనష్టం జరిగింది. తుఫాన్ సహాయక చర్యలపై ప్రధాని మోదీ సమీక్షకు సీఎం మమత డుమ్మా కొట్టడంపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశంపై అమిత్‌షా , సువేందు చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా సువేందు మాట్లాడుతూ మమత కావాలనే కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారని ఆరోపించారు సువేందు అధికారి. అలాగే, బెంగాల్ ప్రజలకు అన్ని విధాలా కేంద్రం నుంచి మద్దతు ఉంటుందని అమిత్‌షా భరోసా ఇచ్చారని తెలిపారు.