iDreamPost
android-app
ios-app

సుస్మితాసేన్ మిస్ యూనివర్స్ ఎలా గెలిచిందంటే…?

సుస్మితాసేన్ మిస్ యూనివర్స్ ఎలా గెలిచిందంటే…?

ఐశ్వర్య రాయ్ మీద మిస్ ఇండియా టైటిల్ గెలిచి, కర్టెన్ గుడ్డతో మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన సుష్మితా సేన్

1994 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనే వారి జాబితాలో ఐశ్వర్వా రాయ్ పేరు చూసి చాలా మంది అమ్మాయిలు పోటీనుంచి తప్పుకున్నారు. కళ్ళు చెదిరే అందం, అప్పటికే మోడలింగ్ రంగంలో అనుభవం ఉన్న ఐశ్వర్యని కాదని టైటిల్ గెలవడం అసాధ్యం అని ఇరవై అయిదు మంది పోటీలో పాల్గొనకుండానే వెనుతిరిగితే, ఇరవై ఆరవ అమ్మాయిని ఆమె తల్లి ఆపింది. “గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా వంద శాతం ప్రయత్నం చెయ్యి” అని ప్రోత్సాహం ఇచ్చి పోటీలో పాల్గొనేలా చేసింది. ఆ అమ్మాయి పేరు సుష్మితా సేన్.

పోటీలో గెలిపించిన సమాధానం

పోటీలు మొదలయ్యాక అందరూ ఊహించినట్టు అన్ని రౌండ్లలో తన అందం, సౌష్టవంతో ఐశ్వర్య ఆధిక్యతను ప్రదర్శించింది. ఆమెకు కొంచెం వెనుకగా రెండవ స్థానంలో సుష్మిత ఉంది. మిస్ ఇండియా అంటే కేవలం బ్యూటీ మాత్రమే కాదు బ్రెయిన్ కూడా ఉండాలని ఆప్టిట్యూడ్ పరీక్షించే రౌండ్ ఒకటి ఉంటుంది. అందులో గతంలో జరిగిపోయిన ఒక సంఘటన మార్చగలిగే శక్తి నీకుంటే దేనిని నువ్వు మారుస్తావు అన్న ప్రశ్నకు నేను పుట్టిన తేదీ మారుస్తాను అని ఐశ్వర్య చెప్పగా, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య జరగకుండా ఆపుతాను అని సమాధానం ఇచ్చింది సుష్మితా సేన్.

ఐశ్వర్య సెల్ఫ్ సెంట్రిక్ అని, వర్తమాన పరిస్థితుల మీద అవగాహన, సామాజిక స్పృహ తక్కువ అని సుష్మితా సేన్ వైపు మొగ్గు చూపారు న్యాయనిర్ణేతలు. సుష్మితా సేన్ విన్నర్ గా, ఐశ్వర్యా రాయ్ రన్నరప్ గా నిలిచారు ఆ పోటీలో. విజేతగా సుష్మిత మిస్ యూనివర్స్ పోటీలో, రన్నరప్ హోదాలో ఐశ్వర్య మిస్ వరల్డ్ పోటీలో భారతదేశం తరఫున పాల్గొన్నారు.

కర్టెన్ గుడ్డతో ర్యాంప్ వాక్ గౌను

ఇప్పటిలాగా మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారికి కార్పొరేట్ కంపెనీల స్పాన్సర్ షిప్ లభించే అవకాశం అప్పుడు లేదు. మిస్ ఇండియా పోటీలో విజేతలకు ఇచ్చే పారితోషికం పోటీలు జరిగే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు రానూపోను విమానం టిక్కెట్లకు కూడా చాలదు. ఇక పోటీల్లో పాల్గొనడానికి అవసరమైన బట్టలు తన సొంత కర్చులతో సమకూర్చుకోవాలి.

పేరున్న ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన డ్రస్సులు కొనడం తన బడ్జెట్ ని మించిన పని అని భావించిన సుష్మిత తన బట్టల కోసం ఢిల్లీ, సరోజినీ నగర్ లో షాపింగ్ చేసింది. మిస్ యూనివర్స్ పోటీలో ముఖ్యమైన ర్యాంప్ వాక్ లో ధరించాల్సిన డ్రస్ కోసం వెతుకుతుండగా ఆమెకు ఒక డిజైన్ బాగా నచ్చింది. తీరా చూస్తే అది కర్టెన్లకు వాడే గుడ్డ. అయినా సరే డిజైన్ బావుందని తీసుకుంది.

ఆమెకు మళ్ళీ ఆమె తల్లి సుభ్రా సేన్ అండగా నిలిచింది. దగ్గరలోని ఒక లైబ్రరీలో ఫ్యాషన్ మేగజైన్లలో వెతికి ఒక డిజైన్ ఎంచుకుని, టైలర్ పక్కన కూర్చుని కూతురికి సరిపోయేలా కుట్టించింది. దానికి మ్యాచ్ అయ్యే సాక్స్ కొని, వాటితో మోచేయి వరకూ వచ్చే గ్లవ్స్ తయారు చేయించింది. సుష్మితా సేన్ మిస్ యూనివర్స్ కిరీటం గెలిచినప్పుడు ధరించిన గౌను, గ్లవ్స్ ఇవే!

సినిమా రంగ ప్రవేశం

అందాల రాణుల గమ్యం సినిమా రంగం కాబట్టి హిందీ సినిమా రంగ ప్రవేశం చేసి చాలా సినిమాల్లో నటించి, పలు అవార్డులు కూడా స్వంతం చేసుకుంది సుష్మితా సేన్. 2016లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలకు న్యాయ నిర్ణేతలలో ఒకరుగా పాల్గొంది. కొందరితో డేటింగ్ చేసినా, వివాహం వరకూ అవి వెళ్ళలేదు. ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని వారితో సంతోషంగా ఉంది సుష్మితా సేన్. ఇటీవల ఆర్య అనే వెబ్ సిరీస్ తో నటిగా తన రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

(నవంబర్ 19 సుష్మితా సేన్ జన్మదినం సందర్భంగా)