iDreamPost
iDreamPost
పార్లమెంట్ సభ్యుడిగా ప్రతీ ఒక్కరికీ సభలో ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది. ప్రజాప్రయోజనార్థం సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకుగానూ సభలో విభిన్న మార్గాలున్నాయి. ప్రస్తుతం లోక్ సభ సభ్యుడిగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణం రాజు మాత్రం రాజకీయంగా ఆతృతపడుతున్నట్టు ఇప్పటికే స్పష్టమయ్యింది. తనను గెలిపించిన పార్టీని కాదని, ఆయన అడ్డదారి పయనం ప్రారంభించడం దానికో ఉదాహరణ. ఆతర్వాత ఏకంగా అధినేతకు, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పడమే కాకుండా, కోర్టులో పిటీషన్ల వరకూ పయనించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రోజూ సభ ప్రారంభమయిన తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. సభలో వాయిదా తీర్మానాల విషయంలో విపక్షాలు పట్టుపట్టకుండా ఉంటే ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగుతుంటుంది. ఆ సమయంలో ముందుగానే సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తరుపున సమాధానం ఇస్తారు. అందులో స్టార్ క్వచ్చన్లు, అన్ స్లార్డు క్వచ్చన్లు కూడా ఉంటాయి. రాతపూర్వక సమాధానాలు కూడా ఇస్తారు. దానికి అనుబంధంగా కొన్ని ప్రశ్నలను కూడా అనుమతిస్తారు. అయితే ఈ ప్రశ్నలు అడగడానికి సభ్యులకు పరిమితి లేదు. ఈ ప్రశ్నలు పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే వివిధ అంశాల మీద అడిగి ఉంటారు. కాబట్టి అప్పటికప్పుడు వచ్చే కరెంట్ అంశాలకు సంబంధించి జీరో హవర్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. ఎక్కువ సందర్భాల్లో దానికి ప్రభుత్వాలు అంగీకరించడం లేదు.
వాటితో పాటుగా స్వల్పకాలిక చర్చ కోసం రూల్ 193 కింద కూడా నోటీసులు ఇవ్వవచ్చు. ప్రభుత్వం అంగీకరిస్తే సభ్యుల ప్రశ్నలకు స్వల్పకాలిక చర్చ కూడా సాగుతుంది. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో వివిద అంశాలపై అధికార పక్ష సభ్యుల కన్నా సహజంగా విపక్షాల నుంచే ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. గతంలో ప్రశ్నలు అడగడానికి కూడా పైసలు తీసుకున్న ఎంపీల అనుభవాన్ని తెహల్కా డాట్ కామ్ స్టింగ్ ఆపరేషన్ ల బయటపెట్టింది.
ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల సందర్భంగా నర్సాపురం ఎంపీ రఘురామరాజు ప్రశ్నలకు ప్రాధాన్యత దక్కుతుండడం చర్చనీయాంశం అవుతుది. ప్రతీ రోజూ ఏదో ఒక ప్రశ్న ఆయన వేసి వాటి నుంచి సభలో ప్రస్తావిస్తున్నారు. దానికి కారణాలపై ఏపీకి చెందిన ఏపీలలో విస్తృత చర్చ సాగుతోంది. ఇప్పటికే ఏపీలో నేరుగా ముఖ్యమంత్రినే ధిక్కరించి, రాజకీయంగానూ, సామాజికంగానూ విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారనే అభియోగాలున్న రఘురామరాజుకి ఢిల్లీలో కొందరు పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అందులోనూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన మంచి మిత్రుడనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి ప్రత్యేక ప్రాధాన్యత దక్కుతోందని, సభలో రఘురామరాజు ప్రశ్నలకు ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం వస్తోందని కూడా అనుమానిస్తున్నారు. ఓవైపు పార్టీ ధిక్కారణ నోటీసు కింద ఆయనపై చర్యలు తీసుకోవాల్సి ఉన్న సమయంలో ఆయనకు ప్రాధాన్యతనివ్వడం వెనుక లక్ష్యాలు వేరుగా ఉన్నాయనే అభిప్రాయానికి వస్తున్నారు.