iDreamPost
android-app
ios-app

ఈఎస్ఐ స్కామ్ లో సుజనా వాటా ఎంతో తెలుసా, కూపీ లాగుతున్న దర్యాప్తు సంస్థలు

  • Published Aug 31, 2020 | 4:11 AM Updated Updated Aug 31, 2020 | 4:11 AM
ఈఎస్ఐ స్కామ్ లో సుజనా వాటా ఎంతో తెలుసా, కూపీ లాగుతున్న దర్యాప్తు సంస్థలు

ఆంధ్రా, తెలంగాణాలో సంచలనంగా మారిన ఈఎస్ఐ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా ఉంది. కింది స్థాయి అధికారుల నుంచి మొదలుపెట్టి ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మెడకు ఈ వ్యవహారం చుట్టుకుంది. తాజాగా తెలంగాణాలో సాగుతున్న దర్యాప్తులో ఏకంగా ఈఎస్ఐ కుంభకోణం నిధులలో సుజనా సంస్థల వాటాకి సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. దాంతో పెద్ద తలకాయల బండారం కూడా బయటకు వస్తుందా అనే అనుమానం మొదలయ్యింది. టీడీపీ క్యాంపులో కొత్త కలవరం కనిపిస్తోంది. ఇంకా ఎవరెవరి పాత్రలు బయటపడతాయోననే బెంగ ఆరంభమయ్యింది.

అచ్చెన్నాయుడు అరెస్ట్, ఆ తర్వాత రెండు రోజుల క్రితం బెయిల్ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పితాని సత్యన్నారాయణ పాత్ర లేదని ఏపీ ఏసీబీ తేల్చడంతో ఇక గట్టెక్కుతున్నట్టేనని ఆశించారు. కానీ తీరా చూస్తే తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదిక మరింత కలకలం రేపుతోంది. ఈఎస్ఐ స్కామ్ నిధులను నేరుగా సుజనా సంస్థలకు మళ్లించిన ఆధారాలు బయటపడ్డాయి. సుజనా సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు మళ్లించిన తీరు తేటతెల్లమయ్యింది. సుజనా టవర్స్ నుంచి కూడా భారీగా షేర్లు కొనుగోలు చేసిన ఉదంతం కూడా వెలుగుచూసింది. దీనికి సుజనా సన్నిహితుడు హరిబాబు కీలకపాత్రధారిగా పేర్కొంటున్నారు.

ఈఎస్ఐ మందుల సరఫరాలో కీలక పాత్రధారిగా ఉన్న హరిబాబు ఆస్తుల వ్యవహారంలో తెలంగాణాలో జరిగిన దర్యాప్తులో కీలక ఆధారాలు లభించాయి. నిందితుడికి సుజనా గ్రూప్ కి చెందిన కీలక వ్యక్తుల అండదండలున్నట్టు గుర్తించారు. ఓమినీ మెడీ, లెజెండ్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మందుల కొనుగోళ్ల వ్యవహారంలో గోల్ మాల్ కి ఆధారాలు దొరికాయి. ఈ అక్రమాల్లో లభించిన మొత్తాన్ని సుజనా ట్రేడ్ ఇండియా ప్రైమేట్ లిమిటెడ్ కంపెనీ పంజాగుట్ట బ్యాంకు అకౌంట్ తో పాటుగా బంజారా హిల్స్ కార్పోరేషన్ బ్యాంక్ అకౌంట్లకు కూడా తరలించిన ఆధారాలు సేకరించారు. సుజనా టవర్స్, స్ప్లెండిడ్ మెటల్స్ గా మారిన సుజనా మెటల్స్ నుంచి కూడా రూ. 32 లక్షలకు పైగా షేర్లు కొనుగోలు చేసిన విషయం కనుగొన్నారు.

సుజనా గ్రూపులోని ప్రముఖ వ్యక్తి పాత్ర పై ఇప్పుడు అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరి గతంలో టీడీపీ హయంలో చక్రం తిప్పారు. చంద్రబాబు సన్నిహితుడిగా అనేక అంశాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆసందర్భంగా పలు ఆరోపణలు వచ్చాయి. తీరా ఇప్పుడు ఈఎస్ఐ స్కామ్ లో నిందితుల సొమ్ము నేరుగా సుజనా గ్రూపుకే చేరడంతో సందేహాలు బలపడుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సామాన్య కార్మికుల వైద్యంలో కూడా భారీగా అక్రమాలకు పాల్పడిన వారి నుంచి నగదు సుజనాకి చేరడంతో వ్యవహారం కొత్త మలుపు తిరుగుతున్నట్టుగానే భావించాలి. ఈ విషయంలో తెలంగాణా దర్యాప్తు సంస్థలు ఏమేరకు చొరవ చూపుతాయన్నది చర్చనీయాంశం. మరింత లోతుల్లోకి వెళితే అసలు కథ వెలుగుచూస్తుందనడంలో సందేహం లేదు.