Idream media
Idream media
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ప్రచారానికైతే మూడు రోజులే. పోరులో ప్రధానంగా పోరాడుతున్న టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్తున్నాయి. దుబ్బాక గెలుపుతో అనూహ్యంగా గ్రేటర్ లో బీజేపీయే ప్రధాన ప్రత్యర్థిగా మారింది. కాంగ్రెస్, టీడీపీల ప్రస్తావన అంతగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ భారతీయ జనతా పార్టీపైనే పడింది. అసెంబ్లీ లక్ష్యంగా గ్రేటర్ వార్ లో పోరాడుతున్న ఆ పార్టీ లక్ష్యాన్ని చేరుతుందా..? రాజధానిలో ఉనికి కోల్పోయిన బీజేపీ గతాన్ని మించిన వైభవం సాధిస్తుందా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తేడా చూపుతుందా..
వాస్తవానికి జీహెచ్ఎం సీ ఎన్నికల నిర్వహణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ గడువు ఉంది. సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే వరదలు, దుబ్బాకలో ఓటమితో ఇప్పట్లో ఎన్నికలకు వెళ్లదని అందరూ భావించారు. కానీ టీఆర్ఎస్ దబ్బున ఎన్నికలకు దిగింది. బీజేపీ బలపడడానికి సమయం ఇవ్వకూడదన్న వ్యూహమే ఇందుకు కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీ కూడా ఉన్న సమయంలోనే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లేందుకు ప్రణాళికలు రచించింది. అందుకు తగ్గట్లుగానే ఆ పార్టీ నేతలందరూ సిటీని చుట్టుముడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. 2016 ఎన్నికల్లో బీజేపీ 66 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. నాలుగు స్థానాలను సొంతం చేసుకుంది. అందులో రెండు ఓల్డ్ సిటీలో కాగా, మరో రెండు కోర్ సిటీలో. ఈసారి ఏకంగా 150 డివిజన్లకు గాను 149 స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను నిలిపింది. పలు రాజకీయ కారణాలతో నవాబ్ సాహెబ్ కుంటలో అభ్యర్థిని నిలపలేకపోయింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మేయర్ పీఠం సాధిస్తుందా.. లేదా అనే చర్చ కన్నా బీజేపీ ఎన్ని స్థానాలను గెలుచుకుంటుంది అన్నదే ప్రధానంగా మారింది. ఇంతలా చర్చనీయాంశంగా మారడంతో ఓ రకంగా బీజేపీ కొంత విజయం సాధించినట్లే. అయితే ఇది చర్చల వరకే పరిమితమవుతుందా..? సీట్లను కూడా కైవసం చేసుకుంటుందా..? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.