iDreamPost
iDreamPost
దేశ పాలనా వ్యవస్థకు అధినేతగా ఉండే ప్రధానమంత్రి భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ పర్యటనలో బటిండా ప్రాంతంలో ప్రధాని మోదీ కాన్వాయ్ ని రైతు సంఘాల ప్రతినిధులు అడ్డుకుని రహదారిని దిగ్బంధించటం.. 20 నిమిషాలు ఫ్లై ఓవర్ పైనే చిక్కుకుపోయిన ఆయన చివరికి కార్యక్రమాలు రద్దు చేసుకుని వెనుదిరిగి వెళ్లిపోవడంలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. హెలికాఫ్టర్లో వెళ్లాల్సిన ప్రధాని వర్షం కారణంగా రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రధాని పర్యటించే మార్గాల్లో భద్రతా ఏర్పాట్లు, అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసి ఉంచడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఇక్కడే విఫలమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చివరి క్షణంలో ఎంచుకున్న రోడ్డు మార్గం గురించి ఎవరికీ తెలియకూడదు. కానీ పెద్ద సంఖ్యలో రైతులు ఆ మార్గాన్ని దిగ్బంధించి ప్రధాని కాన్వాయ్ ని అడ్డుకోవడం అనుమానాలకు తావిచ్చింది. పైగా రాష్ట్ర పోలీసు వర్గాలే తమకు ఆ సమాచారం ఇచ్చారని ప్రకటించడం ద్వారా సంఘటనకు కారకులైన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు సుర్జీత్ సింగ్ ఫూల్ రాష్ట్ర ప్రభుత్వంపై బాంబ్ వేశారు. మొదట ఎదురుదాడితో సమర్థించుకోవడానికి ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వం.. తర్వాత దిగివచ్చి ఘటనపై విచారణకు అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. పంజాబ్ హర్యానా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మెహతాబ్ గిల్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మలతో కూడిన ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తుంది.
బ్లూబుక్ ప్రకారం భద్రత
ప్రధానమంత్రి, ఇతర వీవీఐపీల పర్యటనల సందర్భంగా అనుసరించాల్సిన ప్రోటోకాల్, భద్రత ఏర్పాట్లకు సంబంధించి బ్లూబుక్ అత్యంత కీలకమైనది. ఇందులో ఉన్న మార్గదర్శకాలనే భద్రతవర్గాలు, ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది. బ్లూబుక్ నిబంధనలనే పంజాబ్ పోలీసులు పట్టించుకోలేదని కేంద్ర హోంశాఖ ఆరోపించింది. పంజాబ్ ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
ప్రధానమంత్రి రాష్ట్రాల పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రత్యేక కాన్వాయ్ ఉంటుంది. ఇందులో రెండు ఆర్మర్డ్ బీఎండబ్ల్యూ 7 సిరీస్ సెడాన్ కార్లు, ఆరు బీఎండబ్ల్యూ ఎక్స్ 5 కార్లు, ఒక మెర్సెడిస్ బెంజ్ అంబులెన్స్ మరో డజను వాహనాలు ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. తుపాకీ తూటాలు, బాంబు పేలుళ్లకు చెక్కుచెదరవు. కాన్వాయ్ లో ఒక డమ్మీ వాహనం ఉంటుంది. ప్రధాని ఏ వాహనంలో ఉన్నారన్నది తెలియకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఒక జామర్ వాహనం ఉంటుంది. ప్రధాని పర్యటన మార్గంలో రోడ్లకు ఇరువైపులా వంద మీటర్ల దూరంలో ఉన్న పేలుడు, ఇతర ప్రమాదకర వస్తువులను ఇది నిర్వీర్యం చేస్తుంది.
5 అంచెల భద్రత
ప్రధానికి ఐదు అంచెల్లో సుమారు వందమంది నిష్ణాతులైన సాయుధ సిబ్బంది రక్షణ కల్పిస్తారు. ప్రధానికి అత్యంత సమీపంలో ఉండే మొదటి సర్కిల్లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) దళాలు రక్షణగా ఉంటాయి. రెండో సర్కిల్లో వ్యక్తిగత గార్డులు ఉంటారు. మూడో సర్కిల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) కమెండోలు, నాలుగో సర్కిల్లో పారామిలటరీ బలగాలు రక్షణగా ఉంటారు. చివరిదైన ఐదో సర్కిల్లో ప్రధాని ఏ రాష్ట్రంలో పర్యటిస్తే ఆ రాష్ట్ర పోలీసు బలగాలు భద్రతా విధుల్లో ఉంటాయి. ప్రధాని పర్యటన మార్గంలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడం, భారీకేడ్లు, చుట్టుపక్కల భవనాలపై సాయుధ పోలీసులను మోహరించడం, పర్యటన మార్గాన్ని క్లియర్ చేసి ప్రధాని కాన్వాయ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసుల భాద్యత.