ఏపీలో విపక్ష పార్టీలకు ఏమీ పాలుపోతున్నట్టు కనిపించడం లేదు. తాము చెప్పిన దానికి భిన్నంగా తామే వాదించ పూనుకోవడం దానికి నిదర్శనం. ఒకసారి మాట్లాడిన మాటలను మళ్లీ మాట్లాడకుండా తామెంత గందరగోళంలో ఉన్నామో చెప్పుకోవడానికి టీడీపీ, బీజేపీ వంటి పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా వినాయకచవితి ఉత్సవాలకు కోవిడ్ ఆంక్షలు పాటించాలని ఏపీ ప్రభుత్వం చెబితే దానిని తప్పుబట్టడానిక తయారయిన చంద్రబాబు ధోరణి ఆశ్చర్యంగా కనిపిస్తోంది.
దేశమంతా కోవిడ్ ఆందోళనలు పూర్తిగా తొలగిపోలేదు. కేరళ వంటి రాష్ట్రాల్లో వివిధ పండుగల నేపథ్యంలో తలెత్తిన పరిస్థితి అందరి ముందూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. వినాయక చవితి మాత్రమే గాకుండా రాబోయే రెండు నెలల్లో వివిధ పండుగల సందర్భంగా పడ్బందీగా వ్యవహరించాలని చేసిన సూచనను అమలు చేస్తోంది. కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘలనలను అడ్డుకోవాలన్న ఆదేశాలను ఆచరిస్తోంది. దీనిలో నేరం ఉంటే అలాంటి ఆదేశాలు విడుదల చేసిన కేంద్రానిది బాధ్యత అవుతుంది. కానీ కరోనా వైరస్ తాకిడి నుంచి ప్రజలను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుబట్టడం అన్యాయమే అనాల్సి ఉంటుంది.
కానీ ఏపీ బీజేపీ నేతలు, టీడీపీ అధినేత కూడా కోవిడ్ నిబంధనలు దేశమంతటా ఉంటాయనే విషయాన్ని మరచిపోయారు. కోవిడ్ ఆంక్షలను పాటిస్తూ వినాయక చవితి జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తప్పుబడుతున్నారు. ఇప్పటికే మొహరం సహా అన్ని పండుగల విషయంలోనూ వాటిని పాటిస్తున్నారనే సంగతి విస్మరించారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మరో అడుగు ముందుకేసి ఏకంగా వైఎస్ వర్థంతి జరుపుకుంటే లేనిది వినాయకచవితి జరపకూడదా అని ప్రశ్నించడమే అతని నైజాన్ని చాటుతోంది. వాస్తవంగా జగన్ వ్యక్తిగత విశ్వాసాల చుట్టూ ఈ వివాదాన్ని మళ్లించాలనేది చంద్రబాబు, బీజేపీ నేతల యత్నం. కానీ ప్రభుత్వం మాత్రం కేంద్రం ఆదేశాలను అమలు చేస్తూ, రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభించకుండా చూడాలనే సంకల్పంతో ఉంది. ఒకవేళ పండుగల వేళ కట్టుతప్పితే, కరోనా కేసులు మళ్లీ పెరిగితే ప్రభుత్వం విఫలమయ్యిందనే వాదన చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అంటే రాజకీయ లక్ష్యాల కోసం రాష్ట్రం, ప్రజలు ఏమయినా ఫర్వాలేదనే పరిస్థితుల్లోకి వచ్చేసినట్టుగా స్పష్టమవుతోంది.
Also Read : పులి భోజనం అంటే తెలుసా?
వైఎస్ వర్థంతి సహా అన్ని కార్యక్రమాలను పరిమితి మేరకే నిర్వహిస్తున్నారు. చివరకు సీఎం జగన్ కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ, రచ్చబండ సహా పలు కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ ప్రోటోకాల్ కి కట్టుబడి పనిచేస్తున్నారు.చివరకు అసెంబ్లీ సమావేశాలు సహా అన్నింటి విషయంలోనూ ఇది బహిరంగంగా కనిపిస్తోంది. కానీ సినిమా హాళ్లు తెరిచారు కాబట్టి చవితి పందిళ్లు ఎందుకు వేయకూడదనే వితండ వాదన కొందరు ముందుకు తెస్తున్నారు.
చవితి పందిళ్లు వేయకూడదని చెప్పడానికి, అనుమతులు తీసుకుని నిబంధనలు పాటిస్తూ వేయండి అని చెప్పడానికి తేడా ఉంది. ప్రభుత్వం నిబంధనలు పాటించాలని, అనుమతులు తీసుకుని పండుగ జరపాలనే నిర్ణయం ప్రజలను కరోనా నుంచి కాపాడడానికేనన్నది సుస్పష్టంగా తెలుస్తున్నా దానికి వక్రభాష్యాలు చెప్పడం విశేషమే. ఇక వైఎస్సార్ వర్థంతిని ఆయన అభిమానులు జరుపుకుంటారు. ఇటీవల బహిరంగంగా కంటే ఇళ్లల్లోనే , తమ గుండెల్లోనే వైఎస్ ని గుర్తు చేసుకుని సరిపెట్టుకుంటున్న వాళ్లు ఎక్కువగా ఉన్నారు. దానిని ఏకంగా వినాయక చతుర్ధికి ముడిపెట్టిన బాబు వ్యవహారం ఎబ్బెట్టుగా మారుతోంది.
ఏపీలో కుల రాజకీయాలకు కాలం చెల్లిన తరుణంలో మత సంబంధిత అంశాలన్నీ రాజకీయాల కోసం వాడుకునే యత్నంలో చంద్రబాబు అసలు విషయం మరచిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తమ సమస్యల మీద స్పందిస్తే ప్రజాదరణ దక్కుతుంది గానీ ఇలాంటి కుట్రలతో ముందుకెళ్లాలని చూస్తే అలాంటి కుత్సిత బుద్ధిని జనం గమనించకుండా ఉండరని తెలుసుకోవాలి. మతోన్మాద రాజకీయాలకు ఏపీ లో అవకాశం లేదని అర్థం చేసుకోవాలి. మతాల ద్వారా మనుషుల్ని విభజించాలని చూస్తే అది బాబుకే ఎసరుపెడుతుందని గ్రహించాలి.
Also Read : బాబూ..మీకు అర్థమవుతోందా.. ఏపీ అప్పులపై కేంద్రం సానుకూల స్పందన