Idream media
Idream media
దేశమంతా ఇప్పుడు బీజేపీ.. బీజేపీ అంటోంది. తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ, పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీయే సత్తా చాటింది. అయితే… ఇప్పుడే కాదు, గత ఎన్నికల్లో కూడా బీజేపీ దేశంలో అదే ఊపు ప్రదర్శించింది. కానీ తెలంగాణలోమాత్రం సీట్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో 24 నియోజకవర్గాలకు గాను అయిదు అసెంబ్లీ సీట్లను సాధించిన బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో తన పట్టును నిలుపుకుంది. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికలో మాత్రం కేవలం ఒకే ఒక సీటుతో సరిపెట్టుకుంది. దీంతో గ్రేటర్లో బీజేపీ హవా తగ్గుతుందనుకుంటున్న తరుణంలో పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ సీటును సాధించుకుంది. 2020 గ్రేటర్ ఎన్నికలు వచ్చే సరికి సీట్లు ఎన్ని సాధిస్తుందనేది పక్కన బెడితే.. ప్రచారంలో దూసుకెళ్లి అందరి నోటా బీజేపీ మాట వచ్చేలా మారింది. అనూహ్యంగా గ్రేటర్ లో ఆ పార్టీకి ఎందుకంత ఊపొచ్చింది..? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
లేస్తూ.. పడుతూ..
1983లో మలక్‌పేట నుంచి గెలిచి బీజేపీ హైదరాబాద్ లో తన మొదటి ఖాతాను తెరిచింది. ఆ తర్వాత 1985లో రెండు స్థానాలను సాధించి తన పట్టును నిలుపుకుంది. కార్వాన్ నియోజకవర్గం నుంచి బద్దం బాల్‌రెడ్డి, హిమాయత్‌నగర్ నుంచి నరేంద్ర విజయం సాధించి కాషాయం జెండా ఎగుర వేశారు. నేటి బీజేపీ పటిష్టతకు నాడు ఆ నేతలు వేసిన పునాదులే కారణం. ఇదిలాఉండగా.. 1989లో కేవలం కార్వాన్ నియోజకవర్గంలో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. 1991లో బీజేపీ 42.2 శాతం, 1996లో 26.68 శాతం ఓట్లు సాధించింది. 1999లో ముషీరాబాద్, మలక్‌పేట, మహరాజ్‌గంజ్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచి పునాదిని పటిష్టం చేసుకున్నారు. మళ్లీ 2004, 2009 ఎన్నికల్లో హిమాయత్‌నగర్ నియోజకవర్గంతోనే సరిపెట్టుకున్నారు. 2009 ఎన్నికల్లో జిల్లా పరిధిలో 14.42 శాతం ఓట్లువచ్చాయి. గ్రేటర్‌పరిధిలో 11.92 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014లో అయిదు స్థానాలు సాధించింది. ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, గోషామహల్, ఉప్పల్ నియోజకవర్గాల్లో పోటీ చేసి బీజేపీ విజయం సాధించింది. కార్వాన్, మల్కాజిగిరి, యాకుత్‌పురా, మలక్‌పేట నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇలా 1983 నుంచి పడుతూ.. లేస్తూ సాగిన బీజేపీ ప్రయాణం 2020లో మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది.
కారణాలు ఇవేనా..?
బీజేపీకి మొట్ట మొదటి ఊపు దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపుతో ప్రారంభమైంది. ఆ గెలుపు ఆ పార్టీ శ్రేణులకు తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే ఊపుతో గ్రేటర్ పీఠంపై పాగా వేసేందుకు బీజేపీ ప్రణాళికలు రచించింది. ఈ పీఠం ద్వారా అసెంబ్లీకి పునాదులు వేసుకోవాలని ముందుగానే భావించింది. ఇంతలో గ్రేటర్ ను ఎన్నడూ లేని స్థాయిలో వరదలు ముంచెత్తాయి. ఒక్కసారిగా వచ్చిన ఉపద్రవంతో నగరాన్ని కుదుటుపడేలా చేయడం ప్రభుత్వానికి శక్తికి మించిన భారంగా మారింది. అయినప్పటికీ ప్రజలను ఆదుకునే ప్రయత్నాలు చేసింది. ముంపు బాధితులకు తక్షణ సహాయంగా రూ. 10 వేలు ప్రకటించింది. సరైన ప్రణాళికలు లేకుండానే ఇంటింటికీ వెళ్లి పంపిణీకి శ్రీకారం చుట్టింది. అది కొన్నిచోట్ల బెడిసి కొట్టింది. సహాయం అందలేదంటూ వందలాది మంది రోడ్డెక్కారు. ఇదే అదునుగా భావించి ప్రభుత్వంపై ఉన్నఅసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ రంగంలోకి దిగింది. బాధితుల తరఫున పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఇది కొంత ఆ పార్టీకి కలిసి వచ్చింది. బీజేపీ మరింత బలపడకూడదన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ తక్షణమే గ్రేటర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. అప్పటికే దుబ్బాక గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ గ్రేటర్ లో కూడా కాషాయ జెండా ఎగురవేసేందుకు భారీగానే ప్రణాళికలు రచించింది. వీటిని కేవలం మున్సిపల్ ఎన్నికలగానే పరిగణించకుండా.. రాష్ట్రంలో నిలబడడానికి దొరికిన దారిగా భావించింది. అందుకే కేంద్ర హోం మంత్రి సహా.. బీజేపీ అగ్ర నాయకులందరినీ ప్రచారంలోకి దింపింది. వారి రాకతో గ్రేటర్ లో బీజేపీ మార్మోగింది. కాషాయం మార్క్ ప్రసంగాలతో ఆకట్టుకుంది. గెలుపోటముల సంగతి ఎలాగున్నా.. ప్రచారంలో మాత్రం టీఆర్ఎస్ కు దీటుగా నిలబడింది. మరి ఆ పార్టీ ఎంత వరకూ లక్ష్యాన్ని సాధిస్తుందో.. ప్రచారంలో ఉన్న ఊపు.. ఓట్ల రూపంలో ఎంత వరకు కలిసి వస్తుందా..? అనేదే ఇప్పుడు ఉత్కంఠ.