iDreamPost
android-app
ios-app

AP Politics ,Jagan ,Chandrababu – ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సందడి, మండలి ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, క్యాబినెట్ కూర్పు చుట్టూ చర్చ

  • Published Nov 10, 2021 | 2:11 AM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
AP Politics ,Jagan ,Chandrababu – ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సందడి, మండలి ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, క్యాబినెట్ కూర్పు చుట్టూ చర్చ

ఏపీలో రాజకీయ సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీలో నేతల హడావిడి మొదలయ్యింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో శాసనమండలి ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆశావాహుల సందడి మొదలయ్యింది. అధినేత దృష్టిలో పడేందుకు అనేక కసరత్తులు చేస్తున్నారు. జగన్ ఆశీస్సులుంటే నేరుగా పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం ఉండడంతో అనేక మంది తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడలో కార్పోరేటర్ గా బరిలో ఉన్న మైనార్టీ మహిళను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. పార్టీలో ప్రారంభం నుంచి పనిచేస్తున్న మోషేన్ రాజుకి కూడా అవకాశం ఇచ్చారు. ఇలా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఉంటుందనే సంకేతాలు ఇవ్వడంతో సీనియర్లు, చాలాకాలంగా ఎదురుచూస్తున్న నేతలు ఇప్పుడు రేసులో కనిపిస్తున్నారు.

ఎమ్మెల్సీ స్థానాలకు 14 మందికి అవకాశాలుండడం, అందులో కూడా 50 శాతం రిజర్వుడు కేటగిరీలో ఉంటాయనే సంకేతాలు రావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటుగా మహిళా నేతల్లో కూడా ఆశలు పెరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా జిల్లాలకు చెందిన నేతలకు ఛాన్స్ వస్తుంది కాబట్టి తమ తమ జిల్లాల పరిధిలో సీట్ల కోసం కొందరు ఎదురుచూస్తున్నారు. అందులోనూ కీలకమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అక్కడ పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. అదే సమయంలో కులాల వారీగా లెక్కల్లో ఉన్న నేతలు దానికి అనుగుణంగా ప్రయత్నాలు మొదలెట్టారు. ఈసారి పార్టీ అధినేత టిక్ పెడితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉండడంతో చాలామంది ఆశల్లో ఉన్నారు. అందులోనూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అనుగుణంగా ఈసారి ఎంపిక జరగబోతోంది. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకునే దిశలో ఎమ్మెల్సీ అవకాశాలు ఇవ్వబోతున్నట్టుగా భావిస్తున్నారు. దాంతో అవి దక్కించుకునే నేతలెవరన్నది ఆసక్తిగా కనిపిస్తోంది.

Also Read : YCP MLC Aspirants – 14 ఎమ్మెల్సీ పదవులు.. ఆశానువాహులు ఎవరు..?

అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆసక్తి..

ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఉంటుంది. స్థానిక ఎన్నికలు, మండలి కి కొత్త సభ్యుల ఎంపిక తర్వాత సమావేశాలు జరగబోతున్నాయి. అంతేగాకుండా ఏపీ క్యాబినెట్ కూర్పునకు ముందుగా సమావేశాలు జరగబోతున్నాయి. నవంబర్ 18 నుంచి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. వారం రోజుల పాటు జరుపుతారని ప్రాథమిక సమాచారం. దాంతో ఈ సమావేశాల సందర్భంగా అధినేత దృష్టిలో పడాలనే లక్ష్యంతో చాలామంది నేతలు ప్రయత్నాలు చేయబోతున్నారు. క్యాబినెట్ కూర్పులో కూడా కొత్త , పాత తేడా లేకుండా సామర్థ్యం ఉన్న వారందరికీ ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్న జగన్ ని ఆకట్టుకునే లక్ష్యంతో పలువురు ప్రయత్నించబోతున్నారు. రెండున్నరేళ్లుగా సభలోనూ , వెలుపలా సమర్థవంతంగా పనిచేసిన నేతలకు గుర్తింపుగా జగన్ అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. దాంతో చాలామంది ఆశావాహులు ఈసారి మంత్రి పదవుల రేసులో ఉండడంతో అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిగా మారబోతున్నాయి. అందులోనూ వరుస ఎన్నికల్లో విజయాలతో ఊపు లో ఉన్న వైఎస్ఆర్ సిపి నేతలు విపక్షంతో మరింత దూకుడుగా సాగడం ఖాయంగా ఉంది.

క్యాబినెట్ కూర్పుపైనా చర్చ

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కొత్త క్యాబినెట్ విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రులకు రెండున్నరేళ్ల గడువు ముగుస్తున్న తరుణంలో మొత్తం అందరినీ మార్చేసి కొత్త వారిని తీసుకొస్తారా లేక మినహాయింపులుంటాయా అన్నదే ప్రశ్న. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి సీఎం సన్నిహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం క్యాబినెట్ లో సమూల మార్పులు జరగబోతున్నాయి. దాంతో పలువురు కొత్త మొఖాలు మంత్రిమండలిలోకి రాబోతున్నారు. వారెవరన్నదే ఉత్కంఠ. చాలామంది మొదటి క్యాబినెట్ బెర్తు కోసమే క్యూలో నిలుచున్నప్పటికీ అప్పట్లో జగన్ యువతకు చాన్సిచ్చారు. దాంతో ఈసారి ఏం చేయబోతున్నారోననే ఉత్కంఠ సాగబోతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అందరి మధ్య ఇదే హాట్ టాపిక్ గా ఉండబోతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయడం, శీతాకాల సభా సమావేశాలకు పార్టీని సన్నద్ధం చేయడం, కొత్త క్యాబినెట్ కూర్పు వంటి వ్యవహారాల్లో సీఎం బిజీగా మారబోతున్నారు.

Also Read : AP MLC Elections – మోగిన ఎమ్మెల్సీ నగారా.. ఎన్నిక లాంఛనమే.. వైసీపీలో సందడి