iDreamPost
android-app
ios-app

ఇంటి ఓనర్లు కాస్త ఉదారత చూపండి…!

ఇంటి ఓనర్లు కాస్త ఉదారత చూపండి…!

వరదలు, తుపానులు, భూకంపాలు, సునామీలు, కలరా, ప్లేగు….తాజాగా కరోనా…! ఇవన్నీ మానవాళి ఉనికిని ప్రశ్నించే ఉపద్రవాలు, వ్యాధులు…! వీటి నుంచి బయట పడాలంటే ఇతరత్రాలతోపాటు మానవత్వం అనే మందూ(వ్యాక్సిన్) అవసరమే. కానీ కొంతమంది ఇంటి ఓనర్లు ఈ సమయంలోనూ అద్దెదారులను రెంట్ కోసం వేదిస్తున్నారనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఈ నగరాలే కేంద్రాలు….

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కాకినాడ, వరంగల్…. ఈ నగరాలన్నీ ఉపాధికి వేదికలుగా ఉన్నాయి. చుట్టు పక్కల ప్రాంతాలే కాదు పక్క రాష్ట్రాల నుంచీ ఆయా నగరాలకు ఉపాధి కోసం వలస వస్తుంటారు. హైదరాబాద్ విషయానికి వస్తే…ఏకంగా సెటిలర్ల నగరంగా గుర్తింపు పొందింది. ఏపీతోపాటు దేశంలోని అన్ని చోట్ల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వలసొచ్చారు. వీరిలో ఎక్కువ శాతం మందికి  నగరంలో శాశ్వత నివాసాలు లేవు. దీంతో అద్దె ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు.

ఛిద్రమైన బతుకు చక్రం…

కరోనా కారణంగా రోజువారీ కూలీలు, వర్కర్లు, చిన్న జీతగాళ్లు, స్వయం ఉపాధిపై ఆధారపడిన వారి బతుకు బండి ఛిద్రమైంది. వీరిలో కొంతమంది స్వస్థలాలకు చేరుకోగా మరికొంతమంది ఇక్కడే ఉంటున్నారు. పూట గడవటానికే ఇబ్బంది పడుతున్న వీరిని అద్దె కోసం ఇంటి ఓనర్లు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. స్వస్థలాలకు వెళ్లిన వారికి ఫోన్ చేసి మరీ ఆన్లైన్ మార్గాల్లో రెంటు పంపమని కోరుతున్నట్లు తెలుస్తోంది.

కాస్త ఉదారత…

రెంటుకు ఉంటున్నప్పుడు ధర్మంగా అద్దె చెల్లించాలి. కొన్ని కుటుంబాలకు కేవలం అద్దెపై వచ్చే డబ్బులే జీవనాధారం. అలాంటి వారు అద్దెను అడగడంలో తప్పులేదు. కానీ మూడు నాలుగు బిల్డింగులు… కార్లు…ఉద్యగాలు కలిగిన వారు సైతం అద్దె కోసం ఒత్తిడి చేయడం మానవత్వం అనిపించుకోదు. 

మానవీయులు….

కొంతమంది ఓనర్లు డబ్బే పరమావధిగా ప్రవరిస్తుంటే… మరికొంతమంది మానవత్వాన్ని చాటుతున్నారు. హైదరాబాద్ లోని బాలానగర్ కు చెందిన కోడూరి బాలలింగం ఈ కోవకు చెందిన వ్యక్తే..! బాలలింగం తన బిల్డింగుల్లో అద్దెకుంటున్న వారికి ఏకంగా రూ.3 లక్షల అద్దెను మాఫీ చేశాడు. దీంతో పాటు వలస కూలీలకు ఒక్కొకరికీ రూ.1000 చొప్పున రూ.2 లక్షలు పంచి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

వాణిజ్యంలోనూ….

నగరాల్లో షట్టర్లు తీసుకొని ఎంతో మంది వ్యాపారం చేస్తుంటారు. వీరంతా వ్యాపారాలు చేయలేని పరిస్థితి. కాబట్టి వీలైతే పూర్తిగా లేకుంటే కొంత మొత్తంలో అయినా వారికి అద్దె నుంచి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది. ప్రముఖ రియాల్టీ డెవలపర్ లోధా థానే, పుణే, ముంబై లల్లోని తన టవర్లల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి తిరిగి ఆపరేషన్స్ ప్రారంభమయ్యే వరకు రెంటును మాఫీ చేసింది. ఇదే స్ఫూర్తితో మరింత మంది ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఒత్తిడి వద్దంటున్న ప్రభుత్వాలు…

కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ లాక్ డౌన్ కాలంలో రెంట్ కోసం ఒత్తిడి తేవడం కానీ, ఇల్లు కాళీ చేయమనడం కానీ చేయరాదని ఓనర్లకు సూచించింది. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మూడు నెలలపాటు అద్దెను మాఫీ చేయడం లేదా తగ్గించటం చేయాలని సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే ఏకంగా లాక్ డౌన్ కాలంలో అద్దె కోసం పేదలను వేధిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో పాటు లాక్ డౌన్ ముగిసిన తర్వాత పేదలు అద్దె చెల్లించలేక పోతే ప్రభుత్వమే ఆ కాలానికి(లాక్ డౌన్) అద్దె చెల్లిస్తుందని ప్రకటించారు. కాబట్టి తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా అద్దె చెల్లించలేని పేదలను ఆదుకొనేలా చర్యలు తీసుకుంటే సర్వత్రా హర్షం వ్యక్తమవుదతుంది.