చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఎంత కష్టమైనా బిడ్డకు ఇష్టమైన రంగంలో ప్రోత్సహించేందుకు ఆ తల్లి 24 గంటలూ కష్టపడుతోంది. అయినా నలుగురు పిల్లలను సాకడం ఆ తల్లికి సాధ్యం కావడం లేదు. తనను మనసున్న సీఎం జగనన్న ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తానని చిత్తూరు జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారిణి కొండా సుశీల కోరుతోంది. తనకు పౌష్టికాహారం, సరైన హాకీ కిట్, హాకీ అకాడమీలో చేర్పిస్తే జన్మనిచ్చిన గడ్డతో పాటు దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తానంటున్న సుశీల స్ఫూర్తిదాయక జీవితం గురించి తెలుసుకుందాం.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ దళితకాలనీకి చెందిన కొండా చెంగల్రాయులు, రేణుక దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో సుశీల రెండో సంతానం. తల్లిదండ్రుల మధ్య ఎప్పుడూ సఖ్యత ఉండేది కాదు. దీంతో పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత తల్లి రేణుకే తీసుకొంది.
తిరుపతి రుయాలో స్వీపర్‌గా పనిచేస్తూ తొండవాడలో పలువురి ఇళ్లలో పనులు కూడా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఒక రోజు ఒక ఇంటామె “రేణుకా నీకు, నీ పిల్లలకు సమాజంలో గౌరవం రావాలంటే వారిని బాగా చదివించు. చదువే వారికి అన్నీ తెచ్చిపెడుతుంది” అని చెప్పిన మాటలు మంత్రంలా పనిచేశాయి. ఎలాగైనా తన బిడ్డలకు చదువు చెప్పించి వారి జీవితాలను తనలాగా కాకుండా చేయాలని ప్రతినబూనింది. అందుకు తగ్గట్టే సుశీలతో పాటు మిగిలిన ముగ్గురు పిల్లలు కూడా తల్లి ఆశయాన్ని నెరవేర్చేందుకు పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. తొండవాడలోని ప్రభుత్వం పాఠశాలలో సుశీల మూడో తరగతి వరకు చదివించింది.
తన దగ్గర ఉంటే సరిగా చదివించలేనని రేణుక భావించింది. పెద్ద కుమార్తె సుశీలను చిన్నవయస్సులోనే నాలుగో తరగతికి తిరుపతి చెన్నారెడ్డికాలనీలోని మున్సిపల్ స్కూల్‌లో చేర్చారు. అక్కడే ఎస్సీ బాలికల హాస్టలో ఉండి ఐదో తరగతి వరకు చదువుకొంది. ఆరు నుంచి పదో తరగతి వరకు నెహ్రూమున్సిపల్ హైస్కూల్‌లో చదివింది. ఆరో తరగతిలో ఉండగా హాస్టల్‌లో తనతోటి సీనియర్స్ స్టిక్స్ పట్టుకుని రావడం, వారు క్యాంప్‌లకు వెళ్లడం, స్పోర్ట్స్‌లో ప్రత్యేకంగా కనిపించడం సుశీలను ఆకర్షించాయి. తాను కూడా అలా ఉంటే బాగుంటుందని, ఉండాలంటే ఏం చేయాలి? ఏం ఆడాలి అనే ఆలోచనలకు అక్కడే బీజం పడింది. ఆ బీజమే విత్తుగా మారి….ప్రస్తుతం చెట్టుగా పెరుగుతోంది. ఇప్పుడా చెట్టుకు సరైన పౌష్టికాహారం, శిక్షణ అవసరమవుతోంది.
తోటి సీనియర్ క్రీడాకారిణులతో పాటు పీఈటీ ప్రసన్న మేడమ్ చేతిలో స్టిక్‌ను చూసి “ఇదేంటి మేడమ్” అని ఓ రోజు అడిగింది. దీన్ని “హాకీ స్టిక్” అంటారమ్మా అని చెప్పిందా టీచర్. నాకూ ఆడాలని ఉందని తన ఇష్టాన్ని పీఈటీ మేడమ్‌తో వ్యక్తపరచింది సుశీల. నాకూ ఆడాలని ఉందని చెబుతున్న సుశీల ముఖంలో భవిష్యత్ ఆశా కిరణాన్నిప్రసన్న మేడమ్ చూడగలిగారు. ఓకే అని మేడమ్ చెప్పారు. అప్పటి నుంచి చేతపట్టిన హాకీ స్టిక్…ఇప్పటి వరకు కిందికి దించింది లేదు.
తిరుపతి శ్రీపద్మావతి కళాశాలలో 2017-19లో ఇంటర్ చదివిన సుశీల ఆటల కారణంగా ఎకనామిక్స్‌లో తప్పిపోయింది. ప్రస్తుతం చంద్రగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటూ స్థానిక బాలుర కాలేజీ మైదానంలో ప్రాక్టీస్ చేస్తోంది. పీఈటీ ప్రసన్న, ఏపీ హాకీ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి, కోచ్‌లు రమేష్ , లక్ష్మీకరుణ శిక్షణ ఇస్తున్నారు.
ఎనిమిదో తరగతిలో మదనపల్లెలో జరిగిన జిల్లాస్థాయి హాకీ టోర్నీలో ప్రతిభ చూపడంతో అండర్-17 విభాగంలో నేషనల్స్‌కు ఎంపిక చేశారు. ఇప్పటి వరకు 23 జిల్లాస్థాయి, 5 రాష్ట్ర స్థాయి, అండర్-17, అండర్-19 కేటగిరీల్లో జూనియర్, సీనియర్స్ విభాగాల్లో గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మద్యప్రదేశ్ రాష్ట్రల్లో 5 జాతీయస్థాయి టోర్నీల్లో సుశీల ఆడింది.
చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. రన్నింగ్, జూడో, త్రోబాల్, వాలీబాల్, రెజ్లింగ్, షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ తదితర ఆటల్లోనూ వివిధ స్థాయిల్లో సుశీల రాణిస్తోంది. హాకీ పోటీలు లేని సమయాల్లో వీటిల్లో కూడా పాల్గొంటూ పతకాలు తీసుకొస్తూ తానూ చదువుతున్న విద్యాసంస్థలతో పాటు జిల్లాకు పేరు సంపాదించి పెడుతోంది.
అన్నాతమ్ముడూ, చెల్లి కూడా క్రీడాకారులే
సుశీల అన్నదినేష్ వాలీబాల్ నేషనల్ ప్లేయర్, తమ్ముడు వెంకటేష్ కబడ్డీలో జిల్లాస్థాయి, చెల్లి భూమిక హాకీలో జిల్లాస్థాయిల్లో ఆడుతున్నారు.
తొండవాడలో సొంతిల్లు కూడా లేదు. రూ.400 అద్దె ఇంటిలో ఉంటున్నారు. అమ్మ స్వీపర్‌గా పనిచేస్తూ నెలకు రూ.6వేలు సంపాదిస్తోంది. దీనికి తోడు తొండవాడలో పలువురి ఇళ్లల్లో పాచిపనులు చేయడం ద్వారా అంతోఇంతో సంపాదిస్తోంది. ఈ సంపాదన నలుగురి పిల్లల చదువు, కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదు. సుశీల ఎక్కడైనా నేషనల్స్ ఆడేందుకు వెళ్లాలంటే కనీసం రూ.5వేల నుంచి రూ.6వేల ఖర్చు వస్తోంది. ఇంత సొమ్ము భరించే శక్తి ఆ తల్లికి ఏ మాత్రం లేదు. తన ఆర్థిక పరిస్థితిని చూసి పీఈటీ ప్రసన్న, కోచ్‌లు రమేష్ , లక్ష్మీకరుణ, నరసింగాపురం సింగిల్‌విండో మాజీ చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి, పులికంటి మోహన్‌రెడ్డి తదితరులు ఆర్థిక సాయం అందిస్తున్నారని సుశీల చెబుతోంది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఓ సమావేశం నిమిత్తం తల్లితో పాటు సుశీల విజయవాడకు వెళ్లింది. అక్కడ హోంమినిస్టర్ సుచరితను కలిసింది. ఏం కావాలని మంత్రి అడిగారు. తనకు మంచి హాకీ కిట్ కావాలని సుశీల అడగ్గానే మంత్రి పాజిటివ్‌గా స్పందించారు. మంత్రి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ వారు రూ.25 వేల విలువైన హాకీ కిట్‌ను సుశీలకు అందించారు. అంతేకాదు భవిష్యత్‌లో ఏం కావాలన్నా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారని సుశీల చెబుతోంది.
సుశీల చేతిలో స్టిక్ కాదది…ఆశయం
సౌకర్యాలన్నీ ఉన్నవారు సైతం సరైన ఆటతీరు ప్రదర్శించని ఎంతోమందిని మనం చూస్తున్నాం. అలాంటిది అడగడుగునా ఆర్థిక ఇబ్బందులు, అసమానతలను ఎదుర్కొంటూ రోజురోజుకూ ఆటలో రాటుదేలుతూ సుశీల ముందుకు దూసుకుపోతూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇప్పుడామె చేతిలో ఉన్నది హాకీ స్టిక్ మాత్రమే కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనే పట్టుదల. అందుకోసం అరకొర సౌకర్యాల మధ్య ప్రాక్టీస్ చేస్తూ, లక్ష్యసాధనే అంతిమ ఆశయమనే స్టిక్‌తో మైదానంలో అవిశ్రాంతంగా పరుగు పెడుతోంది. ఆమె పరుగుకు ప్రభుత్వ సాయం తోడైతే…హాకీలో అద్భుతాలను సృష్టించవచ్చు.
కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో మనసున్న మారాజు సీఎం జగనన్న అని అందరూ చెప్పుకుంటుంటే వింటున్నాను. మాకు కనీసం ఉండేందుకు సొంతిల్లు కూడా లేదు. ఉగాదికి అందరితో పాటు కూడా సొంతిల్లు యోగం కల్గిస్తారని ఆశిస్తున్నాను. అలాగే క్రీడాకారులు ఆటల్లో బాగా రాణించాలంటే సరైన తిండితీర్థాలే ముఖ్యం. సరైన తిండిలేకపోతే క్రీడాకారులు నీరసపడతారు. మైదానంలోకి దిగినా ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోలేరు. నాకు మంచి పౌష్టికాహారం , జిమ్, కోన్ సౌకర్యంతో పాటు మంచి హాకీ కిట్‌ను అందించేందుకు జగనన్న చొరవ చూపాలి. జగనన్న సర్కార్ సాయం అందిస్తే, ప్రజల రుణాన్ని ఊరికే ఉంచుకోను. జాతీయ జట్టుకు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ర్టానికి, జిల్లాకు, మా ఊరికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాను.
–సుశీల, హాకీ క్రీడాకారిణి