iDreamPost
iDreamPost
రాయలసీమలోని కర్నూలు జిల్లా రైతాంగం ఆనందంలో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల నెరవేరబోతోందని సంబరపడుతున్నారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా వైసీపీ తీసుకుంటున్న చర్యలతో తమ అభివృద్దికి అడుగులు పడ్డాయంటున్నారు.
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమంటే కోడుమూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు ప్రాంతాలు. వెనుకబడిన ప్రాంతాలైన పత్తికొండ, కోడుమూరు, డోన్ నియోజకవర్గాల్లో రైతులను దృష్టిలో ఉంచుకొని దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 1960లో హంద్రీనదికి ఉపనది అయిన ఇంద్రావతి వాగుపై గాజుల దిన్నె ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు కింద కుడి కాలువను 36 కిలోమీటర్లు, ఎడమ కాలువను 24.5 కిలోమీటర్ల వరకు ఏర్పాటుచేశారు. 4.5 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం 24 వేల 372 ఎకరాలకు నీరందిస్తున్నారు.
అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కింద ఉన్న బండగట్ట వాటర్ స్కీం ద్వారా దేవనకొండ, పత్తికొండ, ఆస్పరి మండలాల్లోని 29 గ్రామాలకు, కృష్ణగిరి సీపీడబ్ల్యూ స్కీం ద్వారా 55 గ్రామాలకు, పబ్లిక్ హెల్త్ నిధులతో డోన్ మున్సిపాలిటీకి తాగునీరందిస్తున్నారు. ఇటు రైతులకు సాగునీరు, ప్రజల దాహార్తికి త్రాగునీరు అందించేందుకు ప్రాజెక్టు నీరుసరిపోక తీవ్ర ఇబ్బందులు ఉండేవి. నాలుగేళ్ల క్రితం అంచనాలు వేసిన ఇరిగేషన్ అధికారులు పూడిక వల్ల ప్రాజెక్టు 0.65 టీఎంసీల నీటి నిల్వ సామర్య్థం కోల్పోయిందని నిర్దారించారు. ఇంకోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులోనికి నీరు రావడమే గగనంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీటిని మల్లించేందుకు 110.444 వద్ద స్లూయిస్ ఏర్పాటుచేసి కాలువ ద్వారా నీటిని గాజులదిన్నెకు మల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోనే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ 2007లో జీ.వో నెంబర్ 2 జారీ చేసి 5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాలని చెప్పారు. వై.ఎస్ జీవో ఇచ్చినా గత చంద్రబాబు ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసింది.
గత ప్రభుత్వంలో 2017 జనవరిలో గొంతు ఎండిన కర్నూల్ టౌన్ ప్రజల దాహార్తిని,ఎండుతున్న పంటలను కాపాడటానికి అప్పటి కర్నూల్ జిల్లా SE చొరవ తీసుకొని కలెక్టర్ తో పలు మార్లు చర్చించారు. కలెక్టర్ కూడా సమస్యను అర్ధం చేసుకొని హంద్రీ-నీవా నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు,ఆ ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ శాఖ వాళ్ళు హంద్రీ-నీవా నుంచి గాజులదిన్నెకు నీళ్లు ఇచ్చారు.
అయితే ఆశ్చర్యకరంగా ఎవరిని అడిగి మీరు గాజులదిన్నెకు నీళ్లు ఇచ్చారంటూ అప్పటి ENC (ఇంజనీర్-ఇన్-చీఫ్ ) వెంకటేశ్వర రావ్ కలెక్టర్ జిల్లా SE చంద్రశేఖర్ రావ్ కు నోటీస్ ఇచ్చారు. దీన్ని ఏమనాలి?నిర్లక్షమా లేక కక్షనా ?గాజులదిన్నెకు నీళ్లు ఇవ్వటం వలన హంద్రీ-నీవా నీళ్లు గొల్లపల్లికి ఇచ్చామని చెప్పుకోవటానికి చేసిన ఏర్పాట్లకు సరిపడా నీళ్లు రావన్నదే అప్పటి ప్రభుత్వం కోపానికి ఉదాహారణే ENC నోటీస్.
ఉప ముఖ్యమంత్రిగా ఉండి సొంత నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీ-నీవా నీళ్లు ఇప్పించుకుపోలేక పోయిన దుస్థితి KE కృష్ణమూర్తిది. చెరువులకు నీళ్లు ఇవ్వమని KE లేఖ రాయటం దాని మీద ప్రశ్నలు అడుగుతూ కోరీలు పెడుతూ అధికారులు తిరిగి ఉత్తరం రాయటం, చివరికి వంద అడిగిన చోట పది చెరువులకు నీళ్లు ఇవ్వాటం,గత నాలుగేళ్లలో జరిగిన తంతు ఇది.
ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో గాజులదిన్నె ప్రాజెక్టుపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. కర్నూలు సిటీ, కోడుమూరు, డోన్, పత్తికొండ ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం హంద్రీ నీవా నుంచి 3 టీఎంసీల నీటిని గాజులదిన్నెకు తీసుకోవాలని చెప్పారు. రూ. 5.19 కోట్లతో చేపట్టబోయే పనులకు సీఎం అంగీకారం తెలుపడంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది,నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. .
హంద్రీనీవా నుంచి జీడీపీకి నీరు మళ్లిస్తూ జలవనరుల శాఖ ఇటీవలె జీవో 28ని జారీ చేసింది. దీంతో తమ ప్రాంతం మొత్తం సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండకుండా ఉంటామంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరెనెలల కాలంలోనే తమ కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వంపై బహిరంగంగానే ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇన్నాళ్లూ తాగు నీటి కోసం సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పశ్చిమ ప్రాంత ప్రజల ఆనందానికి ఇప్పుడు అవధులులేవు.