iDreamPost
android-app
ios-app

ఖమ్మం ఖిల్లా చరిత్ర తెలుసా..?

ఖమ్మం ఖిల్లా చరిత్ర తెలుసా..?

స్తంభాద్రి గుట్ట తర్వాత ఖమ్మం చరిత్రను చాటిచెబుతున్న మరో చారిత్రక కట్టడం ఖమ్మం ఖిల్లా. తెలంగాణలో రెండో అతిపెద్ద చారిత్రక కట్టడంగా ఖమ్మం ఖిల్లాను పరిగణిస్తారు. కాకతీయులు, రెడ్డిరాజులు, వెలమరాజులు, గజపతులు, శ్రీకృష్ణదేవరాయులు, ముస్లిం రాజులు కూడా ఈ కోటను స్వాధీనం చేసుకుని పాలన సాగించారు.


కోటకు పునాది వేసిన కాకతీయులు..

ఓరుగల్లు రాజ్యంలో భాగమైన ఖమ్మం ప్రాంతాన్ని కాకతీయులు పాలిస్తున్న రోజుల్లో వెలమగట్ల అనే గ్రామంలో ముగ్గురు రైతులు పొలం పనులు చేస్తుండగా అపారమైన సంపద దొరుకుతుంది. ఈ సంపదే ఖమ్మం చరిత్రను తరతరాలకు చాటి చెప్పేలా దోహదపడింది. భూగర్భంలో సంపద దొరికిన సమాచారం తెలుసుకున్న కాకతీయ ప్రభువుకు.. భూమి హక్కుదారులైన రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, వెల్మారెడ్డి కి రాజా హోదా కట్టబెట్టి.. దొరికిన సంపదతో ఖమ్మం గుట్టపై కోట కట్టమని ఆదేశాలు జారీ చేస్తారు. దీంతో ముగ్గురూ కలిసి 950 ప్రాంతంలో మట్టి కోట కట్టడం ప్రారంభిస్తారు. కోటను మట్టితో కట్టినప్పటికీ యుద్ధానికి సిద్ధమైన వీరుడు వలె ఉండేదట. లక్ష్మారెడ్డి ఓ చెరువును తవ్వించగా అది కాలక్రమంలో లకారం చెరువుగా మారింది.

Also Read : కోర్టు వివాదాలు తీర్చే శ్రీలక్ష్మి నారసింహుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..?


300 ఏళ్లు పాటు రెడ్డిరాజుల పాలనలో..

గజపతులతో పాటు ఖమ్మానికి వచ్చిన అక్కిరెడ్డి, అస్కారెడ్డి లు తమ పూర్వీక వంశానికి చెందిన కోటకు మరిన్ని సొబగులు అద్దారు. మట్టి కోట ప్రాంతంలోనే నల్లరాతి బండలతో శత్రు దుర్భేద్యమైన దుర్గాన్ని నిర్మించారు. రాతి కోట నిర్మాణానికి 9 ఏళ్ల సమయం పట్టింది. కోట చుట్టుపక్కలా 60 ఫిరంగులు ఏర్పాటు చేశారు. అలాగే కోట నుంచి ఓరుగల్లు వరకు సొరంగ మార్గం కూడా నిర్మించారని కూడా చెబుతూ ఉంటారు. కోటకు పది ద్వారాలు ఉండగా ప్రధాన దర్వాజాను రాతి తో నిర్మిచారు. దీనిని రాతి దర్వాజా లేదా పోత దర్వాజా అంటారు. ఎత్తైన ప్రహరీ గోడలతో నాలుగు కిలోమీటర్ల పరిధిలో కోట నిర్మాణం ఉంటుంది. 300 ఏళ్ల పాటు రెడ్డిరాజుల పాలనలో ఉన్న ఈ కోటను తర్వాత వెలమరాజులు వశం చేసుకున్నారు. నందవాణి, కాళ్లూరు, గుడ్లూరు, వంశాల రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. కాకతీయుల సామ్రాజ్య పతనం తర్వాత కాపానాయుడు, పోలానాయుడు 1424లో ఖమ్మం ప్రాంతాన్ని పాలించారు.

Also Read : బ్రిటీష్ పెత్తందారీని ఎదిరించిన నూజివీడు సంస్థాన చరిత్ర తెలుసా..?


సీతాపతిరాజు పాలనలో..

షితాబ్ ఖాన్ బిరుదు గల సీతా పతిరాజు 15వ శతాబ్దంలో కోటకు అధిపతిగా ఉన్నారు. అప్పుడే ఖమ్మం ముఖ్యకేంద్రంగా అభివృద్ధి చెందినట్లు చరిత్ర చెబుతోంది. సుల్తాన్ కులీకుత్బుల్ ముల్క్ 1531లో షితాబ్ ఖాన్ ను ఓడించి కోటను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకృష్ణ దేవరాయులు తన దిగ్విజయ యాత్రలో భాగంగా ఖమ్మం కోటను వశం చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఇక 1722లో ఈ ప్రాంత సుబేదారు నిజాం ముల్కీ అసల్ జీ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. 1761నుంచి 1803 వరకు జాఫర్ దౌల్ అనే తహసీల్దార్ పర్యవేక్షణలో ఖిల్లా ఉండేది.


ఖమ్మం జిల్లాగా ఆవిర్భావం..

నిజాం పాలన 1948లో ముగిసిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఉండగానే 1953 అక్టోబర్ 1న ఖమ్మం మెట్టును జిల్లాగా ప్రకటించారు. మధిర, ఇల్లెందు, పాల్వంచ, బుర్గంపాడు తాలూకాలతో కలిసి ఖమ్మం మెట్టును జిల్లాగా ఏర్పాటు చేశారు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పుడు కూడా జిల్లా హోదాలోనే ఖమ్మం ఉంది. 1959 నాటికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం తాలుకాను ఖమ్మంజిల్లాలో విలీనం చేశారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తాలూకా వ్యవస్థను రద్దు చేసి 46 మండలాలుగా విభజించారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలనా పరమైన సౌలభ్యం కోసం ఖమ్మం జిల్లాను కూడా రెండు భాగాలుగా విభజించారు.

Also Read : తెలుగోడి రాజసం..మన కొండపల్లి కోట..