iDreamPost
iDreamPost
ఒక రుచికరమైన వంటకు ఆ ఊరు మారుపేరుగా నిలిచింది. నైపుణ్యంతో కూడిన పనితనంతో ఆ పిండివంటను ఆ గ్రామ మహిళలు ఏళ్ల తరబడి తయారు చేస్తున్నారు. ఆత్రేయపురం అని ఆ ఊరు పేరు చెప్పగానే పూతరేకు వెంటనే స్పురించే స్థాయిలో ఖ్యాతి గడించింది. తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామమైన ఆత్రేయపురం పూతరేకులకు పుట్టినిల్లు. తరతరాలుగా ఈ గ్రామ మహిళలు తమ నైపుణ్యంతో ఈ వంటకు మెరుగులద్దుతున్నారు.
వందేళ్లకు పైబడిన చరిత్ర..
సంప్రదాయకమైన ఈ ఆంధ్రా పిండి వంటకు వందేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. పూర్వం రాజ కుటుంబీకులు, సంపన్న వర్గాల వారు పెళ్లి విందులు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో పూతరేకులు వడ్డించేవారు. అప్పట్లో ఇది ఒక స్టేటస్ సింబల్. తరాలు మారినా ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. పెళ్లిళ్లు, ఇతర ఫంక‌్షన్ల సందర్భంగా ఇచ్చే విందుల్లో ఈ వంటకం తప్పనిసరిగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
మహిళల కళాత్మక తయారీకి ప్రతీక…
తరతరాలుగా మధురమైన రుచిని కాపాడుతూ ఆత్రేయపురం మహిళలు పూతరేకులను తయారు చేయడం విశేషం. వాటి తయారీ పట్ల చూపే శ్రద్ధ, నాణ్యత కోసం పడే తపనే ఆ రుచిని ఇన్నేళ్లూ కొనసాగించ గలిగాయి. పూతరేకులు తయారీని చూస్తే నిజంగా ఒక కళే అనిపిస్తుంది.
బియ్యం నానబెట్టి బాగా మెత్తగా రుబ్బుతారు. అలా రుబ్బిన పిండిని రెండు రోజులు పులియ బెడతారు. అందులో నీళ్లు పోసి బాగా పల్చగా తయారు చేస్తారు. కట్టెల పొయ్యిపై కుండను బోర్లించి కింద నిప్పు పెడతారు. సిద్దంగా ఉంచుకున్న వరి పిండి ద్రావకంలో ఓ గుడ్డను ముంచి ఒడుపుగా బయటకు తీసి దాన్ని వేడెక్కిన కుండపై వేసి వెంటనే తీసేస్తారు. దానితో కుండపై సన్నటి తెల్లటి రేకు ఏర్పడుతుంది. కుండ వేడిని నిలకడగా ఉంచడమనేది పూత రేకుల తయారీలో కీలకం.
Also Read : Artos Drink – బ్రిటిష్ సైనికులు పాపులర్ చేసిన ఈస్ట్ గోదావరి కూల్‌డ్రింక్ ఆర్టోస్
వరి పిండి ద్రావకంలో ముంచిన గుడ్డను వేడిగా ఉన్న కుండపై చకచకా వేసి గబగబా రేకులు తీసే మహిళల పనితనాన్ని కళ్లారా చూడాల్సిందే! అలా తీసిన రేకుల మధ్య నెయ్యి, పంచదార పొడి లేదా బెల్లం పొడి వేసి అందంగా మడత పెడతారు. ఇప్పుడు పూతరేకులు చాలా రకాల్లో లభ్యమవుతున్నాయి. సాదా పూతరేకు, బెల్లం లేదా పంచదార కలపి చేసే డ్రై ఫ్రూట్ పూతరేకులు అందరినీ అలరిస్తున్నాయి. నెయ్యితో కలసిన ఆ సన్నని పూతరేకులు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. పూత రేకును నోట్లో ఉంచి ముక్కకొరికినప్పటి నుంచి అది మనం నములదామునుకొనే సరికే కరిగిపోతుండడం గొప్ప అనుభూతిగా ఉంటుంది. ఈ అనుభూతి కోసమే ఒకప్పటి రాజుల కాలం నుంచి ఇప్పటి వరకూ పూతరేకులను జనం ఇష్టపడుతున్నారు.
దేశ విదేశాలకు ఎగుమతులు..
ఆత్రేయపురంలో తయారయ్యే పూతరేకులు దేశంలోని వివిధ రాష్ట్రాలకు, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇవి 12 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వాటి రకం, నాణ్యతను బట్టి ధర ఉంటుంది. పది పూతరేకులు ఉండే ఒక బాక్స్ ధర రూ.100 నుంచి రూ.650కు అమ్ముతున్నారు.
పలువురికి ఉపాధి..
ఆత్రేయపురం గ్రామంలో పూతరేకుల తయారీ ఒక కుటీర పరిశ్రమ. దాదాపు 400 కుటుంబాలు వీటి తయారీపై అధారపడి బతుకుతున్నాయి. ఇంట్లో వారందరూ తలో పని చేస్తారు. పూతరేకుల తయారీకి ముడిసరుకులు సమకూర్చడం నుంచి మార్కెటింగ్ వరకు బాధ్యతలు నిర్వహిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలిచే ఈ కుటీర పరిశ్రమ ఉపాధి కోసం వెదికే వారికి స్ఫూర్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు.
Also Read : Tapeswaram Kaja – తాపేశ్వరం కాజా చరిత్ర తెలుసా..?