iDreamPost
iDreamPost
ఈ నెల 12న విడుదల కాబోతున్న సూర్య ఆకాశం నీ హద్దురా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ వచ్చాక హైప్ రెట్టింపయ్యింది. ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాథ్ కథను బయోపిక్ గా దర్శకురాలు సుధా కొంగర రూపొందించారు. ప్రస్తుతం దీని ప్రమోషన్స్ లో సూర్య చాలా బిజీగా ఉన్నాడు. ఓటిటిలో రిలీజ్ చేయడం తప్ప మరో మార్గం లేదని ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్ కోసమే ఎదురు చూస్తే నష్టాల పాలు కాక తప్పదని ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. ఆకాశం నీ హద్దురాకు సంబంధించి సూర్యా చాలా కష్టపడి మేకోవర్ చేసుకున్నాడు.
యువకుడిగా కనిపించాల్సిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరింత ఫిట్ గా కనిపించడం కోసం దోసకాయలు, బ్లాక్ కాఫీ, గుడ్డు మీద ఉండే తెల్ల పదార్థం మాత్రమే డైట్ గా తీసుకున్నాడు సూర్య. నెల రోజులకు పైగా చాలా కఠినమైన ఈ ఆహారాన్ని తీసుకుంటే తప్ప సూర్యకు తాను కోరుకున్న లుక్ రాలేదు. అయితే ఈ విషయం తెలిశాక పలువురు అభిమానులు సూర్య తరహాలో తాము కూడా అదే డైట్ ని ఫాలో అవుతామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది సూర్యకు తెలియడంతో ఆన్ లైన్లో ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు.
పొరపాటున కూడా తాను చెప్పిన డైట్ ని తీసుకోవద్దని ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని హెచ్చరించాడు. స్ఫూర్తిగా తీసుకుని ట్రై చేయొద్దని హితవు పలికారు. ఇది ప్రమాదమని వృత్తిలో భాగంగా నిపుణుల పర్యవేక్షణలో ఇలాంటి డైట్ ని తీసుకోవడం జరుగుతుందని అంత మాత్రాన అనుసరిస్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఇలా క్లారిటీ ఇవ్వడమే మంచిది. లేకపోతే ఫ్యాన్స్ లేనిపోని ముప్పును కొనితెచ్చుకునే అవకాశంఉంది. ఆకాశం నీ హద్దురా తర్వాత సూర్య మణిరత్నం నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో నవరసలో ఒక ఎపిసోడ్ తో పాటు అసురన్ ఫేమ్ వెట్రిమారన్ తో ఒక సినిమా పాండి రాజ్ డైరెక్షన్ లో మరో మూవీ చేయబోతున్నాడు.