iDreamPost
iDreamPost
పదకొండేళ్ల క్రితం విడుదలైన అరుంధతి గురించి చెప్పాలంటే సంచలనం లాంటి చిన్న చిన్న పదాలు సరిపోవు. హీరో లేకుండా హీరోయిన్ పెర్ఫార్మన్స్ తో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద నడిచిన అరుదైన చిత్రాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. అనుష్కను ఒకేసారి వంద మెట్లు ఎక్కించిన మూవీగా సైతం ఇది తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. విడుదల వరకు ఎన్నో అడ్డంకులు ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుని ప్రతి సెంటర్లోనూ రికార్డులు కొల్లగొట్టడం ఇప్పటికీ బయ్యర్లు మర్చిపోలేరు. ముఖ్యంగా జేజెమ్మ అంటూ కోడి రామకృష్ణ ఫ్లాష్ బ్యాక్ లో చూపించిన అనుష్క విశ్వరూపం, పశుపతిగా సోనూ సూద్ భయంకరమైన విలనీ బ్లాక్ బస్టర్ కు కారణమయ్యాయి.
నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ధైర్యానికి మెచ్చుతునకగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా అరుంధతి హింది రీమేక్ కు ఇప్పుడు పనులు జరుగుతున్నాయట. అదేంటి ఇంత లేట్ అనుకోకండి. టైం ఇప్పుడు కలిసి వచ్చింది అంతే. అల్లు అరవింద్ హక్కులు కొని మరో రెండు ప్రొడక్షన్ హౌసెస్ తో కలిసి ఒరిజినల్ వెర్షన్ కన్నా భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ తో తీర్చిదిద్దేందుకు ప్లానింగ్ చేస్తున్నారట. హీరొయిన్ గా దీపికా పదుకునే పేరు గట్టిగా వినిపిస్తోంది. పద్మావత్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే తననే బెస్ట్ ఛాయస్ అంటారు. అయితే దర్శకత్వం ఎవరు వహిస్తారు అనేది మాత్రం సస్పెన్సే. కోడి రామకృష్ణ గారు కాలం చేశారు కాబట్టి నో ఛాన్స్. మనవాళ్ళలో ఇంత భారీ కాన్వాస్ ని టేకప్ చేయగలిగే వాళ్ళు ఎవరో చూడాలి.
ఈ మధ్య కాలంలో మన డైరెక్టర్లు బాలీవుడ్ రీమేకుల్లో గట్టి జెండానే పాతుతున్నారు. సందీప్ రెడ్డి వంగా, గౌతం తిన్ననూరి, శైలేష్ కొలను ఇలా అందరూ అక్కడి ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నారు. అయితే అరుంధతికి ఎవరు సెట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని వివిధ రూపాల్లో ఆన్ లైన్ లో నార్త్ ప్రేక్షకులు చూశారు కానీ డబ్బింగ్ వెర్షన్ అయితే వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి మంచి స్కోప్ అయితే ఉంది. దీపికా పదుకునే ఒప్పుకున్నా ఇన్నేళ్ల తర్వాత అలాంటి సబ్జెక్టుని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే విలన్ గా సోను సూద్ చేస్తనే ఇది పండుతుంది. ఎలాగూ గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన రోల్ కాబట్టి నో అనకపోవచ్చు. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత హిందీలో రీమేక్ అవుతున్న తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో ఇదే అని చెప్పొచ్చు.