గోవులను రక్షించాలని, గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని యుగ తులసీ ఫౌండేషన్ నిర్వాహకులు గో సడక్ బంద్‌కు పిలుపునివ్వడంతో ఫౌండేషన్ సభ్యులు, హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎల్బీనగర్ చౌరస్తాకు భారీగా చేరుకున్నారు. దీంతో ఎల్బీ నగర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
వేలమందితో ఎల్బీనగర్ చౌరస్తాను దిగ్బంధనం చేస్తామని యుగ తులసీ ఫౌండేషన్ హెచ్చరించడంతో పోలీసులు గోరక్షకులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఫౌండేషన్ సభ్యులు, హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలతో ఎల్బీ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సడక్ బంద్‌లో పాల్గొనడానికి రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాష్ట్రంలో జరుగుతున్న గోవధను అరికట్టాలని, గో మాతను రాష్ట్రీయ ప్రాణిగా ప్రకటించాలని ముఖ్యమంత్రి స్పందించే వరకు తమ ఉద్యమం ఆగదని ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. ఎమ్మెల్యేతో పాటుగా భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా గో సడక్ బంద్‌లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తుంది. బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన వారితో పాటు రోడ్డున వెళ్ళేవారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సామాన్య ప్రజలు పోలీసులతో వాగ్వావాదానికి దిగుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్‌పేటలో గోభక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు.