iDreamPost
android-app
ios-app

High court – అది ‘ఏపీ ప్రభుత్వ’ నిర్ణయం… హైకోర్టు కీలక తీర్పు!

High court – అది ‘ఏపీ ప్రభుత్వ’ నిర్ణయం… హైకోర్టు కీలక తీర్పు!

ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు కొద్ది రోజుల క్రితం జీవో 16 పేరిట ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నప్పటికీ కొత్తగా కర్నూలులో కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో ఎప్పటిలాగే ప్రతిపక్ష నేతల మద్దతుతో విజయవాడకు చెందిన మహ్మద్‌ ఫరూక్‌ షుబ్లీ అనే వ్యక్తి కోర్టుకు ఎక్కాడు. ఈ ఏర్పాటు సక్రమం కాదు అంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిల్ వేశారు. అయితే జీవో 16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఎలాంటి నిషేధం లేదని తేల్చి చెప్పింది. ఏ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ప్రభుత్వ పరిధిలో అంశమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని కూడా స్పష్టం చేసింది. అసలు విశాఖపట్నం, అనంతపురం నుంచి అమరావతిలో ఉన్న హైకోర్టుకు వస్తున్నారని, అలాంటప్పుడు వక్ఫ్ బోర్డుతో పని ఉన్నవారు కర్నూల్ కి వెళ్లడానికి ఇబ్బంది ఏమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అలాగే కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు దారి తీసిన కారణంతో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు అనుమతిచ్చింది. అంతే కాక తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సీఎం ఆదేశాల మేరకే కర్నూలులో ట్రిబ్యునల్‌ ఏర్పా టు జీవో వచ్చిందని, దీనిని విజయవాడలో ఏర్పాటు చేస్తూ 2016లోనే జీవో జారీ అయిందని పేర్కొన్నారు. ఇక ఈ అంశం మీద అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ స్పందిస్తూ, కర్నూలులో ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు స్పష్టమైన కారణాలున్నాయని, అత్యధిక ముస్లిం జనాభా కర్నూల్ లో ఉందని వెల్లడించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ వివరాలతో చిన్న అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. అయితే నిజానికి కార్యాలయాల తరలింపు విషయంలో హైకోర్టు స్టే ఉంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఈ స్టేను ఎత్తి వేయలేదు. అయితే వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను తరలించడం లేదు, 2016లో జీవో అయితే ఇచ్చారు కానీ దాన్ని ఏర్పాటు చేసే విషయం మీద బాబు సర్కార్ దృష్టి పెట్టలేదు. ఈ క్రమంలో ఏర్పాటు చేయడమే కర్నూల్ లో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పిటిషనర్ కు చుక్కెదురైంది.