iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో రాజధానుల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. విపక్షం మాత్రం ఊగిసలాటలో ఉంది. ఈలోగా అనేక అంచనాలు తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఏపీ హైకోర్టుని అలానే కొనసాగించి, పాలనా వ్యవహారాలు విశాఖకి, శాసనసభ, మండలిని కర్నూలుకి తరలించే యోచన చేయబోతున్నట్టు ఓ ప్రచారం సాగుతోంది. దాంతో పాటుగా వివిధ రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పక్కా వ్యూహాత్మకంగానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.
వాస్తవానికి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశంలో జగన్ కట్టుబడి ఉన్నట్టు తాజాగా అసెంబ్లీలో చేసిన ప్రకటన చాటుతోంది. శ్రీభాగ్ ఒప్పందాన్ని ఆయన ఉటంకించారు. అంటే రాజధాని కోస్తాలో ఉంటే హైకోర్టు రాయలసీమలో ఉండాలనే నిర్ణయానికి తాము అనుగుణంగా ఉన్నామని చెప్పకనే చెప్పేశారు. దాంతో కర్నూలు విషయంలో న్యాయ రాజధాని అనే పేరు ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే హైకోర్టు సహా వివిధ న్యాయ సంబంధిత విభాగాలు అక్కడికి తరలించే యోచనలో ఉన్నట్టు తేలుతోంది. ఇప్పటికే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వంటివి అక్కడే ఏర్పాటు చేశారు. త్వరలో మరిన్ని విభాగాలు తరలించే అవకాశం ఉంది.
ఇక కర్నూలు కి హైకోర్టు విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా అభ్యంతరం లేదు. పైగా ఆపార్టీ తీర్మానం కూడా చేసింది. రాయలసీమ డిక్లరేషన్ లో పేర్కొన్నట్టుగా కర్నూలులో హైకోర్టు స్థాపనను ఆపార్టీ అంగీకరించాల్సిన పరిస్థితి అనివార్యం. దాంతో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలు అనుకూలంగా ఉండడం విశేషం. వాస్తవానికి కర్నూలుకి హైకోర్టు తరలింపు వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. రాష్ట్రపతి గెజిట్ విడుదల చేస్తే హైకోర్టు తరలింపునకు మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఢిల్లీ, అమరావతి ఆలోచనలు ఒకే రకంగా ఉండడంతో కర్నూలుకి క్లారిటీ ఉన్నట్టేనని చెప్పవచ్చు.
ఇక అమరావతి కోసం ఎంతో ఆశతో ఉన్న టీడీపీ కూడా కర్నూలుని వ్యతిరేకించగలిగే అవకాశం లేదు. గతంలో చంద్రబాబు కర్నూలు విషయంలో అస్పష్టంగానే అనుకూలతను వెల్లడించాల్సి వచ్చింది. అంటే హైకోర్టు తరలింపు విషయంలో ప్రధాన ప్రతిపక్షం కూడా పట్టుబట్టగలిగే పరిస్థితి లేదు. అందుకు తోడుగా హైకోర్టు వస్తే ఏమొస్తుంది ..రెండు జిరాక్స్ సెంటర్లు మినహా అంటూ కామెంట్లు చేయడంతో కర్నూలులో హైకోర్టుని అడ్డుకోగల స్థితిలో ఆపార్టీ ఉండదనే చెప్పాలి. ఇక జనసేన కూడా అదే ధోరణి, దాదాపుగా టీడీపీ తీసుకున్న లైన్లోనే తన రాజకీయ వైఖరిని ప్రదర్శిస్తున్న పవన్ కళ్యాణ్ సైతం కర్నూలుని అంగీకరించే అవకాశాలున్నాయి. దాంతో కర్నూలు లో హైకోర్టు ఏర్పాటుని బహిరంగంగా వ్యతిరేకించే వారు అత్యల్పం. కాబట్టి రాయలసీమకు హైకోర్టు తరలింపు విషయంలో జగన్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చడానికి పెద్దగా సమయం పట్టదనే అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read : Somu Veerraju – వికేంద్రీకరణకు సొమ్ములెందుకు సోము?