iDreamPost
android-app
ios-app

హీరో లేటు అయినా సినిమా హిట్టు – Nostalgia

  • Published Jul 16, 2020 | 12:42 PM Updated Updated Jul 16, 2020 | 12:42 PM
హీరో లేటు అయినా సినిమా హిట్టు – Nostalgia

మామూలుగా స్టార్ హీరో సినిమాని అభిమానులు ఎందుకు చూస్తారు. తమ కథానాయకుడిని కళ్ళారా చూసుకుని ఆనందించాలని. అందుకే సినిమా టైటిల్ కార్డు పడటం ఆలస్యం ఎప్పుడెప్పుడు హీరో వస్తాడాని కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తారు. అది ఆలస్యం అయ్యే కొద్ది ఓపిక నశించడమే కాదు దర్శకుడి మీద కోపం కూడా వస్తుంది. సాధారణంగా స్టార్ల విషయంలో డైరెక్టర్లు వీలైనంత త్వరగా హీరోను తెరపైకి చూపే ప్రయత్నం చేస్తారు. హిందీ వరకు తీసుకుంటే సుభాష్ ఘాయ్ తన సినిమాను ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో స్టార్ట్ చేసి కథానాయకుడి చిన్నతనంలో ఏం జరిగిందని చెప్పడానికి కనీసం అరగంట టైం తీసుకునేవారు. అంటే హీరో కోసమే సినిమా అయితే మాత్రం లేట్ గా వెళ్ళినా పర్లేదు. ఖల్ నాయక్, సౌదాగర్, కర్జ్, హీరో, కర్మ లాంటి చిత్రాల్లో ఇది గమనించవచ్చు. మన్ మోహన్ దేశాయ్ కూడా ఇదే తరహ విధానాన్నే ఫాలో అయ్యేవారు. కాని టాలీవుడ్ మూవీస్ లో అలా జరగటం చాలా అరుదు. అయినా కూడా అలా తీసి మరీ సూపర్ హిట్ కొట్టిన కొన్ని సినిమాల ముచ్చట్లు

మంత్రి గారి వియ్యంకుడు(1983)

బాపు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన ఖైది సినిమా తర్వాత రిలీజ్ అయ్యింది. ఇందులో చిరు పాత్ర సినిమా మొదలైన అరగంట తర్వాత కాని ప్రవేశించదు. అంత వరకు టైటిల్ పాత్రధారి అల్లు రామలింగయ్య పరిచయం, శుభలేఖ సుధాకర్, పిఎల్ నారాయణ, నిర్మలమ్మ, రాళ్ళపల్లి, తులసి వీళ్ళ మధ్యే కథ నడిపిస్తారు బాపు. ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా రూపొందిన ఈ సినిమా మంచి ఎంటర్టైనర్. డబ్బు ఆశతో తన కొడుకు ప్రేమను కాలరాయాలి అనుకున్న కొబ్బరికాయల వ్యాపారికి అతని అల్లుడు నేర్పించిన గుణపాఠమే ఈ మంత్రి గారి వియ్యంకుడు. ఇందులోనే చిరంజీవి తండ్రి వెంకట్రావు ఓ చిన్న సన్నివేశంలో అల్లు వియ్యంకుడిగా కొద్ది నిముషాలు కనిపిస్తారు

ఆర్తనాదం(1988)

ముత్యమంత ముద్దు, చిన్నారి స్నేహం లాంటి సినిమాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీత ప్రధాన పాత్రలో ‘కళ్ళు’ రూపంలో డెబ్యూతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కెమెరామెన్ రఘు దర్శకత్వంలో తీసిన థ్రిల్లర్ మూవీ ఇది. ఒక సినిమా యూనిట్ షూటింగ్ కోసం అడవిలోకి వెళ్తే ఒక్కొక్కరుగా హత్య చేయబడతారు. అది ఎవరు చేసారని కనిపెట్టడమే కథ. హీరోగా చంద్రమోహన్ కనిపిస్తాడు కాని అసలు కథానాయకుడు రాజశేఖర్ ఇంటర్వెల్ కు ఒక్క నిమిషం ముందు వస్తాడు. చివరిలో మర్డర్ లు చేసిన అసలు విలన్ చంద్రమోహనే అని తేలడం ప్రేక్షకులు ఊహించని పెద్ద ట్విస్ట్. కథనం బాగున్నా ఆర్తనాదం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

మగాడు(1989)

ఇంటర్వెల్ లో హీరో ఎంటరైన అరుదైన సినిమాల్లో దీనిదే ఫస్ట్ ప్లేస్. కేవలం రెండే పాటలతో సినిమా మొత్తం మినిస్టర్ కిడ్నాప్ డ్రామాతో నడిచే మగాడుకి దర్శకుడు మధు. రాజశేఖర్ దీని షూటింగ్ లోనే మేడపై నుంచి దూకుతూ తీవ్ర గాయాల పాలయ్యారు. సినిమా జరిగిన గంటా ఐదు నిమిషాలకు హీరో వస్తాడు. రాజ్ కోటి ఇచ్చిన బిజీఎం మగాడుకి ప్రధాన ఆకర్షణ. ఫస్ట్ హాఫ్ మొత్తం మినిస్టర్ తన వాళ్ళతో బస్సు లో ట్రిప్ కి బయలుదేరటం, విలన్ గ్యాంగ్ హై జాక్ చేసి అడవిలో దాచిపెట్టడం తదితర పరిణామాలు జరుగుతాయి. రెండో సగంలో హీరో ఒంటరిగా వెళ్లి విడిపించడం కాన్సెప్ట్ మీద మంచి థ్రిల్లింగ్ గా సాగుతుంది. మగాడు అంతకు ముందు ఏడాది మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ మూన్నం మురాకు రీమేక్.

క్షణ క్షణం(1991)

శివ లాంటి మాస్టర్ క్లాసిక్ తర్వాత వర్మ తీసిన సినిమా ఇది. కోటి రూపాయల బ్యాంకు రాబరీకి హీరో హీరొయిన్ లను ముడిపెట్టి తీసిన ఈ చేజింగ్ డ్రామా వెంకటేష్ కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మొదటి అరగంట బ్యాంకుని ఎలా దోచుకున్నారు, ఆ డబ్బుని ఎవరు తీసుకెళ్ళారు, విలన్ ఎలాంటి వాడు వీటితోనే వర్మ టైం తినేస్తాడు. ఆ తర్వాత ముప్పై రెండో నిమిషానికి కాని హీరో వెంకటేష్ రాడు. కీరవాణి కొత్త తరహ సంగీతాన్ని ఇచ్చి అప్పట్లో మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్ ఇచ్చాడు. జామురాతిరి జాబిలమ్మ ఎవర్ గ్రీన్ మెలోడీ. కెమెరామెన్ ఎస్.గోపాల్ రెడ్డి నిర్మాతగా చేసిన మొదటి సినిమా ఇదే. శ్రీదేవి పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

కెప్టెన్ ప్రభాకర్(1992)

మాజీ హీరోయిన్ ఇప్పటి ప్రజా ప్రతినిథి రోజా భర్త ఆర్ కె సెల్వమణి ని స్టార్ డైరెక్టర్ ని చేసిన మూవీ ఇది. మన్సూర్ అలీ ఖాన్ విలన్ గా ఈ సినిమాతోనే పరిచయమై ఒక్క దెబ్బకు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇందులో హీరో విజయ్ కాంత్ సినిమా మొదలైన 35 నిమిషాలకు వస్తాడు. సినిమా టేకాఫ్ అంతా శరత్ కుమార్ ఫారెస్ట్ ఆఫీసర్ గా అడవికి వెళ్ళడం, అక్కడ వీరప్పన్ తరహ విలన్ తో ఫైట్ చేయటం, వాడు చేసే అరచకాలు ఇవన్ని ఉంటాయి. ఇది తమిళ్ లో వచ్చిన బెస్ట్ యాక్షన్ మూవీస్ లో ఒకటని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ సైతం భారీ విజయాన్ని అందుకుంది. రమ్య కృష్ణ సైడ్ హీరొయిన్ గా నటించింది. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అత్యద్బుతంగా ఉంటుంది కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయి.

ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి కాని పైన చెప్పిన సినిమాలు మంచి ఆదరణ పొందటమే కాక హీరో ఎంత పెద్ద స్టార్ అయినా కథలో దమ్ముండి చూసే ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే సత్తా ఉండి నడిపిస్తే హీరో ఎప్పుడు వస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూడరని నిరూపించిన కమర్షియల్ హిట్ చిత్రాలు