ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వివరాల్లోకి వెళితే వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలలో వర్షాలు కురుస్తాయని విశాఖ కేంద్రం వెల్లడించింది. రెండురోజులపాటు కోస్తా మరియు రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని,ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని,ఎల్లుండి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉత్తర ఒడిశా మరియు పశ్చిమబెంగాల్ తీరం వద్ద బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, అల్పపీడనంతో పాటు 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలవైపు అల్పపీడనం కదులుతుందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది.