iDreamPost
android-app
ios-app

మండల, జిల్లా పరిషత్ నేత‌ల ఎదురుచూపులు

మండల, జిల్లా పరిషత్ నేత‌ల ఎదురుచూపులు

ఎన్నిక‌లు పూర్త‌యి దాదాపు మూడు నెల‌లు కావ‌స్తున్నా, ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌పై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నికలను రద్దు చేయాలన్న సింగిల్‌ జడ్జి బెంచ్‌ తీర్పుపై స్టే ఇచ్చింది డివిజన్‌ బెంచ్‌. అయితే,జిల్లా , మండల పరిషత్ నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్‌ జరపాలా? లేదా? అన్న దానిపై మాత్రం ధర్మాసనం ఇంకా ఎలాంటి తీర్పు చెప్పలేదు. వచ్చే నెల 27న సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. దీంతో అప్పటి వరకు పరిషత్‌ ఎన్నికలపై సస్పెన్స్‌ తప్పదు. ఇదిలా ఉండ‌గా, ఆంధ్రప్రదేశ్‌లోని మండల పరిషత్‌, జిల్లా పరిషతుల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం… గతంలో ప్రకటించిన ప్రత్యేక అధికారుల పాలన ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో.. మరో ఆరు నెలల ప్రత్యేక పాలన కొనసాగుతుందంటూ వెల్లడించింది ఏపీ సర్కార్.

ఏప్రిల్ లో మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎల‌క్షన్ కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్ట్‌ ఆదేశాలకు విరుద్ధంగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. ఏప్రిల్ 8న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్ దాఖలు చేసింది. దాదాపు 2 వేల‌కుపైగా స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారికంగా పోటీ చేయ‌క‌పోయినా, కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్య‌ర్థులు స్వ‌తంత్రంగా పోటీకి దిగారు. బీజేపీ, జ‌న‌సేన కూడా కొన్ని చోట్ల పోటీ చేశాయి. ఈ నేప‌థ్యంలో ఏక‌గ్రీవం అయిన‌, పోటీ చేసిన అభ్య‌ర్థులు ఫ‌లితం కోసం నెల‌ల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఏపీలో పరిషత్‌ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆ ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో స్థానిక సంస్థల పాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. ఇక, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే కొనసాగుతూ వచ్చింది. కొంత కాలం ఎన్నికల నిర్వహణ విషయంలో.. ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం మధ్య వివాదం నడవగా.. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించినా.. కౌంటింగ్‌పై కోర్టులో విచారణ సాగుతోంది. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని మండల పరిషత్‌, జిల్లా పరిషతుల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఏపీ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 5 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుందని తెలిపారు.