iDreamPost
android-app
ios-app

హథ్రాస్‌ బాధిత కుటుంబాన్ని కాపాడేందుకు రంగంలో దిగిన పోలీసులు..

హథ్రాస్‌ బాధిత కుటుంబాన్ని కాపాడేందుకు రంగంలో దిగిన పోలీసులు..

ఈమధ్య కాలంలో దేశాన్ని కుదిపేసిన ఘటనగా హథ్రాస్‌ హత్యాచార ఘటనను చెప్పుకోవచ్చు. దళిత యువతిని సామూహికంగా అత్యాచారం చేయడం అనంతరం ఆ యువతి కుటుంబం పట్ల పోలీసులతో పాటు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పోలీసులు అర్ధరాత్రి బాధితురాలి కుటుంబాన్ని బంధించి మరీ ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.

ఆమె కుటుంబం పట్ల అమానవీయంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై యోగి సర్కారు సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. కానీ బాధిత కుటుంబాన్ని పలువురు బెదిరింపులకు గురిచేయడం పట్ల యోగి సర్కారు దృష్టి పెట్టింది. దీంతో వారి కుటుంబానికి రక్షణ కల్పించేందుకు పతిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆమె ఇంటి వద్ద 60 మంది పోలీసులను మోహరించడంతో పాటు, 8 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసారు పోలీసులు. ఆ గ్రామంలో బాధిత కుటుంబం ఇంటి వద్ద జరిగే అన్ని విషయాలను సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

బాధిత కుటుంబానికి భద్రత కల్పించే విషయంలో నోడల్‌ ఆఫీసర్‌గా డీఐజీ శలభ్‌ మాథూర్‌ వ్యవహరిస్తుండటం గమనార్హం. అవసరం అనుకుంటే హథ్రాస్‌ గ్రామంలో కంట్రోల్‌ రూమ్‌ నెలకొల్పుతామని ఆయన వెల్లడించారు. 60 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతను బాధిత కుటుంబానికి అందిస్తున్నామని, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న వారి అన్ని వివరాలను నమోదు చేస్తున్నామని స్థానిక ఎస్పీ వినీత్‌ జైస్వాల్‌ తెలిపారు. మొదట్లోనే బాధిత కుటుంబానికి రక్షణ కల్పించేలా పోలీసులు చర్యలు తీసుకుంటే పోలీసుల తీరుపై విమర్శలు వచ్చేవి కాదని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం..