iDreamPost
android-app
ios-app

TRS plenary Harish Rao Kavitha -టీఆరెస్ ప్లీనరీ.. ఆ ఇద్దరూ కనిపించలేదే!

  • Published Oct 26, 2021 | 9:59 AM Updated Updated Mar 11, 2022 | 10:37 PM
TRS plenary Harish Rao Kavitha -టీఆరెస్ ప్లీనరీ.. ఆ ఇద్దరూ కనిపించలేదే!

ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టి.. అధికార పార్టీ స్థాయికి ఎదిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గులాబీ దళం ఉత్సాహంతో ఉరకలేసింది. నాయకులు రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, ఉద్యమకాల అనుభవాలను తమ ప్రసంగాల్లో నెమరువేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి పార్టీ సారధిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంత అంగరంగ వైభవంగా జరిగిన ప్లీనరీ సంబరాల్లో ఇద్దరు కీలక వ్యక్తులు కనిపించకపోవడం వెలితిగా కనిపించింది. వారిలో ఒకరు మంత్రి హరీష్ రావు కాగా మరొకరు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వీరిద్దరి గైర్హాజరుకు పార్టీ వర్గాలు రకరకాల కారణాలు చెబుతున్నా.. అతి ముఖ్యమైన ప్లీనరీకి అందునా 20 ఏళ్ల సంబరాలకు వారు రాకపోవడం మాత్రం పార్టీ కార్యకర్తల్లో పలు అనుమానాలకు, చర్చలకు తావిచ్చింది.

అంతా కేసీఆర్, కేటీఆరే..

ఆడంబరంగా జరిగిన పార్టీ ఉత్సవాలు మొత్తం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మయంగా కనిపించాయి. ప్లీనరీ ప్రాంగణంతో పాటు హైదరాబాద్ నగర కూడళ్లలో గులాబీ జెండాలతోపాటు కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు కనిపించాయి. పార్టీలో మొదటి నుంచీ కొనసాగుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన హరీష్ రావుతో పాటు తెలంగాణ జాగృతి పేరుతో మహిళాలోకాన్ని చైతన్య పరిచిన కవితల ఫోటోలు గానీ, వారి ప్రస్తావన గానీ ఎక్కడా లేకపోవడం విశేషం. హరీష్ రావుకు అసలు ఆహ్వానమే పంపలేదని అంటుండగా.. ఆహ్వానం అందినప్పటికీ కవిత హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Also Read : KCR ,AP Power -ఏపీలో కరెంటు లేదా, కేసీఆర్ మాటల వెనుక మర్మమదే..

కారణాలు ఆవేనా?

ప్రస్తుతం జరుగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నిక కు పార్టీ ఇంఛార్జిగా మంత్రి హరీష్ కు బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అందువల్ల ఆయన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టంలేక ఆహ్వానం పంపలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎంత బిజీలో ఉన్నా ముఖ్యమైన ప్లీనరీకి ఉద్యమకారుడు, పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడికి ఆహ్వానం పంపకపోవడం ఏమిటన్న చర్చ జరుగుతోంది. వచ్చినా రాకపోయినా ఆహ్వానం పంపడం సంప్రదాయమని దాన్ని విస్మరించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇక మరో ముఖ్య నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఆహ్వానం అందినా, హైదరాబాద్లోనే ఉన్నా హాజరుకాకపోవడం విశేషం. దుబాయ్ లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించి తిరిగివచ్చిన కవిత జ్వరంతో బాధపడుతున్నందునే సమావేశాలకు వెళ్లలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే అన్న కేటీఆర్ తో ఉన్న స్పర్థలే ఆమె గైర్హాజరుకు కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ నిర్వహించే పార్టీ సమావేశాల్లో కూడా కొన్నాళ్లుగా ఆమె పాల్గొనడం లేదంటున్నారు. హుజురాబాదులో ప్రచారానికి వెళ్లిన కవిత ప్లీనరీకి రాకపోవడానికి కారణం అదేనని మరికొందరు అంటున్నారు. మొత్తానికి మంచి జోష్ తో సాగిన టీఆరెస్ ప్లీనరీలో ఇదొక్కటే లోటుగా కనిపించింది.

Also Read : TRS Plenary -గులాబీ గుభాళింపులు.. శ్రేణుల సంబ‌రాలు..