iDreamPost
android-app
ios-app

Harbhajan Singh, Retirement – క్రికెట్‌కు హర్భజన్‌ సింగ్‌ వీడ్కోలు

  • Published Dec 24, 2021 | 4:10 PM Updated Updated Mar 11, 2022 | 10:30 PM
Harbhajan Singh, Retirement – క్రికెట్‌కు హర్భజన్‌ సింగ్‌ వీడ్కోలు

భారతదేశ మేటి స్పిన్‌ బౌలర్లలో ఒకనిగా గుర్తింపు తెచ్చుకున్న హర్భజన్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గడిచిన ఐదేళ్లుగా క్రికెట్‌కు దూరమైన హర్భజన్‌ శుక్రవారం అధికారికంగా తన రిటైర్మెట్‌ నిర్ణయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. ఆయన ఇప్పటి వరకు 103 టెస్టులు, 236 వన్డేలు, 28 T20లు ఆడాడు. ‘‘ఈ రోజు నేను నా జీవితంలో అన్నింటినీ అందించిన ఆటకు వీడ్కోలు పలుకుతున్నాను’’ అని ప్రకటించాడు. పంజాబ్‌లోని జలందర్‌కు చెందిన హర్భజన్‌ను అందరూ బజ్జి అని ముద్దుగా పిలుస్తారు. తొలి టెస్టు 1998 మార్చి నెలలో ఆస్ట్రేలియా జట్టు మీద అరంగ్రేటం చేశాడు. అదే ఏడాది వన్డే జట్టుకు కూడా ఎంపికయ్యాడు. అత్యుత్తమమైన ప్రదర్శనలతో భారతీయ స్పిన్నర్లలో తనకంటూ స్థానం సంపాదించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదవ భారతీయ బౌలర్‌గా నిలిచాడు. 41 ఏళ్ల హర్భజన్‌ కుంబ్లే తరువాత కీలక స్పిన్నర్‌గా ఎదిగారు. అయితే 2015 నుంచి టెస్టు ఫార్మాట్ కు, అదే ఏడాది నుంచి వన్డే ఫార్మాట్ కు దూరమాయ్యాడు. జాతీయ జట్టులో అతనికి అవకాశం రాలేదు. ఇక T20కి 2016 నుంచి దూరమయ్యాడు. జాతీయ జట్టుకు చేసిన యత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు. 

హర్భజన్ సింగ్‌ మొత్తం 103 టెస్టులు ఆడి 2 వేల 225 పరుగులు సాధించాడు. వ్యక్తిగత అత్యధిక స్కోరు 115 పరుగులు. రెండు సెంచరీలు, తొమ్మిది ఫిఫ్టీలు సాధించాడు. బౌలింగ్‌కు వచ్చి మొత్తం 417 వికెట్లు సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో 84 పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శన. ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు 25 సార్లు, పది వికెట్లు ఐదుసార్లు తీశాడు.

236 వన్డే మ్యాచ్‌లు ఆడగా 1237 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్‌ 49 పరుగులు. 269 వికెట్లు సాధించాడు. 31 పరుగులకు ఐదు వికెట్లు అతని అత్యుత్తమ వన్డే ప్రదర్శన. ఐదు వికెట్ల చొప్పున మూడుసార్లు తీశాడు.

 T20లో మొత్తం 28 మ్యాచ్‌లు ఆడగా, 108 పరుగులు చేశాడు. 21 అత్యధిక పరుగులు. 25 వికెట్లు సాధించాడు. 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శన.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ల్లో మొత్తం 163 మ్యాచ్‌లు ఆడగా, 833 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్‌ 64 పరుగులు. ఒక ఫిఫ్టీ చేశాడు. మొత్తం 150 వికెట్లు సాధించాడు. 18 పరుగులకు నాలుగు వికెట్లు అత్యుత్తమ ప్రదర్శన. ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు ఒకసారి సాధించాడు.

వివాదాలు ఎక్కువే

హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియా క్రీడాకారుడు మీద జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. సహచర క్రీడాకారుడు శ్రీశాంత్‌ చెంప పగలగొట్టి వార్తల్లో నిలిచాడు.

Also Read : నేడు చూడండి 83