విదేశాల్లో తమ విలువైన ఆస్తిని తాము అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు జంతువులకు రాయడం సాధారణ విషయమే కానీ మన దేశంలో మాత్రం చాలా అలాంటి సంఘటనలు జరగడం అరుదనే చెప్పుకోవచ్చు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకి సగం ఆస్తి రాసి తన కుమారుడికి మాత్రం షాకిచ్చాడు.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా బరిబాడ గ్రామానికి చెందిన ఓం నారాయణకు జాకీ అనే శునకం ఉంది.. ఆ శునకం అంటే ఓం నారాయణకు వల్లమాలిన ప్రేమ.. అదీకాక తన కుమారుడి వ్యవహారం ఓం నారాయణకు నచ్చేది కాదు. కుమారుడి ప్రవర్తనకు విసుగు చెందిన ఓ నారాయణ తన ఆస్తిలో సగభాగాన్ని తన పెంపుడు శునకం జాకీకు రాసి కుమారుడికి షాకిచ్చాడనే చెప్పాలి. అక్కడితో ఆగకుండా మిగతా సగం ఆస్తి తన రెండో భార్య పేరిట రాసాడు.తన రెండో భార్య చంపా వర్మతో పాటు జాకీ తనను చాలా బాగా చూసుకుంటున్నారని అందుకే తన తదనంతరం ఆస్తి వారిద్దరికే చెందాలని ఓం నారాయణ వీలునామా రాసాడు.. తన పెంపుడు కుక్క జాకిని బాగా చూసుకున్న వారికి జాకీ పేరున ఉన్న ఆస్తి దక్కుతుందని వీలునామాలో పేర్కొన్నాడు.
విదేశాల్లో ప్రేమగా పెంచుకునే పిల్లులు,కుక్కల పేరిట తమ యావదాస్తిని రాసిన ఉదంతాలు అనేకం కానీ ఇండియాలో మాత్రం వెలుగులోకి వచ్చిన విషయం ఇదే కావొచ్చు. మరి సగం ఆస్తి కోసం ఓం నారాయణ కుమారుడు జాకీని బాగా చూసుకుంటాడేమో చూడాలి.