హాజీపూర్ గ్రామంలో జరిగిన వరుసహత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పదో తరగతి విద్యార్థిని శ్రావణి, డిగ్రీ విద్యార్థిని మనీషా, ఆరో తరగతి విద్యార్థిని కల్పన అనే బాలికలను శ్రీనివాసరెడ్డి అనే నిందితుడు అత్యాచారం చేసి హత్య చేసాడని పోలీసుల విచారణలో తేలింది.
అయితే తాజాగా హాజీపూర్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసులో వాదనలు ముగిసాయి. ఈ నెల 27 న తీర్పును వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది.
మొదట ఒక బాలిక అదృశ్యం కేసులో విచారణ జరిపిన పోలీసులకు విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాసరెడ్డి గతంలో కూడా అనేకమందిని హత్య చేసి బావిలో పాతిపెట్టాడని విచారణలో తెలిసింది. అంతేకాకుండా కర్నూల్ లో జరిగిన ఒక మహిళ హత్యకేసులో కూడా శ్రీనివాసరెడ్డి హస్తం ఉందని పోలీసులు వెల్లడించారు.
కాగా పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టారంటూ శ్రీనివాసరెడ్డి కోర్టులో తెలిపాడు. అనేక వాయిదాల అనంతరం హాజీపూర్ వరుస హత్యల కేసులో తుదితీర్పును ఈ నెల 27 కు రిజర్వ్ చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. విద్యార్థులను దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన శ్రీనివాసరెడ్డికి ఉరి శిక్ష విధించాలని పలువురు కోరుతున్నారు.