హీరో ఆర్మీలో పనిచేస్తే మన కథలు రెండు రకాలుగా ఉంటాయి. సైన్యంలో హీరోయిజంతో శత్రువులతో యుద్ధం చేసి జయించడం, ఆర్మీ నుంచి సెలవు మీద, లేదా రిటైరై వచ్చిన తర్వాత బయటి సమాజంలోని అన్యాయాలపై పోరాడడం. బొబ్బిలిపులి నుంచి నా పేరు సూర్య వరకూ అన్నీ ఇదే జానరే!
అయితే గన్ పట్టుకోకుండా యుద్ధంలో పాల్గొనడం సాధ్యమా? హ్యాక్‌సారిడ్జ్ సినిమా కథ ఇదే. ప్రముఖ నటుడు , మెల్‌గిబ్సన్ డైరెక్ట్ చేశాడు. ఇది కల్పిత కథ కాదు. డెస్మండ్‌దాస్ అనే సైనికుడి నిజ జీవితం.
వర్జీనియాలో 1919లో పుట్టాడు. చిన్నప్పటి నుంచి దేవుడిపై విశ్వాసం. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండగా సైన్యంలో చేరాడు. ఫిజికల్ ట్రైనింగ్ వరకూ OK. రైపిల్ షూటింగ్‌కి రానన్నాడు. తుపాకి పట్టుకోవడం, మనిషిని చంపడం తన విశ్వాసాలకి వ్యతిరేకమన్నాడు. అధికారులు షాక్ తిని , ఇంటికి వెళ్లిపోమని చెప్పారు. వెళ్లను అన్నాడు.
గాయపడిన వాళ్లకి వైద్యం అందించడానికి సైన్యంలో చేరానని చెప్పాడు. తుపాకీ పట్టని వాడు పిరికివాడని, అతని వల్ల మిగతా వాళ్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని అన్నారు. వినలేదు. కోర్టు మార్షల్ చేసి జైల్లో వేశారు.
డెస్మండ్ తండ్రి కూడా సైనికుడే. అతను తన కొడుకు తరపున విజ్ఞప్తి చేస్తే దీన్ని ప్రత్యేకమైన కేసుగా పరిగణసిస్తూ అంవగీకరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓకినోవా దగ్గరున్న హ్యాక్‌సారిడ్జ్ (కొండ పేరు)లో భీకరమైన యుద్ధం జరిగింది. వేల మంది అమెరికా సైనికులు చనిపోయారు. కొండ మీద గాయాలతో పడి ఉన్న 75 మంది సైనికులకి వైద్య సాయం చేసి డెస్మండ్ రక్షించాడు. గాయాలు తగిలినా లెక్క చేయలేదు. తుపాకీ ముట్టలేదు.
ఆ తర్వాత ఆయన్ని ఎన్నో అవార్డులతో గౌరవించారు. అయితే యుద్ధగాయాలు జీవితమంతా బాధించాయి. చేతులు సరిగా పనిచేయలేదు. చెవుడు వచ్చింది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. 2006లో చనిపోయాడు.
ఆయన మీద పుస్తకాలు రాశారు. డాక్యుమెంటరీలు తీశారు. టీవీ సీరీస్ వచ్చాయి. 2016లో సినిమా వచ్చింది. 40 మిలియన్ల డాలర్లతో తీస్తే 180 మిలియన్ డాలర్ల కలెక్షన్ వచ్చింది. మొత్తం 30 అవార్డులొచ్చాయి. అందులో రెండు ఆస్కార్.