iDreamPost
android-app
ios-app

బిగ్‌‌ బాస్కెట్‌కు షాక్ – డార్క్ వెబ్‌లో అమ్మకానికి యూజర్ల డేటా..

బిగ్‌‌ బాస్కెట్‌కు షాక్ – డార్క్ వెబ్‌లో అమ్మకానికి యూజర్ల డేటా..

ఆన్‌లైన్‌ గ్రాసరీ ఈ–కామర్స్ కంపెనీ బిగ్‌‌ బాస్కెట్‌కు హ్యాకర్ల ద్వారా భారీ షాక్ తగిలింది. దాదాపు 2 కోట్ల మంది బిగ్ బాస్కెట్‌ కస్టమర్ల వ్యక్తిగత డేటాను డార్క్ వెబ్‌లో హ్యాకర్లు అమ్మకానికి పెట్టడం సంచలనం కలిగిస్తుంది. తమ కంపెనీపై హ్యాకర్లు దాడి చేశారన్న విషయాన్ని బిగ్ బాస్కెట్ సైతం ధృవీకరించింది.ఈ సంఘటనపై బెంగళూరు సైబర్‌‌‌‌క్రైమ్‌‌ సెల్‌‌కు బిగ్‌‌బాస్కెట్‌ ఫిర్యాదు చేసింది.

లీడింగ్ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ సైబల్‌‌(Cyble)డార్క్ వెబ్ మానిటరింగ్‌ చేస్తుండగా బిగ్‌‌బాస్కెట్‌కు చెందిన డేటా అమ్మకానికి ఉండడాన్ని గమనించినట్లు తన బ్లాగులో పేర్కొంది. డార్క్ వెబ్‌‌లో అమ్మకానికి ఉంచిన బిగ్ బాస్కెట్ యూజర్ల డేటాలో కస్టమర్ల పూర్తి పేరు, అకౌంట్ వివరాలు, ఈమెయిల్-ఐడీలు, పాస్‌వర్డ్స్, ఫోన్ నెంబర్లు, అడ్రస్‌, పుట్టిన తేది, లొకేషన్‌, లాగిన్‌ అయిన ఐపీఅడ్రస్‌ వంటి వివరాలు ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు 15 జీబి పరిమాణంలో ఉన్న ఈ బిగ్ బాస్కెట్ డేటాను ఒక హ్యాకర్ 30 లక్షలకు బేరం పెట్టాడు.

కాగా ఈ ఘటనపై బిగ్ బాస్కెట్ స్పందిస్తూ తమ కస్టమర్ల ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేఫ్‌గానే ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ దాడిని అంచనావేస్తున్నామని, తమ కంపెనీ ఎప్పుడూ క్రెడిట్‌ కార్డ్‌‌నెంబర్లు వంటి యూజర్ల ఫైనాన్షియల్‌‌డేటాను స్టోర్ చేయమని వెల్లడించింది. ఈ డేటా లీక్ అంశంపై సైబర్‌‌‌‌క్రైమ్‌‌ సెల్‌‌కు ఫిర్యాదు చేశామని త్వరలోనే అంతా రీస్టోర్ చేస్తామని సంస్థ పేర్కొంది. ఈ దాడిపై సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌‌పర్టులు చెబుతున్న విషయాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.