iDreamPost
android-app
ios-app

గువ్వ గోరింక సినిమా రిపోర్ట్

  • Published Dec 17, 2020 | 9:45 AM Updated Updated Dec 17, 2020 | 9:45 AM
గువ్వ గోరింక సినిమా రిపోర్ట్

ఈ టైటిల్ వినగానే ఎవరికైనా గుర్తొచ్చేది అందమైన పక్షుల జంట. సినిమా ప్రేమికులకైతే ఖైదీ నెంబర్ 786లో సూపర్ హిట్ సాంగ్ తలంపుకొస్తుంది. అందుకే ఈ మూవీ ప్రమోషన్ మొదలైనప్పుడు ఇదేదో ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీ తరహాలో ఉంటుందని ఆశించారు ప్రేక్షకులు. ఇవాళే అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ఓటిటి రిలీజ్ అయ్యింది. అయితే ఇది 2017లో సత్యదేవ్ హీరోగా తొలి అడుగులు వేస్తున్న టైంలో తీసింది. రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చి థియేటర్లలో మోక్షం దక్కక ఆఖరికి ఇలా డిజిటల్ దారి పట్టింది. ఓటిటి స్టార్ గా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ కి గువ్వ గోరింక మిగిల్చే అనుభవం ఏంటి మినీ రిపోర్ట్ లో చూద్దాం.

అసలు శబ్దమంటేనే గిట్టని ఓ యువకుడు సౌండ్ రాని ఒక ఇంజిన్ తయారు చేసేందుకు పూనుకుంటాడు. పక్క ఫ్లాట్ లో ఉండే అమ్మాయికి సంగీతమంటే ప్రాణం, పిచ్చి. యథావిధిగా గొడవలతో మొదలైన వీళ్ళ పరిచయం ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించుకునే దాకా వెళ్తుంది. అచ్చం అల్లరి ప్రియుడులో రాజశేఖర్ రమ్యకృష్ణ టైపులో అన్న మాట. పరస్పర విరుద్ధ ఇష్టాలు కలిగిన ఈ ఇద్దరు మరి గువ్వ గోరింకలుగా ఎలా మారారు. వీళ్ళ లవ్ స్టోరీ ఏ తీరానికి చేరుకుందనేదే అసలు కథ. పక్క పక్క ఫ్లాట్లలో ఉండే హీరో హీరోయిన్లు కలుసుకోకుండా ప్రేమించడం ఒక్కటే ఇందులో డిఫరెంట్ గా అనిపించే పాయింట్.

వినడానికి బాగానే ఉన్నా తెరమీదకు వచ్చేటప్పటికీ దర్శకుడు మోహన్ బమ్మిడి కథనం పరంగా కనీస న్యాయం చేయలేకపోయాడు. సత్యదేవ్ తన టైమింగ్ తో నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ప్రియాలాల్ లుక్స్ ప్లస్ నటన రెండింటిలోనూ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. రెండు గంటలు సాగే మెటీరియల్ స్టోరీలో లేదు. అయినా కూడా సాగతీతను లక్ష్యంగా పెట్టుకుని గువ్వగోరింకను నడిపించేశారు. అనవసరమైన ట్రాక్స్, ఎపిసోడ్స్ ఓపికకు పరీక్ష పెడతాయి. సురేష్ బొబ్బిలి సంగీతం చాలా మటుకు కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసింది.మొత్తానికి గువ్వగోరింకలు నీరసంతో కిందపడిపోయి నిరాశపరుస్తాయి.