iDreamPost
iDreamPost
గుంటూరులో జిన్నా టవర్ సెంటర్ ప్రాధాన్యత ఆ జిల్లాలో అందరికీ తెలుసు. కానీ హైదరాబాద్‌లో ఉండే రాజాసింగ్, ఢిల్లీలో తిరిగే జీవీఎల్, రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు వంటి వారు మాత్రం ఇప్పుడు జిన్నా టవర్ గురించి మాట్లాడేస్తున్నారు.స్వాతంత్రానికి పూర్వం నిర్మించిన జిన్నా టవర్ నేపథ్యం తెలిస్తే బీజేపీ నేతల మాటల వెనుక బండారం ఇట్టే అర్థమవుతుంది. ఏపీలో సామరస్య పూర్వక వాతావరణం ఆపార్టీకి లేదా అనే సందేహం కలుగుతుంది. గతంలో ఆలయాల చుట్టూ వివాదం రాజేసి ఆశించిన ఫలితాలు రాక చివరకు చీపు లిక్కరు రాజకీయాలకు దిగిన ఈ బ్యాచ్ ఇప్పుడు మరోసారి మత రాజకీయాలకు దిగడం చూస్తుంటే విద్వేషాలు రగిల్చే లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని అంతా ఆశిస్తారు. కానీ అందుకు అవసరమైన సహాయం అందించడంలో బీజేపీ ఘోరంగా విఫలమయ్యింది. ప్రత్యేక హోదా నుంచి పోలవరం నిధుల వరకూ అన్ని విషయాల్లోనూ ఏపీకి అన్యాయం చేస్తోంది. ఇది అందరికీ అర్థమవుతున్న తరుణంలో బీజేపీని ఆదరించడానికి ఏపీ వాసులు ససేమీరా అంటున్నారు ఇప్పటికే స్థానిక ఎన్నికల నుంచి ఉప ఎన్నికల వరకూ అన్నింటా ఆపార్టీ నోటాతో పోటీ పడుతూ డిపాజిట్లు కూడా సాధించలేక చతికిలపడుతోంది. ఈ తరుణంలో చౌకగా చీప్ లిక్కర్ ఇస్తాం, జిన్నా టవర్ పేరు మారుస్తామంటూ ప్రజలకు పనికిరాని అంశాలను పట్టుకుని అందరినీ పక్కదారి పట్టించాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది.
జిన్నా టవర్ ఎందుకు కట్టారు..
గుంటూరు జిల్లాలో మైనార్టీల సంఖ్య కూడా ప్రభావిత స్థాయిలో ఉంటుంది. స్వతంత్ర్య పూర్వం నుంచి ఈ సంఖ్య రీత్యా 1940లలో గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల హిందూ, ముస్లిం ల మధ్య విబేధాలు తలెత్తాయి. క్విట్ ఇండియా ఉద్యమానికి ముందు వాటిని సరిదిద్దేందుకు స్వాతంత్ర్య సమరయోధులంతా రంగంలోకి దిగారు.మతాలతో సంబంధం లేకుండా కృషి చేశారు. మహమ్మద్ ఆలీ జిన్నా సహాయంతో సమస్యను పరిష్కరించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకూ 8 దశాబ్దాలు దాటినా గుంటూరు జిల్లాలో అంతా సామరస్యంగా సాగుతున్నారు. అన్ని మతాలు ఒక్కటై దేశ స్వతంత్ర్యోద్యమంలో పాల్గొన్న దశ నుంచి రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా అభివృద్ధిపథంలో సాగేందుకు అంతా కలిసి అడుగులు వేశారు.
ఈ ఐక్యతకు గుర్తుగా జిన్నాకి గౌరవార్థం 1942లో జిన్నా టవర్ నిర్మించారు అయితే టవర్ ప్రారంభానికి జిన్నా రావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయ్యింది. ఆయనకు బదులుగా జిన్నా తన ప్రధాన అనుచరుడు షౌకత్ ఆలీ ఖాన్‌ని పంపించారు. గుంటూరుకి అప్పట్లో ఎమ్మెల్యేగా పనిచేసిన లాల్ జాన్ భాష ( ప్రస్తుత ఏపీ ప్రభుత్వ సలహాదారు జియావుద్దీన్ తాత) ఈ టవర్ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. ప్రారంభ కార్యక్రమానికి కొండా వెంకటప్పయ్య పంతులు, కాశీనాథుని నాగేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, కల్లూరి చంద్రమౌళి సహా పలువురు హాజరై అందరినీ ఐక్య పరిచేందుకు కృషి చేశారు. ఫలితం సాధించి గుంటూరు విశిష్టతను చాటారు.
పేరుకే జిన్నా, అంతా హిందువులే
సుమారు 20 శాతం మంది ముస్లింలు ఉన్న గుంటూరు నగరంలో జిన్నా టవర్ ప్రధాన వ్యాపార కూడలి. అయితే అక్కడ జిన్నా టవర్ ఉన్నప్పటికీ చుట్టూ వ్యాపారమంతా హిందువులదే కావడం విశేషం. అంటే మతసామరస్యానికి చిహ్నం, భారతీయతకు నిదర్శంగా ఈ టవర్ కనిపిస్తోంది. మతాల ప్రమేయం లేకుండా అంతా కలిసి సాగే కట్టడంగా నిలుస్తోంది. చివరకు పాకిస్తాన్ లో కూడా ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన నిర్మాణం జిన్నా పేరుతో లేదంటే భారతీయతను గమనించవచ్చు.
ఈ సెంటర్‌కు సమీపంలోని మాయాబజార్‌లో అంతా ముస్లింలే ఉన్నప్పటికీ అక్కడ దానికి లాల్ బహుదూర్ శాస్త్రి పేరు పెట్టారు. జిన్నా టవర్‌లో మాత్రం హిందువులు వ్యాపారాలు చేస్తూ గుంటూరు నగర విశిష్టతను అందరికీ చాటుతారు. ఆనాటి నుంచి ఎంత ఉద్రిక్తత దేశమంతా తలెత్తినా గుంటూరులో మాత్రం ఐక్యత చాటుకోవడం ఈ నగర ప్రత్యేకతను చాటుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంతటి ప్రత్యేకత ఉన్నప్పటికీ గ్రహించలేని బీజేపీ నేతలు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త వివాదాలు రాజేయడం విడ్డూరంగా చెప్పవచ్చు. విభజన తీసుకొచ్చి కలిసి ఉన్న వారిని విడగొట్టి సాధించేదేమీ ఉండదు. అయినా గానీ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించలేని బీజేపీ నాయకత్వం ఏపీలో విచ్ఛిన్న రాజకీయాలకు యత్నిస్తోందని స్పష్టమవుతోంది. ఇది ఏపీ అభివృద్దికి పెద్ద ఆటంకంగా మారకముందే ఆంధ్రప్రదేశ్ వాసులు తమ ప్రత్యేకత నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మత విద్వేషాలు రాజేసే వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి ఉంటుంది