iDreamPost
iDreamPost
పాలకొల్లు రాజకీయాల్లో ఆసక్తిక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి గుణ్ణం నాగబాబు వైఎస్సార్సీపీ గూటికి చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి జగన్ కండువా కప్పి ఆహ్వానించారు. గుణ్ణం నాగబాబు సాధారణ ఎన్నికల ముందు వరకూ పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేశారు. కానీ చివరి నిమిషంలో పార్టీ టికెట్ దక్కడం లేదనే కారణంతో జనసేనలో చేరారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 32వేల ఓట్లను దక్కించుకుని మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
పాలకొల్లులో అప్పట్లో వైఎస్సార్సీపీకి సానుకూలత ఏర్పడినప్పటికీ గుణ్ణం నాగబాబు పార్టీ మారిపోయి , జనసేన తరుపున రంగంలో దిగడం టీడీపీకి కలిసి వచ్చింది. డాక్టర్ బాబ్జీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రంగంలో దిగగా, నాగబాబు భారీగా ఓట్లు చీల్చడం ద్వారా ప్రస్తుతం ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గట్టెక్కేందుకు దోహదపడ్డారు. ఇక ప్రస్తుతం పాలకొల్లు అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న కవురు శ్రీనివాస్ ఇటీవల జెడ్పీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి నాగబాబుకి లైన్ క్లియర్ గా ఉన్నట్టు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన తనయుడు గుణ్ణం సుభాష్, పాలకొల్లు జనసేన నేతలు వీర శ్రీనివాసరావు, విప్పర్తి ప్రభాకరరావు వంటి వారితో కలిసి జనసేనను వీడి వైఎస్సార్సీపీ వైపు వచ్చారు. ఇది పాలకొల్లు వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన గుణ్ణం నాగబాబు చేరిక ద్వారా ఆ ప్రాంతంలో సామాజిక సమీకరణాలకు దోహదపడుతుంది. ఇప్పటి వరకూ బీసీ నేతలు ఇన్ఛార్జులుగా ఉండడంతో ఇకపై కాపు కులస్తుల సమీకరణ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇది పాలకొల్లు రాజకీయాలను మలుపు తిప్పే అంశంగానే భావించాలి. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఆచంట నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, నరసాపురం ఎమ్మెల్యేగా ముదునూరి ప్రసాదరాజు ఉన్నారు. దాంతో పాలకొల్లు కాపులకు కేటాయించడం ద్వారా రాజకీయంగా వైఎస్సార్సీపీ వ్యూహాలకు పదును పెట్టడం ఖాయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో గుణ్ణం నాగబాబు తన సొంత గూటికి చేరిన తరుణంలో పార్టీలో పాగా వేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి.