iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో గులాబ్ తాకిడి తీవ్రంగా కనిపించింది. తీరాన్ని తాకిన తర్వాత తీవ్రత ఎక్కువగా కనిపించింది. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్న తీరాన్ని తాకింది. ఆ తర్వాత నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం పెరిగింది. తీరాన్ని దాటేతంట వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దక్షిన ఒడిశాతో పాటుగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో తాకిడి కనిపించింది అపార నష్టాన్ని తీసుకొచ్చింది.
అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. ఆహార, ఉద్యానవన పంటలు నష్టపోయాయి. రైళ్ల రాకపోకలకు కూడా ఆటంకం ఏర్పడింది. కే కే లైన్లో రైల్వే ట్రాక్ పై కొండచెరియలు విరిగిపడ్డాయి. ఇక విశాఖ నగర వాసులు అల్లాడిపోయారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 80 కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. గెడ్డలు ఉప్పొంగడంతో నగర వాసులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెందుర్తి, గాజువాక వాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Also Read : కేరళ బీజేపీలో హైవే దోపిడీ కల్లోలం,పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తొలగింపు?
వంశధార,నాగవళితో పాటుగా ఉత్తరాంధ్రలోని ప్రధాన నదులన్నీ పొంగుతున్నాయి. వరద తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పరిస్థితిపై సమీక్ష జరిపారు. గులాబ్ తుపాన్ మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. వంశధార, నాగావళి నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సహాయక శిబిరాల్లో నాణ్యమైన ఆహారం, వైద్యం, నీరు అందించాలని అధికారులకు సూచించారు. సహాయ శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చెల్లించబోతున్నట్టు తెలిపారు. తుపాన్ తగ్గగానే యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ జరగాలన్నారు. పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు.
ఏడు జిల్లాల పరిధిలోనూ అవసరమైన సహాయక చర్యల కోసం యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్దరణ ప్రయత్నాలు చేస్తోంది.
గులాబ్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తుఫాన్ బలహీనపడి వాయుగండంగా మారింది. రేపటికల్లా మరింత శాంతించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోననే ఆందోళన మొదలవుతోంది. గులాబ్ నుంచి గట్టెక్కిన ప్రజలను అల్పపీడన ప్రభావం ఉపశమనం కలిగిస్తుందా లేదా అనే ఉత్కంఠ ఏర్పడింది.
Also Read : నిన్న విస్తరణ..నేడు అసమ్మతి