గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది గురువారం ఉదయం తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశం అయింది. గుజరాత్ కొత్త సీఎం భూపేంద్ర పటేల్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని క్షణాల ముందు రాజీనామా చేయుంతో ఆయన కూడా మంత్రి వర్గంలో చేరుతున్నారని అందరూ భావించారు, ఆ ఊహలు నిజం చేస్తూ ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
వడోదరలోని రావుపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న త్రివేది ఫిబ్రవరి 19 2018న బాధ్యతలు స్వీకరించారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయిన త్రివేది గతంలో స్పోర్ట్స్ యూత్ & కల్చరల్ మినిస్టర్ గా పని చేశారు. ఇక తాజాగా రాజేంద్ర త్రివేది సహా బీజేపీ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు జితు వాఘనీతో సహా 24 మంది మంత్రులు గుజరాత్ ప్రభుత్వ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేతృత్వంలోని మాజీ మంత్రివర్గంలో ఉన్న ఒక్క మంత్రిని కూడా ఈ కొత్త మంత్రివర్గంలో చేర్చలేదు.
గవర్నర్ ఆచార్య దేవవ్రత్ 10 మంది క్యాబినెట్ మంత్రులు మరియు 14 మంది రాష్ట్ర మంత్రులతో ప్రమాణం చేయించారు, సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర 17 వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్ కూడా మాజీ ముఖ్యమంత్రి రూపానీతో పాటు హాజరయ్యారు. మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని భావించి రాశ చెందిన పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగా, బుధవారం జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
Also Read : కాంగ్రెసులోకి కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ?
భూపేంద్ర పటేల్ కొత్త మంత్రివర్గంలో, ఏడుగురు పటీదార్లు(పటేళ్లు), ఆరుగురు ఓబీసీలు, నలుగురు గిరిజనులు, ముగ్గురు దళితులు, ముగ్గురు కోలీలు (EBC లు), ఒక రాజ్‌పుత్ (దర్బార్), ఒక బ్రాహ్మణుడు ఉన్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా స్పీకర్ ను రాజీనామా చేయించి మరీ మంత్రిని చేశారు, ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. అలాగే రాజేంద్ర త్రివేది, ఒకప్పుడు ప్రముఖ న్యాయవాది, 2002 అల్లర్ల తర్వాత బెస్ట్ బేకరీ కేసులో గుజరాత్ ప్రభుత్వం తరఫున ఆయన వాదించారు.
రూపానీ క్యాబినెట్‌లో నితిన్ పటేల్ ఉన్నట్లుగా కొత్త క్యాబినెట్‌లో త్రివేది సీనియర్-మోస్ట్ లీడర్‌గా ఉండనున్నారు. ఆయనకు అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖను కట్టబెట్టనున్నారని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి తొలి సారి ఎమ్మెల్యే కావడంతో ఆయనకు అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉంటారనే ఉద్దేశంతోనే ఆయనను స్పీకర్ గా తప్పించి మంత్రిని చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కొత్త కేబినెట్ సభ్యులలో, ఎనిమిది మంది సౌరాష్ట్ర నుంచి, ఏడుగురు దక్షిణ గుజరాత్ నుంచి, ఆరుగురు గుజరాత్ నుండి, మరియు ముగ్గురు ఉత్తర గుజరాత్ నుంచి ఎన్నిక కాబడ్డారు.
2022 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్ట ఓటు బ్యాంకును కాపాడుకోవడమే లక్ష్యాలుగా మంత్రుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక కొత్త మంత్రులుగా రాజేంద్ర త్రివేది, జితు వాఘని, హృషికేష్ పటేల్, పూర్ణేష్ మోడీ, రాఘవ్‌జీ పటేల్, కనుభాయ్ దేశాయ్, కిరీత్ సింగ్ రాణా, నరేష్ పటేల్, ప్రదీప్ పర్మార్ మరియు అర్జున్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. మరోపక్క నిమా ఆచార్య గురువారం శాసనసభ స్పీకర్ గా ఎన్నిక కాబడ్డారు.
Also Read : అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఆ ప్రచారాన్ని తిప్పికొడతారా?