iDreamPost
android-app
ios-app

కొడాలి నానిపై టీడీపీ ఆతృత, కాసినో కథలు ఫలితాన్నిచ్చేనా?

  • Published Jan 22, 2022 | 1:58 AM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
కొడాలి నానిపై టీడీపీ ఆతృత, కాసినో కథలు ఫలితాన్నిచ్చేనా?

తెలుగుదేశం పార్టీ నేతలకు చాలాకాలంగా కొడాలి నాని మింగుడుపడడం లేదు. ఆయన ధోరణి, మాటతీరు చంద్రబాబు నుంచి మొదలుకుని టీడీపీ నేతలెవ్వరికీ రుచించడం లేదు. కానీ నాని ని ఎదుర్కోవడం టీడీపీ నేతల తరం కావడంలేదు. అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆయన జోలికి వెళ్లేందుకు కూడా చాలామంది టీడీపీ నేతలు మొఖంచాటేశారు. చంద్రబాబు మీద నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే నేతలే కరువయ్యారు. ఈ సమయంలో సంక్రాంతి వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమం చుట్టూ టీడీపీ నేతలు వివాదం సృష్టించే ప్రయత్నం ప్రారంభించారు. కానీ తీరా చూస్తే అక్కడే టీడీపీ తప్పులో కాలేసింది.

కొడాలి నాని జనవరి మొదటి వారంలో కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్ లో చికిత్స పొందారు. చివరకు సంక్రాంతికి కూడా ఇంటికి రాలేదు. రావడానికి ఆయనకు ఆస్కారం లేదు. ఏటా సంక్రాంతి సమయంలో గుడివాడలో పెద్ద స్థాయిలో ఎడ్లపందాలు నిర్వహించి సంప్రదాయ క్రీడలకు ఆయన పెద్ద పీట వేసేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా గతంలో పాల్గొన్నారు. తద్వారా గుడివాడకు సంక్రాంతి కళ తీసుకొచ్చేవారు. సామాన్యుల సైతం రెండు,మూడు రోజులపాటు ఆ వేడుకల్లో పాల్గొని ఆనందించేవారు. కానీ ఈసారి ఆరోగ్య సమస్యలతో అలాంటి వాటికి ఆస్కారం లేకుండా పోయింది.

సంక్రాంతి సందర్భంగా ఈసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా కోడిపందాలు జోరుగా సాగాయి. ఆ సందర్భంగా వివిధ రకాల జూదాలు అన్ని చోట్లా సాగాయి. గుడివాడలో కొడాలి నాని అనుచరులు కూడా కొందరు కోడిపందాల నిర్వహణకు పూనుకున్నారు. ఆ క్రమంలోనే కొందరు మహిళలతో నృత్యాలకు ప్రయత్నం చేయడం మంత్రి దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన స్పందించి పోలీసులతో వాటిని నిలిపివేయించారు. ఇదంతా అధికారికంగా జరిగిన వ్యవహారం. అయితే దానిని ఏకంగా గోవా తరహా క్యాసినో అంటూ ఓ వర్గం మీడియా చిత్రీకరించింది.

కొడాలి నాని అంటే గిట్టని వారికి ఇదో అస్త్రంగా మారింది. ఏదోరకంగా నాని పరువు తీయాలనే సంకల్పంతో ఉన్న వారంతా దానినే అస్త్రంగా మలచుకుని నిందలకు పూనుకున్నారు. కానీ నిజానికి నాని గుడివాడలో ఉండి అక్కడ ఇలాంటి వ్యవహారాలు జరిగితే అందరూ మంత్రిని అనుమానించే పరిస్థితి వచ్చేది.

కానీ మంత్రి ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నారు. ఆ సమయంలో కూడా తన దృష్టికి వచ్చిన నృత్యాలను నిలిపివేయించారు. అయినప్పటికీ ఈ వ్యవహారాన్ని భూతద్దంలో చూపించి, దానిని కే కన్వెన్షన్ కి అంటగట్టి నానిని బద్నాం చేసేందుకు బురదజల్లే ప్రక్రియ సాగిస్తున్నారు. తీరా గుడివాడలో నిజనిర్ధారణ అంటూ టీడీపీ నేతలు మరో ప్రహసనం చేయడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది.

నిజ నిర్ధారణ కమిటీలో ఉన్న నేతలు కొందరు గతంలో కాల్ మనీ వ్యవహారాల్లో మహిళలను ఎంత హీనంగా చూశారో లోకమంతటికీ తెలుసు. అలాంటి వారంతా ఇప్పుడు మహిళల పరువు తీయడం, జూదం గురించి మాట్లాడే ప్రయత్నం చేయడమే విడ్డూరం. అందుకు తోడుగా ప్రైవేట్ వ్యవహారంలోకి వెళ్లడానికి అనుమతి లేకుండానే ముందుకెళ్లడం మరో విచిత్రం. పోలీసులు చెబుతున్నట్టు గుడివాడలో గందరగోళం సృష్టించి, గలాటా రాజేయాలనే కుట్ర పన్నినట్టుగా కనిపిస్తోంది. ఇదంతా పొలిటికల్ డ్రామాగా గుడివాడలో ఒకటి రెండు రోజులు చూడడమే తప్ప దాని వల్ల టీడీపీకి ఒరిగేదేమీ ఉండదనే విషయం గ్రహించడం మంచిదేమో.