iDreamPost
android-app
ios-app

పట్టభద్రుల ఎమ్మెల్సీ : ఎవరి ధీమా వారిదే

పట్టభద్రుల ఎమ్మెల్సీ : ఎవరి ధీమా వారిదే

తెలంగాణలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు ముగిశాయి. ఇక అభ్యర్థులు గెలుపోటముల లెక్కల్లో బిజీగా మారారు. రెండు స్థానాలలోనూ మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో ఉండడం విశేషం. ఇందులో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచే 93 మంది పోటీ చేశారు. వీరి భవితవ్యం ప్రస్తుతం బ్యాలెట్‌ బాక్కుల్లో నిక్షిప్తమైంది. కొంత మంది స్వతంత్రులు సహా ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రులు ఎన్నడూ లేని రీతిలో ఓటేసేందుకు పోటెత్తారు. బ్యాలెట్‌ పత్రం దినపత్రికలా పెద్దదిగా ఉండడం, సంతకాలు పెట్టడం, నాలుగు వరుసలుగా మడతలు పెట్టాల్సి రావడం వంటి కారణాలతో ఓటు వేయడానికి ఎక్కువ సమయం పట్టింది. అయినప్పటికీ ఓటర్లు ఉత్సాహం చూపడంతో గతం కంటే పోలింగ్‌ శాతం ఎక్కువగా నమోదైంది. గతంలో ఎప్పుడూ 40 శాతం కూడా దాటని పోలింగ్ ఈసారి ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ స్థానంలో 74 శాతం న‌మోదైంది. హైద‌రాబాద్ స్థానంలో 64 శాతం పోలింగ్ న‌మోదుకావ‌డం విశేషం.

గెలుపు అంచనాలివే..

ఓటర్లు ఓటేసేందుకు ఎక్కువ మంది రావడంలో టీఆర్‌ఎస్‌దే కీలక పాత్ర అని, ఆ విషయంలో సఫలమైనందున విజయం కూడా తమ పార్టీ అభ్యర్థులనే వరిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికి తోడు పార్టీ మంత్రులు సహా నాయకులు అందరూ శక్తివంచన లేకుండా ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దీంతో రెండు స్థానాల్లో తమదే విజయమంటున్నాయి. హైదరాబాద్‌ స్థానం నుంచి పీవీ కుమార్తె వాణీదేవి పోటీలో నిలవగా, ఖమ్మం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పోటీ చేశారు. బీజేపీ కూడా విజయంపై ధీమాగా ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోను తమనే ప్రత్యామ్నాయంగా చూసిన ఓటర్లు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే కొనసాగించారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌ సిట్టింగ్‌ స్థానం నుంచి రామచంద్రరావు గెలుపొందడంతో పాటు పాటుగా.. ఖమ్మం సీటూనూ గెలుస్తామని చెబుతున్నారు. రెండు నియోజకవర్గాల్లోని సామాజిక సమీకరణలు తమ అభ్యర్థులకు కలిసి వచ్చిందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ స్థానంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి చిన్నారెడ్డి ఒక్కరే పోటీలో ఉండడం, ఆయన సౌమ్యుడు, విద్యాధికుడు కావడంతో కాంగ్రెస్‌ సానభూతి పరులు, రెడ్డి సామాజిక వర్గం పట్టభద్రులు పెద్ద ఎత్తున ఓట్లేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని పార్టీలకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లూ చిన్నారెడ్డికే పడ్డాయని అంచనా వేస్తున్నారు. ఖమ్మం స్థానానికి సంబంధించి కాంగ్రెస్‌ సంప్రదాయ ఓట్లతోపాటుగా ఎస్టీ పట్టభద్రుల్లో మెజార్టీ ఓట్లూ తమ పార్టీ అభ్యర్థి రాములు నాయక్‌కు పడ్డాయని చెబుతున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా గణనీయంగా పడ్డాయంటున్నాయి.

ఇక్కడ నాగేశ్వర్‌.. అక్కడ కోదండరాం

హైదరాబాద్‌ స్థానం నుంచి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పోటీలో ఉన్నారు. వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. స్వచ్ఛంద, సామాజిక సంఘాలను కలుపుకుని ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఆయనకు యువతలో ఫాలోయింగ్‌ బాగానే ఉంది. గతంలోనూ ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన ప్రసంగాలు, విశ్లేషణలు యువతను బాగా ఆకట్టుకుంటాయి. ఈసారి పోలింగ్‌ శాతం పెరగడం తనకు కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారు. తొలి ప్రాధాన్య ఓటుతో పాటు, రెండో ప్రాధాన్య ఓట్లు కూడా బాగానే పడ్డాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తొలిసారిగా ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన టీజేఎస్‌ చీఫ్‌ కోదండరాం కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ఉద్యోగులు, నిరుద్యోగులు, వివిధ వర్గాల్లోని పట్టభద్రుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారు కోదండరాంనే ప్రత్యామ్నాయంగా చూశారని టీజేఎస్‌ నేతలు చెబుతున్నారు. నిశ్శబ్ద ఓటింగ్‌ తమకే అనుకూలమంటున్నారు. దాదాపు అన్ని పార్టీల రెండో ప్రాధాన్యతా ఓటూ కోదండరాంకే పడిందన్న అంచనాలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. ఇలా ఎవరికి వారే పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా ఓటింగ్‌ పెరగడం ఎవరికి కలిసొస్తుందో, ఎవరి కొంప ముంచుతుందో తెలియక అభ్యర్థులందరూ ఆందోళన చెందుతున్నారు. మరి కొద్ది రోజుల్లో వెలువడే ఫలితాలతో ఎవరి అంచనా సరైందనే విషయం తేలిపోతుంది.

నిరుద్యోగుల వినూత్నం వైరల్‌..

పోలింగ్‌ రోజు పట్టభద్రుల ఎన్నికల్లో వింత పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు సిలిండర్‌లకు దండం పెడితే… మరి కొందరు నిరుద్యోగులకు నమస్కరించారు. వంట గదుల్లో పూజ చేయడం.. పెట్రోల్‌ బంకుల్లో దండం పెట్టడం వంటి వింత ఘటనలు జరిగాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాన పార్టీలు పట్టభద్రుల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం, పోలింగ్‌ రోజు వరకు ఓటర్ల ఆదరణ పొందేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాయి. నేతలకు తామే మి తీసిపోమన్నట్టుగా ఆయా పార్టీల కార్యకర్తలు, సామాన్యులూ సామాజిక మాధ్యమాలు వేదికగా ఎన్నికలపై భిన్న పోస్టులు చేశారు. పెట్రోల్‌ బంకులో మీటర్‌ రీడింగ్‌కు నమస్కరిస్తున్నట్టు ఒకరు ఫొటో పోస్ట్‌ చేస్తే… మరి కొందరు ఇళ్లలో సిలిండర్‌కు దండం పెట్టిన, పూజలు నిర్వహించిన ఫొటోలు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. పెట్రోల్‌ ధరలు దాదాపు రూ.100కు చేరువ కావడం.. సిలిండర్‌ ధర కూడా గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పోలింగ్‌ రోజు కొందరు ఈ తరహాలో నిరసన వ్యక్తం చేశారు. ఓ మహానుభావుడు చెప్పినట్లుగా సిలిండర్‌కు దండం పెట్టి ఓటు వేయడానికి వెళ్లానని మంత్రి కేటీఆర్‌ కూడా విమర్శనాస్త్రాలు సంధించారు.