iDreamPost
iDreamPost
మోదీజీ.. రోజులన్నీ ఒకేలా ఉండవు. గతంలో ఇందిరా గాంధీకి ఏం జరిగిందో గుర్తించండి. సిక్కులపై తీసుకున్న చర్యలకు ప్రతిఫలంగా.. తనకు సెక్యూరిటీగా ఉన్న ఆ సిక్కు గార్డుల చేతుల్లోనే హత్యకు గురయ్యారు. ఇప్పుడు రైతు ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మీరు అదే పని చేస్తున్నారు. ఆ ఉద్యమంలో సిక్కులు, జాట్లే ఎక్కువగా ఉన్నారు. వారికి కోపం రాకుండా జాగ్రత్త పడండి.. అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యానించారు. బీజేపీకే చెందిన ఆయన మోదీని హెచ్చరించడమే కాకుండా రైతు ఉద్యమంతో సహా పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైపూర్ లో జరిగిన జాట్ల సమ్మేళనంలో ఈ వ్యాఖ్యలు చేసిన మాలిక్ గతంలో తాను జమ్మూకశ్మీర్ గవర్నరుగా ఉన్నప్పుడు రెండు ఫైల్స్ పై సంతకం చేసేందుకు రూ.వందల కోట్ల లంచం ఆఫర్ చేశారని కొన్నాళ్ల క్రితం ఆరోపించడం రాజకీయ రచ్చకు దారి తీసింది. తనకు లంచం ఇవ్వజూపారని మాలిక్ చెప్పిన సమయంలో కాశ్మీర్లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం విశేషం.
కుక్క చనిపోతే సంతాపం చెబుతారు.. రైతులను పట్టించుకోరా..
ఒక కుక్క చనిపోతే ఢిల్లీ పెద్దలు సంతాపాలు ప్రకటిస్తారు గానీ.. తీవ్రమైన చలిలో ఉద్యమం చేస్తున్న రైతులను ఎందుకు పట్టించుకోరని సత్యపాల్ మాలిక్ కేంద్ర పాలకులను ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో దాదాపు ఏడాదిగా ఉద్యమం చేస్తున్న రైతులకు తన మద్దతు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమం ప్రారంభం అయినప్పటి నుంచి 600 మంది రైతులు మరణించారన్నారు. అయినా మోదీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రైతులు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేనన్నారు. రైతుల్లో సిక్కులు, జాట్లే అధికంగా ఉన్నారని అంటూ ఇందిర విషయంలో ఏం జరిగిందో గుర్తు చేసుకొని సిక్కులకు ఆగ్రహం తెప్పించకుండా జాగ్రత్త పడాలని ప్రధాని మోదీకి సూచించారు. రోజులెప్పుడు ఒకేలా ఉండవని హెచ్చరించారు.
తనకు పదవి ఎక్కువ కాదని, దాన్ని వదులుకునేందుకు సిద్ధమని సత్యపాల్ స్పష్టం చేశారు. గవర్నర్ పదవి పుట్టుకతో రాలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు వందల కోట్ల ఖర్చుతో సెంట్రల్ విష్టా నిర్మాణాన్ని కూడా తప్పు పట్టారు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి పెట్టే ఖర్చుతో ప్రపంచస్థాయి విద్యాలయం నిర్మిస్తే బాగుండేదన్నారు.
సొంత పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
సత్యపాల్ మాలిక్ స్వతహాగా రాజకీయ నాయకుడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆయన భారతీయ క్రాంతి దళ్ ద్వారా రాజకీయాల్లో చేరి కాంగ్రెస్, జనతాదళ్, లోక్ దళ్ పార్టీల్లో పనిచేసిన అనంతరం బీజేపీలో చేరారు. 2018 ఆగస్టులో జమ్మూకాశ్మీర్ గవర్నరుగా నియమితులయ్యారు. ఆ సమయంలో రాష్ట్రంలో బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలోనే పారిశ్రామికవేత్త అంబానీ, ఒక ఉన్నతస్థాయి ఆరెస్సెస్ నేతకు చెందిన రెండు కీలక ఫైళ్లపై సంతకం పెడితే వందల కోట్ల లంచం ఇస్తామని ప్రలోభపెట్టారని ఇటీవలే మాలిక్ బయటపెట్టి కలకలం రేపారు. ఆ వ్యవహారంపై అప్పట్లోనే గవర్నర్ హోదాలో విజిలెన్స్ కమిషన్ వేసి విచారణ జరిపించారని గవర్నర్ సన్నిహితులు తెలిపారు. ఆ తర్వాత నుంచి సదరు ఆరెస్సెస్ నేత మాలిక్ ను టార్గెట్ చేసి.. అతన్ని గోవాకు బదిలీ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019 నవంబరులో గోవాకు బదిలీ అయిన సత్యపాల్ అక్కడి బీజేపీ ప్రభుత్వంలోనూ అవినీతి పెరిగిపోవడాన్ని గ్రహించి బదిలీని కోరుకున్నారు. అప్పటికే ఆయన వైఖరితో ఇరకాటంలో పడిన కేంద్ర పాలకులు తొమ్మిది నెలల వ్యవధిలోనే గత ఏడాది ఆగస్టులో శివారు రాష్ట్రమైన మేఘాలయకు బదిలీ చేశారు. అప్పటినుంచీ సత్యపాల్ మాలిక్ రైతు ఉద్యమాలు, ఇతర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read : BJP, Petrol Prices – కొనక్కొచ్చుకున్న బీజేపీ..!