iDreamPost
android-app
ios-app

బిల్లుకు గవర్నర్ ఆమోదం-ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్

  • Published Jul 03, 2020 | 2:56 AM Updated Updated Jul 03, 2020 | 2:56 AM
బిల్లుకు గవర్నర్ ఆమోదం-ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్

లాక్ డౌన్ కఠినంగా అమలు చేసిన సమయంలో కూడా ఉద్యోగుల వేతనాలు జాప్యం జరగలేదు. వేతనాల్లో కోత విధించాలని దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఏపీలో కూడా అమలు చేసినప్పటికీ వాటిని సకాలంలో అందించేందుకు ప్రయత్నించారు. ఇక జూన్ నెల నుంచి కోత లేకుండా పూర్తి వేతనాలు అందించే సమయంలో కూడా ఎటువంటి జాప్యం లేదు. కానీ ఈసారి ఉద్యోగుల వేతనాలు ఊగిసలాటలో పడ్డాయి.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలతో పాటుగా ఇతర కార్యకలాపాలకు నిధుల కేటాయింపులో చిక్కలు వచ్చాయి.

దానికి ప్రధానకారణం శాసనమండలిలో ఉన్న సంఖ్యాబలం కారణంగా టీడీపీ చేసిన రాద్ధాంతమేనని అధికార పక్షం చెబుతోంది. ఏకంగా ద్రవ్యవినిమయ బిల్లును కూడా అడ్డుకున్న కారణంగా టీడీపీ రాజకీయాలకు ఉద్యోగులు బలి అయ్యారని చెబుతోంది. ప్రభుత్వ బిజినెస్ ని కూడా అడ్డుకుందామని టీడీపీ చేసిన ప్రయత్నం మూలంగా ద్రవ్యవినిమయ బిల్లుకి కూడా మోక్షం కలగలేదు. మండలి బడ్జెట్ సమావేశాల్లో తీవ్ర ఉద్రికత్త ఏర్పడింది. చివరకు ఎటువంటి 12 బిల్లులకు గానూ 9 బిల్లులను ఆమోదించగలిగిన ప్రభుత్వానికి 3 బిల్లుల విషయంలో టీడీపీ అడ్డుపడింది. అందులో ద్రవ్యవినిమయబిల్లు కూడా ఒకటి.

వాస్తవానికి శాసనమండలికి బిల్లులను అడ్డుకునే హక్కు లేదు. రాష్ట్రాలలో ఎగువ సభ పూర్తిగా అసెంబ్లీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అలాంటి అధికారంతోనే మండలిని రద్దు చేసేందుకు గతంలో ఎన్టీఆర్ ప్రయత్నం చేసినా, రాజశేఖర్ రెడ్డి పునుద్దరించినా, తాజాగా మరోసారి రద్దుకి జగన్ మొగ్గుచూపినా అనుకున్నది సాధించేందుకు ఆస్కారం ఏర్పడింది. అదే సమయంలో అసెంబ్లీ చేసిన బిల్లులో ప్రతిపాదనలు తప్ప, దానిని పూర్తిగా అడ్డుకునే అవకాశం మండలికి లేదు. ద్రవ్యేతర బిల్లు అయితే ఒకసారి అడ్డుకున్న సమయంలో రెండో సారి అసెంబ్లీ చర్చించి మండలి అభిప్రాయాలతో ఏకీభవించవచ్చు లేదా యధావిధిగా రెండోసారి బిల్లుని ఆమోదించవచ్చు. అలాంటి సమయంలో రెండోసారి వచ్చిన బిల్లుని కూడా మండలి ఆమోదించకపోతే నెల రోజుల సమయంలో యధావిధిగా ఆమోదం పొందుతుందని నిబంధనలు చెబుతున్నాయి.

ఇక ద్రవ్యబిల్లు అయితే మండలి తిరస్కరించిన్పటికీ 14 రోజుల్లో అది యధావిధిగా చట్ట రూపం దాల్చేందుకు అవకాశం ఉంది.

నిబంధనల గురించి అందరికీ ఉపన్యాసాలు దంచే యనమల రామకృష్ణుడు ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా ఉంటూ, చంద్రబాబు ఆదేశాల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే యత్నం చేయడం విశేషంగా మారింది. దాని ఫలితంగానే చివరకు ఈసారి బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లుకి అడ్డుపుల్ల పడింది. అయితే నిబంధనల ప్రకారం 14 రోజుల గడువుతో దానికి కూడా మోక్షం కలిగింది. ఈనెల 1వ తేదీ నాటికి ఆ గడువు పూర్తికాగానే 2వ తేదీన ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి గవర్నర్ ఆమోదం కూడా పొందింది. ఇక 3వ తేదీ నుంచి వేతనాలు, ఇతర బిల్లుల విడుదలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తే 4,5 తేదీలలో వేతనాలు అందించే అవకాశం ఉంటుందని ఆర్థిక శాఖ చెబుతోంది.

తొలిసారిగా దాదాపు వారం రోజుల పాటు ప్రభుత్వ సిబ్బంది జీతభత్యాలు నిలిచిపోవడంతో వారంతా తీవ్రంగా సతమతం అవుతున్నారు. వివిధ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుని, ఈఎంఐలు వంటివి చెల్లించేందుకు ఏర్పాట్లు చేసుకున్న వారు చిక్కుల్లో పడ్డారు. శాసనమండలిలో టీడీపీ చేసిన రాజకీయాలు చివరకు తమ మెడకు చుట్టుకున్నాయని వారంతా వాపోయే ప రిస్థితి వచ్చింది. రాజకీయ కారణాలతో ఏకంగా ప్రభుత్వ కార్యకలాపాలు సాగకూడదనే స్థాయిలో ప్రయత్నాలు చేయడం ఆశ్చర్యంగా ఉందని చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఉద్యోగుల సమస్యకు టీడీపీ , చంద్రబాబు బాధ్యత వహించాలని ఏపీ ఎన్జీవో నేతలు కూడా మండిపడ్డారు. అయితే ప్రభుత్వం 14 రోజుల గడువుని అనుసరించి నిబంధనల ప్రకారం వేగవంతంగా చర్యలు తీసుకోవడం వల్ల కొంత త్వరగా మోక్షం కలిగినప్పటికీ, ఇదే 14 రోజులు గడువు మరికొన్ని రోజులు ఆలశ్యం అయితే నెలవారీ వేతనాల కోసం ఎదురుచేసే వారి పరిస్థితి ఏమయ్యేదో అనేది ప్రశ్నార్థకం. ఏమయినా విపక్ష పార్టీ వ్యవహారం ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా ఉద్యోగుల మీద ప్రభావం చూపింది.