గత కొద్దిరోజులుగా మంత్రుల వరుస పర్యటనలు.. మరోవైపు మంత్రులు బొత్స, అవంతి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటనల జోరు.. వెరసి విశాఖలో రాజధాని జోష్ కనిపిస్తోంది. వీటికి తగినట్లే మౌలిక సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనుల విస్తరణ వేగం పుంజుకున్నాయి. ఇవన్నీ విశాఖ నుంచి త్వరలో రాజధాని కార్యకలాపాల ప్రారంభానికి సంకేతాలని స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికారుల కదలికలు, సమీక్షలు..అన్నీ ఆ దిశగానే సాగుతున్నాయి.
సీఎంవోతో శుభారంభం
విశాఖను కార్యనిర్వాహాక రాజధాని చేసే క్రమంలో న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని మొదట ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నగరానికి తరలిస్తారని అంటున్నారు. సీఎంవోకు, సీఎం బసకు అవరమైన భవనాలను ఇప్పటికే గుర్తించారు. బీచ్ రోడ్డులో సీఎం బసకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జాతీయ రహదారిలో బోయపాలెం ప్రాంతంలో సీఎంవో ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ప్రాంతాలను, మార్గాలను ఇప్పటికే సీఎం భద్రతాధికారులు పరిశీలించారని అధికారవర్గాలు వెల్లడించాయి. సీఎం , ఇతర ప్రముఖుల పర్యటనల తాకిడి పెరగనున్నందున బోయపాలెం నుంచి విశాఖ విమానాశ్రయం వరకు జాతీయ రహదారిపై ప్రజలు ఇబ్బంది పడకుండా.. బీఆర్టీఎస్ మీదుగా ముఖ్యమంత్రి పర్యటన మార్గాన్ని ఖరారు చేశారు. దీని ప్రకారం విమానాశ్రయం నుంచే ఎన్ఏడీ ఫ్లై ఓవర్, గూపాలపట్నం మీదుగా బీఆర్టీఎస్ రోడ్డులోకి మళ్లి.. గోశాల, హనుమంతువాక వద్ద తిరిగి జాతీయ రహదారిలోకి వచ్చి బోయపాలెం చేరుకునేలా 35 కిలోమీటర్ల రహదారిని సిద్ధం చేస్తున్నారు. ఈ మార్గంలో ఎన్ఏడీ ఫ్లై ఓవర్ నిర్మాణం ఇప్పటికే పూర్తి అయింది. మిగిలింది హనుమంతవాక వరకు బీఆర్టీఎస్ రోడ్డే. ఈ రోడ్డు కూడా పూర్తి అయినా.. గోశాల వద్ద సుమారు రెండు కిలోమీటర్ల రోడ్డు వివాదాల కారణంగా నిలిచి పోయింది. దీన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
నగరమంతా ప్రగతి పరుగులు
ఇంతకాలం విశాఖ అంటే బీచ్ రోడ్డే అన్నట్లు ఉండేది. అభివృద్ధి అంతా ఆ ప్రాంతంలోనే కేంద్రీకృతమయ్యేది. సీఎం జగన్ ఇచ్చిన కార్యనిర్వాహక రాజధాని వరం కారణంగా ఇప్పుడు నగరమంతటా ప్రగతి పరుగులు పెడుతోంది. ఇటు భీమిలి నుంచి.. అటు అనకాపల్లి వరకు మొత్తం 98 డివిజన్లలోనూ అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజ్, పార్కులు తదితర మౌలిక సదుపాయాల మెరుగుకు ప్రాధాన్యమిస్తున్నారు. నగరాన్ని మురికివాడల రహితంగా తీర్చిదిద్దెందుకు ప్రయత్నిస్తున్నారు. బీచ్ రోడ్డు వెంబడి భీమిలి వరకు పలు టూరిజం ప్రాజెక్టులు చేపడుతున్నారు. నగరంలోని మురుగునీరు సముద్రంలో కలవకుండా ప్రత్యేక రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీఎంఆర్డీఏ ద్వారా చేపట్టే పలు పనులకు కొన్నాళ్ల క్రితం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అవన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. కైలాసగిరి నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకు ఆరులైన్ల రోడ్డు విస్తరణ చేపట్టారు. ముడసర్లోవ రిజర్వాయర్ ప్రాంతాన్ని బృందావన్ గార్డెన్స్ తరహాలో అభివృద్ధి చేసే పనులకు ఇటీవలే ఎంపీ విజయసాయిరెడ్డి అంకురార్పణ చేశారు. దీనికి రూ. వంద కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. బహుముఖంగా అమలవుతున్న పనుల పర్యవేక్షణకు అధికారులతో ప్రత్యేక కమిటీని జిల్లా కలెక్టర్ వినయచంద్ నియమించారు. 15 రోజలకోసారి ఈ కమిటీతో సమావేశమై సమీక్షిస్తూ.. పనులు సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.
Also Read : కేంద్రం మెడలో కోవాగ్జిన్ అధిక ధరల గంట