iDreamPost
android-app
ios-app

పోలవరం .. రాష్టం ఒకడుగు ముందుకు, కేంద్రం తీరు వెనక్కి

  • Published Feb 16, 2022 | 11:09 AM Updated Updated Feb 16, 2022 | 11:09 AM
పోలవరం .. రాష్టం ఒకడుగు ముందుకు, కేంద్రం తీరు వెనక్కి

ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ రంగంలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేసే దిశలో ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కీలకమైన పనులు ఒక్కోటి పూర్తి చేస్తూ ముందడుగు వేస్తోంది. ఇప్పటికే స్పిల్ వే అందుబాటులోకి వచ్చింది. ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేశారు. తాజాగా పవర్ ప్లాంట్ పనుల్లో ముఖ్యమైన టన్నెల్ పనులను పూర్తి చేశారు. ప్రాజెక్టు ఎడమగట్టున తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని అంగుళూరు సమీపంలో విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ నిర్మిస్తున్నారు. 960 మెగావాట్ల ఉత్పాదన సామర్థ్యంతో ఈ పవర్ ప్లాంట్ సిద్ధమవుతోంది. దానికి తగ్గట్టుగా నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 12 ఫ్రెజర్ టన్నెల్స్ నిర్మాణం పూర్తి చేసింది. ఒక్కో టన్నెల్ 2016 మీటర్ల పొడవు ఉంటుంది. గత ఏడాది ఆగష్టులో వాటి పనులు ప్రారంభించారు. స్వల్పకాలంలోనే కొండ తవ్వకం పనులు పూర్తి చేశారు. ట్రయల్ రేస్ చానెల్ మట్టి తవ్వకం పనులు కూడా సాగిస్తోంది.

పోలవరం వద్ద నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతూ ఏపీ ఆశలు నెరవేరుతాయనే అంచనాలు పెంచుతున్న తరుణంలో ఈ జాతీయ ప్రాజెక్టుకి కేంద్రం కొర్రీలు కొనసాగుతున్నాయి. దాంతో కేంద్రం వెనక్కి లాగుతున్నట్టుగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి మూలంగా పనులు సాగలేదని స్వయంగా ప్రధాని విమర్శించారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోయినా కేంద్రం ఇవ్వాల్సిన నిధులు మాత్రం విడుదలలో జాప్యం చేస్తోంది. డీపీఆర్ 2 ప్రకారం అంచనాలు సవరించాల్సి ఉన్నప్పటికీ ససేమీరా అంటోంది. పోలవరం పనుల జాప్యంతో పెరిగిన అంచనా వ్యయం సవరించడానికి కేంద్రం సిద్ధంకాకపోవడంతో ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. పునరావాసం సహా పలు కీలకదశల్లో ఉన్న పనులకు ఆటంకం కలుగుతోంది.

గతంలో జాతీయ హోదా ప్రకటించిన నాటి 2013-14 అంచనాల ప్రకారం మాత్రమే నిధులు ఇస్తామంటూ తాజాగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రకటించింది. ఫలితంగా గడిచిన దశాబ్దకాలంగా పెరిగిన ఆర్ అండ్ ఆర్, నిర్మాణ వ్యయం సహా అనేక అంశాలు ఇప్పుడు పెనుభారం కాబోతున్నాయి అందుకు తోడుగా వివిధ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపునకు నిరాకరిస్తూ మొత్తం రూ. 1383 కోట్లకు కొర్రీలు వేస్తోంది. ఇప్పటికే రూ. 830 కోట్ల మేర బిల్లులు చెల్లించబోమని తేల్చిచెప్పింది. ఇప్పుడు తాజాగా మరో రూ. 551 కోట్ల బిల్లులను వెనక్కి పంపించింది. దాంతో కేంద్రం తీరు కారణంగా పోలవరం వ్యవహారం ముందుకు సాగాల్సింది కాస్తా మరింత జాప్యం అవుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది.