iDreamPost
android-app
ios-app

Mandapeta – వైఎస్సార్సీపీకి మంచి రోజులు

  • Published Oct 18, 2021 | 6:31 AM Updated Updated Oct 18, 2021 | 6:31 AM
Mandapeta –  వైఎస్సార్సీపీకి మంచి రోజులు

పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో చాలా జిల్లాలు, నియోజకవర్గాల్లో టీడీపీని వెనక్కినెట్టి పాగా వేయగలిగిన వైఎస్సార్సీపీ 2019లో ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించి ప్రభంజనం సృష్టించింది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పట్టు చిక్కలేదు. అటువంటి వాటిలో తూర్పుగోదావరి జిల్లా మండపేట ఒకటి. వరుసగా గత మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీయే గెలిచింది. అయితే రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ప్రజల ఆలోచనల్లోనూ మార్పు వస్తోంది. దానికి తగినట్లే వైఎస్సార్సీపీ వ్యూహం మార్చి మండపేటలో పట్టు బిగిస్తోంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా తోట త్రిమూర్తులు నియామకం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. క్రమంగా పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. నియోజకవర్గంపై టీడీపీ పట్టు సడలుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు దీన్ని ధృవపరుస్తున్నాయి.

మారుతున్న పరిస్థితులు

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో మండపేట ఒకటి. ఇక్కడ నుంచి ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గత ఎన్నికల్లో జగన్ వేవ్ ను తట్టుకొని మూడోసారి ఎన్నికయ్యారు. 2009, 14 ఎన్నికల్లోనూ అతనే విజయం సాధించారు. సామాజిక సమీకరణలు ఆయనకు కలిసివచ్చాయి. ఆయన సామాజికవర్గమైన కమ్మ వర్గీయులు నియోజకవర్గంలో గణనీయంగా ఉండటం. మరో ప్రధాన సామాజికవర్గం కాపు, శెట్టి బలిజలు కూడా మద్దతు తెలపడంతో వేగుళ్ల విజయాలు సాధిస్తూ వచ్చారు.

Also Read : P Gannavaram TDP – వాంటెడ్ ఇంచార్జి

అయితే వైఎస్సార్సీపీ కొన్నాళ్ల క్రితం కాపు వర్గానికి చెందిన తోట త్రిమూర్తులుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో ఆ వర్గం మొత్తం దాదాపుగా ఆయన వెనుక చేరి వైఎస్సార్సీపీకి జై కొట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అందుకుంటున్న ప్రజలు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. మరోవైపు మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వేగుళ్లపై సహజంగానే కొంత వ్యతిరేకత నెలకొంది. ఇవన్నీ కలిసి ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి భారీ విజయం చేకూర్చాయి. నియోజకవర్గ కేంద్రమైన మండపేట మున్సిపాలిటీని చేజిక్కించుకోవటంతో పాటు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కైవసం చేసుకొని జిల్లా పరిషత్ పీఠాన్ని కూడా పార్టీ దక్కించుకుంది.

మేలు చేసిన నియోజకవర్గ మార్పు

వాస్తవానికి తోట త్రిమూర్తులు రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందినవారు. టీడీపీలో బలమైన నేతగా ఉన్న ఆయన ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. సొంత నియోజకవర్గం రామచంద్రాపురంలో వైఎస్సార్సీపీకి సిటింగ్ ఎమ్మెల్యేగా చెల్లుబోయిన వేణుగోపాల్ ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన పనిచేస్తున్నందున అక్కడ ఖాళీ లేక త్రిమూర్తులు పక్కనే ఉన్న మండపేట బాధ్యతలు అప్పగించారు. ఆ వ్యూహం ఫలిస్తోంది. కాపు సామాజిక వర్గీయులతోపాటు టీడీపీలోని బలమైన ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను త్రిమూర్తులు తనకున్న పరిచయాలతో వైఎస్సార్సీపీలోకి వచ్చేలా చేస్తున్నారు. ఈయన కృషిని గుర్తించిన సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇదే జోరు కొనసాగితే.. త్రిమూర్తులునే ఇంఛార్జిగా కొనసాగిస్తే వచ్చే ఎన్నికలనాటికి టీడీపీ పరిస్థితి దిగజారి, వైఎస్సార్సీపీ విజయం సాధించవచ్చన్న ఆశాభావం ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది.

Also Raed  : Kotia Villages – ఒడిశా పథకాలు మాకొద్దు.. ఆంధ్ర పాలనే ముద్దు