iDreamPost
iDreamPost
పోటీల్లో బాగా పరిగెడితే బంగారు పతకం ఇస్తారు. కానీ ఇక్కడ బంగారం ధర బాగా పరుగెడుతోంది. ఎంతలా ఉంటే మధ్య, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలు కనీసం బంగారం కొనుగోలు చేయాలంటేనే హడలెత్తిపోయే విధంగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. రోజుల వ్యవధిలోనే వెయ్యిరూపాయలు చొప్పున పెరుగుతూ వెళుతోంది. గత 20 రోజులుగా పది గ్రాముల బంగారం ధర దాదాపు 5వేల రూపాయలకు అటూ ఇటూగా పెరుగుతూనే ఉంది. ఈ స్థాయిలో పెరుగుదల సరికొత్త రికార్డులను తాకుతోంది. మార్కెట్ వర్గాలకు ఇది ఎలా ఉన్నప్పటికీ బంగారం సెంటిమెంట్ బలంగా దేశంలో ప్రజలకు మాత్రం కొనుగోలుదారులను టెన్షన్ పెడుతోందనే చెప్పాలి.
శుభకార్యాం ఏ స్థాయిలో చేసినప్పటికీ ఎంతో కొంత బంగారం కొనడం అనే సెంటిమెంట్ దేశంలో బలంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సెంటిమెంట్‌ను కూడా పక్కన పెట్టేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇరవైనాలుగు కేరెట్ల విభాగంలో పది గ్రాముల బంగారం ధర దేశరాజధాని ఢీల్లో రూ. 57,415లు పలికింది. అదే విశాఖలోనైనా 57,670లుగా ఉంది. వెండి ధరలు కూడా బంగారం రూట్లోనే ప్రయాణిస్తున్నాయి. వెండి కేజీ ధర రూ. 74,200గా ఉంది. గత పదిరోజులుగా చూస్తే విశాఖ మార్కెట్‌లో 63వేలకు అటూ ఇటూగా ప్రారంభమై ప్రస్తుతం 74వేల వద్ద తచ్చాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరను అనుసరించే ఇతర అన్ని లోహాల ధరలు ఉంటుంటాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతుంటారు. బంగారం ధర పైపైకి వెళుతున్న నేపథ్యంలో వెండి, రాగి తదితర లోహాల ధరలు కూడా అదే బాటలో నడుస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే ఇదే తరహా పెరుగుదలా కొనసాగుతుందా? లేదా? అన్నది మాత్రం మార్కెట్ నిపుణులు గ్యారెంటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా మాత్రమే బంగారం రేట్లు పరిగెడుతున్నాయని, ఇదే తరహా పెరుగుదల కొనసాగుతుందన్న పక్కా గ్యారెంటీ లభించడం కష్టమేనని వారి వాఖ్యలను బట్టి అర్ధమవుతోంది.