iDreamPost
android-app
ios-app

పుత్తడి పై కేంద్రం పట్టు

  • Published Oct 31, 2019 | 3:52 AM Updated Updated Oct 31, 2019 | 3:52 AM
పుత్తడి పై కేంద్రం పట్టు

 పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్ల ధనాన్ని బంగారం రూపంలోకి మార్చడం ఎక్కువైంది. ఇప్పుడు ఇదే బంగారంపై మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం! ‘మీ వద్ద ఎంత బంగారం ఉందో చెప్పాలి’ అనే కొత్త నిబంధనను తీసుకురానున్నట్లు తెలిసింది. దీనిపై ‘స్వచ్ఛంద వెల్లడి’ పథకాన్ని ప్రవేశపెడుతుంది. నిర్దిష్ట గడువు ప్రకటించి ఆ లోపు ప్రతి ఒక్కరూ తమ వద్ద నిల్వ ఉన్న బంగారం వివరాలు బయటపెట్టాలని స్పష్టం చేస్తుంది. పరిమితికి మించి ఉన్న బంగారంపై పన్ను విధించి ‘అమ్నెస్టీ’(సార్వత్రిక క్షమాభిక్ష) కింద శిక్షించకుండా వదిలేస్తుంది. ఆ తర్వాత కొరడా విదిలిస్తుంది. లెక్కల్లో చూపించని బంగారంపై భారీ జరిమానా విధిస్తుంది.

కొత్తగా కొన్న బంగారు కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెప్పాల్సి ఉం టుంది. రసీదు లేకుండా బంగారం కొంటే భారీ జరిమానాలు తప్పవు. ఒక్కొక్కరు గరిష్ఠంగా ఎంత స్వర్ణం ఉంచుకోవచ్చు, పరిమితికి మించిన బంగారాన్ని స్వచ్ఛందంగా బయటపెడితే ఎంత పన్ను విధిస్తారు, ‘అప్రకటిత’ బంగారంపై విధించే జరిమానా ఎంత?ఈ వివరాలను నిర్ధారించాల్సి ఉంది. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ పన్ను శాఖలు సంయుక్తంగా ప్రతిపాదనలు రూపొందించాయి.

ఆదాయపు పన్నులో కొన్ని మినహాయింపులు ఉన్నట్లే బంగారంపై పన్నుకూ మినహాయింపులు వర్తిస్తాయని తెలుస్తోంది. వివాహమైన మహిళలకు సంబంధించిన నగలపై నిర్దిష్ట విలువ వరకు మినహాయింపు ఇస్తారు. విలువను ప్రభుత్వం గుర్తించిన నిపుణులు నిర్ధారిస్తారు. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు ప్రతినిధులతో కలిసి ‘గోల్డ్‌ బోర్డు’ ఏర్పాటు చేస్తారు. బహుశా ఈ ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. ప్రజలు బంగారు కొనుగోళ్లను కొనసాగించేలా ప్రోత్సహించడంపై ఈ బోర్డు దృష్టి సారిస్తుంది.

 ప్రస్తుతం అమలులో ఉన్న ‘సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌’ పథకాన్ని కూడా మార్చేస్తారు. దీనిని కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దుతారని అధికార వర్గాలు తెలిపాయి. గోల్డ్‌ బాండ్‌ పథకంలో అవిభాజ్య హిందూ కుటుంబం డీమ్యాట్‌ ఫార్మాట్‌లో గరిష్ఠంగా నాలుగు కిలోల వరకు బంగారు కొనవచ్చు. ట్రస్టులు 25 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు. ఇలా కొన్న బంగారం విలువపై 2.5 శాతం వడ్డీ కూడా వస్తుంది.