iDreamPost
iDreamPost
గోదారమ్మ ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, ఉప నదులకు వచ్చిపడుతున్న వరదనీరు వెరసి గోదావరి ఉధృతమవుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 175 గేట్లు తెరిచి 14,13,354 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ స్థాయి నీటి ప్రవాహంలో బ్యారేజీ వద్ద 13.70 అడుగుల నీటిమట్టం నమోదవ్వడంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. అలాగే భద్రచలంలో కూడా 48 అడుగలకు నీటిమట్టం చేరుకోవడంతో రెండో ప్రమాదహెచ్చరికను అమలు చేస్తున్నారు.
గోదావరికి కీలక ఉప నది అయిన శబరికి వరదపోటు పెరుగుతున్న నేపథ్యంలో నీటిమట్టం మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి నది భద్రాచలం వద్ద 48.10 అడుగులు, శబరి నది కూనవరం వద్ద 20.01 మీటర్లు, కుంట వద్ద 14.07 మీటర్లు, తాళ్ళగూడెం వద్ద 14.35 మీటర్లు నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం ప్రస్తుతం 50 అడుగులు దాటింది. రాత్రి 9 గంటల సమయానికి 57 అడుగులను తాకుతుందని అంచనా వేస్తున్నారు.
పోలవరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 28.7 మీటర్లుగా నమోదైంది. స్పిల్‌వే మొత్తం నీటమునిగిపోయింది. 20 గ్రామాల ప్రజలు జలదిగ్భంధంలో ఉన్నారు. కడెమ్మ బ్రిడ్జి పూర్తిగా నీటమునిగిపోయింది. ఉభయగోదావరి జిల్లాలోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పోలీసు, రెవిన్యూ యంత్రాంగం ఇందుకోసం విస్తృతంగా ప్రచారంచేపట్టారు. నార్లవరం, తిర్లాపురం గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసారు. అలాగే కోయిడా, రుద్రంకోట, తాట్కూరుగొమ్ము తదితర 30 గ్రామాల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు సైతం పొంగి ప్రవహిస్తుండడంతో ఎక్కడికక్కడే రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
విస్తృతమైన నదీపరివాహక ప్రాంతం
గోదావరి నదీ పరివాహక ప్రాంతం విస్తృతంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగారాణా రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల్లో మూడు లక్షలకుపైగా చదరపు కిలోమీటర్ల విస్తర్ణంలో గోదావరి నది క్యాచ్‌మెంట్ ఏరియా ఉంటుంది. ఏపీలో 73,201 చదరపు కిలోమీటర్లలో గోదావరి కేచ్‌మెంట్ ఏరియా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లోని వర్షపునీరు, ఉప నదులు, వాగుల ద్వారా వచ్చే నీరుమొత్తం గోదావరి నదికే చేరుతుంది.
ఆగష్టు భయం..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సాగు, త్రాగునీటి అవసరాలు తీర్చే గోదారమ్మ ఆగష్టు నెల వచ్చిందంటే ఉగ్రరూపం చూపిస్తుంటుంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు సాధారణం కన్నా అధికారంలో 34 సార్లు వరదలు రాగా, అందులో 22 సార్లు ఆగష్ణు నెలలోనే సంభవించాయి. 1986లో వచ్చిన వరదలు అత్యంత భారీ నష్టాన్ని కలిగించినట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అప్పట్లో ఆగష్టు 16న 35 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు బ్యారేజీని ముంచెత్తింది. దీంతో ఉభయగోదావరి జిల్లాలోనూ పలు చోట్ల ఏటి గట్లు తెగిపోయి ధన, ప్రాణ నష్టాలు ఏర్పడ్డాయి. అందుబాటులో ఉన్న గోదావరి నదీ చరిత్ర ప్రకారం ఇప్పటి వరకు 1986లో వచ్చిన వరదే అత్యంత భారీ వరద. ప్రస్తుతం నష్ట నివారణకు చేపట్టాల్సిన చర్యలను ఈ వరదలో వచ్చిన నీటి ప్రవాహం ఆదారంగానే అంచనాలు వేస్తారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణాలకు పునాదుల ఎత్తు కూడా 1986లో వచ్చి నీటిమట్టం ఆధారంగానే వేసుకుంటుంటారు.