iDreamPost
iDreamPost
నాలుగు రోజుల పాటు అత్యంత ఉధృతంగా ప్రవహించిన గోదారమ్మ శాంతిస్తోంది. ఉవ్వెత్తున వచ్చిపడిన ఎగువ ప్రాంతాల ముంపునీరు కూడా నెమ్మదించడంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వరద తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం వద్ద 17.40 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. 18,56,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.
నీటి ఉధృతి నెమ్మదిగా తగ్గుతున్న నేపథ్యంలో మరింత దిగువకు నీటిమట్టం చేరుకుంటుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతమైన భద్రాచలంలో కూడా నీటి ఉధృతి తగ్గుతుంది. అక్కడ 43.50 అడుగుల నీటి మట్టం నమోదైంది. దీంతో ముప్పు ముంపు నుంచి కాస్తంత ఉపశమనం లభించినట్లేనని అధికారులు చెబుతున్నారు.
కాగా ఉభయగోదావరి జిల్లాలోని పలు పల్లపు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు లాగేందుకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి నదికి వచ్చేనీరు మొత్తం తగ్గితే తప్ప పల్లపు ప్రాంతాలకు వరదనీటి నుంచి విముక్తి కలిగే అవకాశం ఉండదంటున్నారు.
వరద ప్రభావం వల్ల తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం నీట మునిగింది. లంక గ్రామాలు పూర్తిగా నీటిలో నానుతున్నాయి. కోనసీమలోని ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లోని లంక గ్రామాల్లోని ప్రజలు గోదావరి వరద నీటిలోనే ఉంటున్నారు. ఇళ్లు, పంట పోలాలు నీటమునిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద తగ్గిన తర్వాత గానీ పంట, ఆస్తి నష్టంపై అధికారులు ఓ అంచనాకు వచ్చే అవకాశం లేదు. వరద తగ్గిన తర్వాత పది రోజుల్లో నష్ట వివరాలు పంపాలని నిన్న ఏరియల్ సర్వే తర్వాత సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే.